నెల్లూరులో టీడీపీ అరాచకం | YSRCP corporator Uma Mahesh harassed to join TDP in Nellore | Sakshi
Sakshi News home page

నెల్లూరులో టీడీపీ అరాచకం

Mar 24 2026 4:35 AM | Updated on Mar 24 2026 4:35 AM

YSRCP corporator Uma Mahesh harassed to join TDP in Nellore

వాటర్‌ప్లాంట్‌ను ధ్వంసం చేస్తున్న జేసీబీ

టీడీపీలో చేరాలంటూ వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్‌ ఉమామహేష్ కు వేధింపులు

నెల్లూరు(బారకాసు): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలు కొనసాగిస్తూనే ఉంది. టీడీపీలో చేరని కారణంగా వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్‌పై కక్షసాధింపు చర్యలకు దిగింది. నెల్లూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో 46వ డివిజన్‌ వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్‌ వేలూరు ఉమామహేష్‌ నిర్వహిస్తున్న వాటర్‌ప్లాంట్‌ను కారణం చూపకుండా, కనీసం సమాచారం ఇవ్వకుండా ఉన్నపళంగా సోమవారం జేసీబీతో కూల్చేశారు.

కార్పొరేటర్‌ ఉమామహేష్‌ 2019లో నాడు మంత్రిగా ఉన్న అనిల్‌కుమార్, అప్పటి 46వ డివిజన్‌ కార్పొరేటర్‌ వి.సుధారాణి సొంత నిధులతో అదే డివిజన్‌లోని చిన్నబజార్‌ ప్రాంతంలో ఉన్న మున్సిపల్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌ ఖాళీ స్థలంలో వాటర్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. అయితే అధికార పార్టీకి చెందిన కొందరు ముఖ్యనేతలు వేలూరు ఉమామహేష్‌ను కొన్నిరోజులుగా టీడీపీలో చేరాలంటూ అనేక విధాలుగా ప్రలోభాలు పెడుతూ వచ్చారు. ఇందుకు ఉమామహేష్‌ ఒప్పుకోకపోవడంతో కక్ష సాధింపు చర్యలకు దిగారు. ఈ నేపథ్యంలోనే వాటర్‌ ప్లాంట్‌ను ఎలాంటి సమాచారం లేకుండానే కార్పొరేషన్‌ అధికారులు ధ్వంసం చేశారు.

ఈ విషయం తెలుసుకున్న ఉమామహేష్‌ స్థానికులతో కలిసి హుటాహుటిన వాటర్‌ప్లాంట్‌ వద్దకు చేరుకుని ఎందుకీ దౌర్జన్యమంటూ కార్పొరేషన్‌ కింది స్థాయి అధికారులను అడిగారు. తమకు ఏమీ తెలియదని పైఅధికారుల ఆదేశాల మేరకు వాటర్‌ ప్లాంట్‌ను తొలగిస్తున్నామని దురుసుగా సమాధానం చెప్పారు. దీనిపై కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా ఇలా చేయడమేమిటని ఉమామహేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ ఘటనపై కార్పొరేటర్‌ ఉమామహేష్‌ చిన్నబజార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికార పార్టీ నేతలు 2024 నుంచి తమ పార్టీలో చేరాలంటూ అందుకు రూ.కోట్లు ఇస్తామని ప్రలోభాలు పెట్టడం,  తనను అనేక దఫాలుగా అడగడం జరిగిందన్నారు. అందుకు తాను ఒప్పుకోకపోవడంతోనే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.  

జిమ్‌ ఏర్పాటు కోసమే తొలగించాం  
నగరంలోని చిన్నబజార్‌ ప్రాంతంలోని మున్సిపల్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌ ప్రాంతంలో ఉన్న ఖాళీ స్థలంలో జిమ్‌ ఏర్పాటు చేయనున్నట్లు కార్పొరేషన్‌ అధికారులు వెల్లడించారు. అందులో భాగంగానే కార్పొరేషన్‌కు చెందిన ఖాళీ స్థలం కాబట్టి అక్కడున్న వాటర్‌ ప్లాంట్‌ను తొలగించాల్సి వచ్చిందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement