కావలి: పట్టణంలో టీడీపీ నేతల మధ్య బాహాబాహీ ఆదివారం జరిగింది. జువ్వలదిన్నెలో బోట్ల మాయంపై చర్చిస్తూ వీరి మధ్య వాగ్వాదం జరిగి ఘర్షణకు దారితీసింది. వివరాలు.. జువ్వలదిన్నె బోట్ల విషయమై తుమ్మలపెంట రోడ్డులోని ఓ చోట మద్యం సేవిస్తూ చర్చించసాగారు. ఈ క్రమంలో బీద వర్గానికి చెందిన టీడీపీ కావలి 30వ వార్డు ఇన్‌చార్జి గాదంశెట్టి వేణుగోపాల్‌కు మద్దతుగా ఎమ్మెల్యే వర్గానికి చెందిన ఏఎమ్సీ డైరెక్టర్ ఇడుముక్కల పవన్‌కుమార్ మాట్లాడారు. దీన్ని జీర్ణించుకోలేని ఎమ్మెల్యే కృష్ణారెడ్డి వర్గానికి చెందిన వారు పవన్‌కుమార్‌పై దాడికి పాల్పడ్డారు. స్థానికులు గుర్తించి బాధితుడ్ని కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. కాగా ఆర్యవైశ్యులను లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడ్డారని రాష్ట్ర నేతలు ఆరోపించడంతో టీడీపీకి చెందిన దేవరకొండ శ్రీనివాసులు అనుచరులు మురళి, సారథిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఒకటో పట్టణ సీఐ ఫిరోజ్ దర్యాప్తు చేస్తున్నారు.
రాజీ చర్చలు విఫలం
అందరూ టీడీపీ నేతలే కావడంతో దాడి ఘటనలో రాజీ చేసేందుకు దాదాపు మూడు గంటల పాటు చర్చలు జరిగాయి. అయితే బాధితుడి సామాజికవర్గానికి చెందిన వారు రాష్ట్రస్థాయి నేతలకు సమాచారం అందించారు. వారితో పాటు బాధితుడి బంధువులు సైతం కేసు నమోదు చేయాలని పట్టుబట్టడంతో రాజీ చర్చలు విఫలమయ్యాయి. దీంతో కేసు నమోదు చేశారు.


