విద్యార్థుల జీవితాలతో చెలగాటం | - | Sakshi
Sakshi News home page

విద్యార్థుల జీవితాలతో చెలగాటం

Mar 24 2026 6:54 AM | Updated on Mar 24 2026 6:54 AM

నెల్లూరు (టౌన్‌): ఇంటర్మీడియట్‌ స్పాట్‌లో అధ్యాపకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇంటర్‌ జవాబు పత్రాల మూల్యాంకనంలో జవాబుదారీతనంగా ఉండాల్సిన వారు ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. గుంపులు గుంపులుగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ జవాబు పత్రాలను దిద్దుతుండడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. స్పాట్‌లోకి సెల్‌ఫోన్‌ తీసుకెళ్లకూడదన్న నిబంధనను ఉల్లంఘిస్తున్నారు. మూల్యాంకన ప్రాంగణంలో యథేచ్ఛగా సెల్‌ఫోన్‌ను వినియోగిస్తున్నారు. సీసీ కెమెరాలు ఉన్నా, ఉన్నతాధికారి పర్యవేక్షిస్తున్నా ఏ మాత్రం లెక్క చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మూల్యాంకన ప్రక్రియలో ఎగ్జామినర్లు, ఏసీఓలు, స్క్రూటినైజర్లు బాధ్యతారహితంగా వ్యవహరిస్తుండడంపై పలువురు మండిపడుతున్నారు. జవాబు పత్రాలు దిద్దే సమయంలో ఏకాగ్రత లేకపోతే తక్కువ మార్కులు వేయడం లేదా కౌంటింగ్‌లో తప్పులు దొర్లడం జరుగుతుంది. విద్యార్థులు రీవాల్యూయేషన్‌, రీ కౌంటింగ్‌ చేయించుకున్న సమయంలో ఈ తప్పులు బయటపడుతాయి. మూల్యాంకనంలో కఠినంగా వ్యవహరించాల్సిన స్పాట్‌ వాల్యూయేషన్‌ అధికారి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో అధ్యాపకులు ఇష్టమెచ్చినట్లుగా ఉంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

22 నుంచి ప్రారంభం

ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలకు సంబంధించిన జవాబు పత్రాల మూల్యాంకనం స్టోన్‌హౌస్‌పేటలోని కేఏసీ జూనియర్‌ కళాశాలలో ఈ నెల 22వ తేదీ నుంచి మొదటి స్పెల్‌ జరుగుతోంది. రెండో స్పెల్‌ ఈ నెల 25వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. మొదటి స్పెల్‌లో ఇతర జిల్లాలకు సంబంధించి 3,30,628 జవాబు పత్రాలు జిల్లాకు వచ్చాయి. వీటిల్లో ఇంగ్లిష్‌, మ్యాథమెటిక్స్‌, ఎకనామిక్స్‌, తెలుగు, హిందీ, సంస్కృతం, హిస్టరీ సబ్జెక్టులకు సంబంధించిన జవాబు పత్రాలు ఉన్నాయి. మొదటి స్పెల్‌లో 594 మంది అసిస్టెంట్‌ ఎగ్జామినర్లు, 41 మంది స్క్రూటినైజర్లు, 12 ఏసీఓలతో కలిపి మొత్తం 647 మంది విధులు నిర్వహిస్తున్నారు. రెండో స్పెల్‌లో ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బొటని, జువాలజీ తదితర సబ్జెక్టులకు సంబంధించి మూల్యాంకనం జరగనుంది. ఇందుకు 766 మంది అసిస్టెంట్‌ ఎగ్జామినర్లు, 51 మంది స్క్రూటినైజర్లు, 16 మంది ఏసీఓలు విధులు నిర్వహించనున్నారు. అయితే వీరిలో చాలా మంది అధ్యాపకులు రకరకాల సమస్యలు చెప్పి మూల్యాంకనానికి డుమ్మా కొడుతున్నారు.

రీకౌంటింగ్‌కు విద్యార్థులు

ఇంటర్‌ ఫలితాలు వచ్చిన తరువాత ఎక్కువ మంది విద్యార్థులు తమకు తక్కువ మార్కులు వచ్చాయని రీవాల్యూయేషన్‌, రీ కౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకుంటున్నారు. దీంతో వారికి గతంలో వచ్చిన మార్కుల కంటే అదనంగా పెరుగుతున్న పరిస్థితి ఉంది. అసిస్టెంట్‌ ఎగ్జామినర్‌ పేపరు దిద్దిన తరువాత స్క్రూటినైజర్‌ మళ్లీ పరిశీలించి కౌంటింగ్‌ చేసిన తరువాతే మార్కులను నమోదు చేస్తారు. ఇంత ప్రక్రియ జరుగుతున్నా మూల్యాంకనంలో తప్పులు దొర్లుతు న్న పరిస్థితి. తక్కువ మార్కులు వచ్చాయంటూ కొద్దిమంది విద్యార్థులే రీవాల్యూయేషన్‌, రీకౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకుంటున్నారు. మెజార్టీ విద్యార్థులు ఫీజు చెల్లించలేక మిన్నకుండిపోతున్నారు. దీంతో వారు నష్టపోతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి మూల్యాంకన ప్రక్రియలో అధ్యాపకులు బాధ్యతాయుతంగా వ్యవ హరించి పేపర్లు దిద్దేలా అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

నిబంధనలు బేఖాతరు

మూల్యాంకనంలో ఇంటర్‌బోర్డు నిబంధనలను అధ్యాపకులు బేఖాతరు చేస్తున్నారు. స్పాట్‌కు హాజరయ్యే అధ్యాపకులు తమ సెల్‌ఫోన్లను మూల్యాంకన అధికారి ఉండే గదిలో ఉంచాలి. ఆ తరువాత మూల్యాంకనం చేసే ప్రదేశానికి వెళ్లాలి. అయితే అందరూ సెల్‌ఫోన్లను నేరుగా మూల్యాంకన ప్రదేశానికి తీసుకెళుతున్నారు. కొంతమంది అధ్యాపకులు ఓ వైపు మూల్యాంకనం చేస్తూ మరోవైపు సెల్‌ఫోన్‌లో మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. మూల్యాంకనం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. ఒక్కో అసిస్టెంట్‌ ఎగ్జామినర్‌ రోజుకు 30 పేపర్లు దిద్దాల్సి ఉంది. ఒక్కో పేపరుకు రూ.23.66 చెల్లిస్తున్నారు. అయితే కొంతమంది అధ్యాపకులు సాయంత్రం నిర్ణీత సమయం కంటే ముందుగానే బయటకు వెళుతున్న పరిస్థితి ఉంది. కొంతమంది గుంపుగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ పేపర్లు దిద్దుతున్న పరిస్థితి. దీంతో పేపర్లు దిద్దే సమయంలో ఏకాగ్రత లోపించి మార్కుల కేటాయింపు, మార్కుల కౌంటింగ్‌లో తప్పులు దొర్లే అవకాశం ఉంది. అయినా అధ్యాపకులు ఇవేమి పట్టించుకోకుండా తమకిష్టమొచ్చిన విధంగా పేపర్లను దిద్దుతున్నారు. ఫలితంగా విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉంది.

ఇంటర్‌ స్పాట్‌లో

ఇష్టారాజ్యం

జిల్లాకు 3.30 లక్షల

జవాబు పత్రాలు

కేఏసీ జూనియర్‌ కళాశాలలో స్పాట్‌

1480 మందికిపైగా

అధ్యాపకుల విధులు

సీసీకెమెరాల సాక్షిగా ఇంటర్‌బోర్డు నిబంధనలు బేఖాతరు

యథేచ్ఛగా సెల్‌ఫోన్ల వినియోగం

కబుర్లు చెప్పుకుంటూ మూల్యాంకనం

తరచూ తప్పులు దొర్లుతున్న వైనం

రీ వాల్యూయేషన్‌, రీకౌంటింగ్‌లో పెరుగుతున్న మార్కులు

స్పాట్‌లో సెల్‌ఫోన్లు వినియోగించరాదు

మూల్యాంకన ప్రదేశంలోకి ఎవరూ సెల్‌ఫోన్లు తీసుకెళ్లకూడదు. ఇప్పటికే విధులు నిర్వహిస్తున్న ప్రతిఒక్కరికీ ఆదేశాలు జారీ చేశాం. సెల్‌ఫోన్‌ వినియోగిస్తూ పట్టుబడితే చర్యలు తీసుకుంటాం. విడివిడిగా కూర్చుని శ్రద్ధగా మూల్యాంకనం చేయాలి. వచ్చే నెల 9వ తేదీ నాటికి మూల్యాంకనాన్ని పూర్తి చేయాలని ఆదేశాలు అందాయి. అంతకంటే ముందుగానే పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. – వరప్రసాదరావు, ఆర్‌ఐఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement