సాక్షి, నెల్లూరు జిల్లా: ఎన్టీ రామారావు పెట్టిన తెలుగుదేశం పార్టీ.. చంద్రబాబు, లోకేష్‌ల చేతికి వచ్చాక తెలుగు దొంగల పార్టీగా మారిపోయిందని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్థన్‌రెడ్డి మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం వచ్చాక వ్యవస్థలను తారుమారు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
‘‘రాధాకృష్ణ నాయుడు అలవాట్లకు సోమిరెడ్డి ప్రేరణ అయి ఉంటుంది. రాధాకృష్ణమ నాయుడు చేతి వేలుకు ఉన్న ఉంగరంతో సహా జనం గుర్తు పెట్టారు. రాధాకృష్ణ దొరికినట్లు కనిపించినా.. టీడీపీ నేత లేడని చెప్పడం హాస్యాస్పదం. ఏ హోమియో వైద్యానికి రాధాకృష్ణ వచ్చాడో పోలీసులు చెప్పగలరా?. పోలీస్ వ్యవస్థకు ఇంతకన్నా సిగ్గుచేటు ఉంటుందా?’’ అంటూ కాకాణి ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘టీడీపీ పేరు తెలుగు దొంగలు, తెలుగు డ్రగ్స్ పార్టీగా మారిపోయింది. కూటమి ప్రభుత్వం వ్యవస్థలని తారుమారు చేస్తోంది. కూటమి నేతలు అవినీతి, అక్రమాలు చేస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ చట్టల్ని ఉల్లంఘిస్తున్నారు. టీడీపీ నేత రాధాకృష్ణమ నాయుడు వ్యభిచార కేసులో పట్టుబడ్డాడు. రాధాకృష్ణమ నాయుడిని పథకం ప్రకారం ఆ కేసులోంచి పోలీసులు తప్పించారు. రాధాకృష్ణ హాస్పిటల్‌కి వచ్చాడంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పారు. పోలీసులు దారుణమైన అబద్దాలు చెబుతూ సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారు?
..రాధాకృష్ణతో ఉన్న మహిళని ఏమో ఇబ్బంది పెట్టారు. అమాయకులని, విద్యార్థులని ఇరికించి అసలైన దోషుల్ని విడిచిపెట్టారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాసలీలలు చేస్తుంటే అతన్ని వదిలేశారు. నందికొట్కూరు ఎమ్మెల్యే లాడ్జిలో ఉంటే పోలీసులు ఆయన్ని చీకట్లో పంపించేసి సీసీ పుటేజీలు తీసుకెళ్లిపోయారు. ఎమ్మెల్యేలు కోనేటి ఆదిమూలం, ఆరవ శ్రీధర్, నషీర్ అహ్మద్, కోన రవికుమార్‌లు రాసలీలలు చేస్తుంటే వదిలేశారు. పోలీసుల సహకారంతో కూటమి నేతలు కొవ్వెక్కి ప్రవర్తిస్తున్నారు. నెల్లూరు లాడ్జిల్లో దాడి చేసిన సమయంలో సీసీ ఫుటేజ్ బయటపెట్టండి. అసలైన దోషుల్ని వదిలేసి నిర్ధోధులని పోలీసులు కేసుల్లో ఇరికిస్తున్నారు.
..సోమిరెడ్డి పోలీసులపై ఒత్తిడి తీసుకువచ్చి దోషుల్ని వదిలేస్తున్నారు.. సోమిరెడ్డి ఎన్నోసార్లు మహిళల చేతుల్లో తన్నులు తిన్నాడు.. సోమిరెడ్డి కార్యాలయానికి వివిధ పనులపై వచ్చే మహిళల్ని సోమిరెడ్డి సిబ్బంది లోబరుచుకుంటున్నారు. రాధాకృష్ణ నాయుడిని అర్ధరాత్రి లైట్లు ఆపేసి డిఎస్పీ ఆఫీస్ నుంచి ప్రైవేట్ వాహనాల్లో తప్పించారు. ఈ ఘటనపై ఎస్పీ విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలి. నేను చెప్పేది అబద్ధం అయితే ఏ శిక్షకి అయినా నేను సిద్ధమే. మా ప్రభుత్వం వచ్చాక ఈ ఘటనపై విచారణ చేపడతాం’’ అని కాకాణి గోవర్థన్‌రెడ్డి చెప్పారు.


