నెల్లూరు(దర్గామిట్ట): రబీ సీజన్‌లో అన్నదాతలు పండించిన ధాన్యం సేకరణపై మండల ప్రత్యేకాధికారులు దృష్టి సారించాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో మండల ప్రత్యేకాధికారులతో జేసీ వెంకటేశ్వర్లుతో కలిసి కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. పంట నష్టంపై వ్యవసాయ శాఖ చేపడుతున్న సర్వేపై ప్రత్యేకాధికారులు దృష్టి సారించాలన్నారు. రైస్‌మిల్లులను తనిఖీ చేయాలని ఆదేశించారు. రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు కేంద్రాల్లోని వసతులను పర్యవేక్షించాలన్నారు. రైతులకు గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచాలని, ఈ సమావేశంలో డీఆర్వో విజయకుమార్, డీఎస్‌ఓ లీలారాణి, డీపీఓ వసుమతి, తదితరులు పాల్గొన్నారు.
పది పరీక్షలకు
457 మంది గైర్హాజరు
నెల్లూరు (టౌన్): జిల్లాలో పదో తరగతి పరీక్షలు కొనసాగుతున్నాయి. సోమవారం పది విద్యార్థులకు గణిత పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 28,295 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా, 27,838 మంది రాశారు. 457 మంది గైర్హాజరయ్యారు. డీఈఓ బాలాజీరావు ఆరు కేంద్రాలను తనిఖీ చేయగా, 53 కేంద్రాల్లో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీలు చేశారు.
ఓపెన్ పరీక్షకు 183 మంది గైర్హాజరు
ఏపీ ఓపెన్ పదో తరగతి పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 183 మంది అభ్యాసకులు గైర్హాజరయ్యారు. సోమవారం నిర్వహించిన సైన్స్ అండ్ టెక్నాలజీ పరీక్షకు జిల్లాలో వ్యాప్తంగా 1172 మంది పరీక్షలకు హాజరుకావాల్సి ఉండగా, 989 మంది హాజరయ్యారు.
సముద్ర అన్వేషణపై
దృష్టి సారించాలి
వెంకటాచలం: సముద్ర అన్వేషణ, ఆవిష్కరణలపై విద్యార్థులు దృష్టి సారించాలని డీప్ ఓషన్ మిషన్ డైరెక్టర్ ఎంవీ రమణమూర్తి సూచించారు. కాకుటూరు వద్దనున్న విక్రమసింహపురి వర్శిటీ(వీఎస్‌యూ)లో ఎమ్మెస్సీ మైరెన్ బయాలజీ విద్యార్థులకు ఫెలోషిప్‌లను సోమవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రమణమూర్తి మాట్లాడుతూ డీప్ ఓషన్ మిషన్ ద్వారా భారతదేశం సముద్ర అన్వేషణ, వనరుల వినియోగం, స్థిరమైన అభివృద్ధిలో ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. అనంతరం రమణమూర్తి, ఎన్‌ఐఓటీ బృందం వీఎస్‌యూను సందర్శించి పలు అంశాలపై అధ్యాపకులు, విద్యార్థులతో చర్చలు జరిపారు. వీఎస్‌యూ ప్రాంగణంలో మొక్కలు నాటారు. వీఎస్‌యూ వీసీ అల్లం శ్రీనివాసరావు, ఎన్‌ఐఓటీ ప్రొఫెసర్ బాలాజీ రామకృష్ణన్, డాక్టర్ వినీత్‌కుమార్ పాల్గొన్నారు.
శ్రీవారి దర్శనానికి
18 గంటలు
తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ శిలాతోరణం వద్దకు చేరుకుంది. ఆదివారం అర్ధరాత్రి వరకు 86,091 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 29,664 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 4.21 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 18 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. కాగా సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టం చేసింది.


