నిజం ఒప్పుకుంటూనే దోపిడీదారులకు అండగా నిలిచిన ప్రభుత్వం
లీజుదారులకు వంతపాడుతూ ‘సాక్షి’ కథనంపై వివరణ
50 ఏళ్ల గడువు ముగిసినా లీజులు కొనసాగిస్తున్నట్లు ఒప్పుకోలు
లీజు పొడిగింపునకు ముందే దరఖాస్తు చేసుకున్నారంటూ సాకు
రూ.188 కోట్ల జరిమానా చెల్లించక పోయినా వెనకేసుకొస్తున్న వైనం
సాక్షి, అమరావతి: నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలో సాగుతున్న మైనింగ్ అక్రమాలను ప్రభుత్వం నిస్సిగ్గుగా సమర్థించుకుంటోంది. ‘సైదాపురం గ‘లీజు’కు సర్కారు సై’ శీర్షికన ఆదివారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై ప్రభుత్వం వివరణ ఇచ్చింది. మైనింగ్ లీజు 50 ఏళ్ల గడువు ముగిసిన విషయం వాస్తవమేనని, అయితే లీజుదారులు గడువులోగా దరఖాస్తు చేసుకున్నందున ఆ లీజులు చట్టప్రకారం ఇంకా అమలులో ఉన్నట్లుగానే పరిగణిస్తున్నామని గనుల శాఖ నెల్లూరు జిల్లా అధికారి వివరణ ఇచ్చారు.
ఆయా కంపెనీలు 15,69,334 మెట్రిక్ టన్నుల ఖనిజాన్ని అక్రమంగా తవ్వినట్లు గుర్తించామని, ఇందుకు సంబంధించి నిబంధనల ప్రకారం రూ.188 కోట్లు జరిమానా విధిస్తూ డిమాండ్ నోటీసులు జారీ చేశామని తెలిపారు. ఈ జరిమానా చెల్లించకపోయినా, తాము 10 రెట్లు డెడ్ రెంట్ చెల్లించాము కాబట్టి తమను కూడా ఎల్‌ఓఐ పొందిన వారిగా పరిగణించాలని లీజుదారులు అభ్యర్థించారని చెప్పారు.
కాగా ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 229 ప్రకారం 2025 ఫిబ్రవరి 20లోపు ఎల్‌ఓఐ పొందిన వారికి మాత్రమే లీజులు కొనసాగించే వెసులుబాటు ఉంటుందనే విషయాన్ని ప్రభుత్వం విస్మరించడం ఉద్దేశ పూర్వకమే అని తెలుస్తోంది. నిబంధనల ప్రకారం కటాఫ్ తేదీలోపు ఎల్‌ఓఐ లేని పక్షంలో ఆ గనులను ప్రభుత్వం స్వా«దీనం చేసుకోవాల్సి ఉండగా, అధికారులే వారికి దొడ్డిదారి వెతుకుతుండటం గమనార్హం. వేల కోట్ల రూపాయల ప్రభుత్వ సంపదను కొల్లగొట్టిన కంపెనీలపై క్రిమినల్ కేసులు పెట్టి.. బ్లాక్ లిస్ట్‌లో పెట్టాల్సింది పోయి మళ్లీ వారికే లీజులు ఇవ్వాలని అధికారులు సిఫార్సు చేయడం విశేషం.
ఆ 5 కంపెనీల లీజుల కాలపరిమితి 2012–2022 మధ్యే ముగిసిపోయిందని ఒప్పుకున్న గనుల శాఖ.. గడువు ముగిసిన తర్వాత కూడా కాలయాపన చేస్తూ వారిని మైనింగ్ కొనసాగించేలా ప్రోత్సహిస్తున్నట్లు తేటతెల్లమైంది. అక్రమ మైనింగ్ జరిమానాలపై హైకోర్టు స్టే ఇచ్చిందని అధికారులు సాకు చెబుతున్నారు. కోర్టు కేవలం నోటీసుల సాంకేతికతను ప్రశి్నంచి తాజాగా విచారణ జరిపి మూడు నెలల్లో నివేదిక ఇవ్వమని ఆదేశించింది. ఆ గడువు ముగిసినా అధికారులు నివేదిక ఇవ్వకుండా అక్రమార్కులకు మేలు చేసేందుకు కంకణం కట్టుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. గనుల శాఖ ఇచ్చిన వివరణ వాస్తవాలను కప్పిపుచ్చుతూ, దోపిడీదారులకు కొమ్ముకాసేలా ఉందే తప్ప ప్రభుత్వ ఆదాయాన్ని కాపాడేలా లేదని స్పష్టమైంది.


