హత్యా.. ఆత్మహత్యా? | - | Sakshi
Sakshi News home page

హత్యా.. ఆత్మహత్యా?

Mar 23 2026 9:10 AM | Updated on Mar 23 2026 9:10 AM

మహారాష్ట్ర యువకుడి అనుమానాస్పద మృతి

నెల్లూరు(క్రైమ్‌) : మహారాష్ట్రలో అదృశ్యమైన యువకుడు నగరంలోని బోడిగాడితోట శ్మశానవాటికలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. మృతదేహం పాక్షికంగా కాలిపోయి ఉంది. మృతుని వద్ద సెల్‌ఫోన్‌, మృతదేహం పక్కన సిమ్‌కార్డు, మెమోరీ కార్డులున్నాయి. యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడా.. ఎవరైనా హత్య చేశారా అనే కోణాల్లో నవాబుపేట పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. పోలీసుల వివరాల మేరకు.. మహారాష్ట్ర నాగపూర్‌ జిల్లా బుటిబోరి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో విక్రాంత్‌ రవికాంత్‌ మెష్రామ్‌(22) కుటుంబం నివాసం ఉంటోంది. అతను ఐటీఐ చదివి ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నారు. కొద్దిరోజులుగా పనికి వెళ్లడం లేదు. ఈనెల 20న రాత్రి అతను ఇంటి నుంచి బయటకు వచ్చి తిరిగి వెళ్లలేదు. బాధిత కుటుంబ సభ్యులు బుటిబోరి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

బోడిగాడితోట శ్మశానవాటికలో..

బోడిగాడితోట శ్మశానవాటికలో పాక్షికంగా కాలిపోయిన ఓ యువకుని మృతదేహాన్ని స్థానికులు గుర్తించి డయల్‌ 112 ద్వారా ఆదివారం నవాబుపేట పోలీసులకు సమాచారం అందించారు. నవాబుపేట, బాలాజీనగర్‌ ఇన్‌స్పెక్టర్‌లు జి.వేణుగోపాల్‌రెడ్డి, కె.సాంబశివరావు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహం మొకాళ్ల వరకు కాలిపోయి ఉంది. మృతుని జేబులో సెల్‌ఫోన్ను, పక్కనే ఖైనీ ప్యాకెట్‌ కవర్లో సిమ్‌కార్డు, మెమోరీకార్డులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వాటి సాయంతో మృతుడు విక్రాంత్‌ రవికాంత్‌గా గుర్తించి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. విక్రాంత్‌ కొన్ని రోజులుగా ఎవరితో మాట్లాడకుండా మూడీగా ఉన్నాడని, పనికి సైతం వెళ్లడం లేదని కుటుంబసభ్యులు పోలీసులకు తెలిపారు.

డాగ్‌స్క్వాడ్‌ పరిశీలన

ఘటనా స్థలంతో పాటు పరిసర ప్రాంతాల్లో డాగ్‌స్క్వాడ్‌ కలియ తిరిగింది. క్లూస్‌టీం ఘటనా స్థలంలో వేలిముద్రలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్‌ మార్చురీకి తరలించి నవాబుపేట పోలీసులు అనుమానాస్పద మృతికింద కేసు నమోదు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ జి.వేణుగోపాల్‌రెడ్డి నేతృత్వంలో ప్రత్యేక బృందం విభిన్న కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు. మృతదేహం పాక్షికంగా కాలి ఉండటం, మృతుని వివరాలు తెలిసేలా సిమ్‌కార్డు, మెమోరీకార్డు వంటివి పక్కనే ఉండటంతో మృతుడు ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలోనూ ఆరా తీస్తున్నారు. మృతుడు నాగపూర్‌ నుంచి నెల్లూరుకు ఎందుకు? ఎలా వచ్చాడు? బోడిగాడితోటలో శ్మశానం గురించి అతనికి ఎలా తెలిసింది? ఇక్కడికి ఎలా వచ్చాడు.. అనే వివరాలను తెలుసుకునేందుకు నెల్లూరు ప్రధాన రైల్వేస్టేషన్‌ నుంచి బోడిగాడితోట వరకు ఉన్న సీసీ ఫుటేజ్‌లను, మృతుని కాల్‌ డీటెయిల్స్‌ను పరిశీలిస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని నగర ఏఎస్పీ దీక్ష వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement