
ఎంఐహెచ్‌ఎం కన్వెన్షన్ హాల్ సీజ్
నెల్లూరు (బారకాసు): నెల్లూరు నగర పాలక సంస్థ (42/3 సచివాలయం) పరిధిలోని డైకస్‌రోడ్డు, కోటమిట్ట షాదీమంజిల్ సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఎంఐహెచ్‌ఎం కన్వెన్షన్ హాల్ (కల్యాణ మండపం)ను మంగళవారం ఎన్‌ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు సీజ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన కల్యాణ మండపం విషయమై ఆనుకుని ఉన్న గృహ యజమాని కార్పొరేషన్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఫిర్యాదును పరిశీలించిన ఉన్నత న్యాయస్థానం నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఎంఐహెచ్‌ఎం కన్వెన్షన్ హాల్‌పై తగు చర్యలు తీసుకోవాలని నగర పాలక కమిషనర్‌ను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయినా సంబంధిత ఎన్‌ఎంసీ అధికారులు చర్యలు తీసుకోవడంలో అలసత్వం వహించడంతో సదరు కల్యాణ మండపంలో శుభ కార్యాలయాలు జరుగుతూనే ఉన్నాయి. దీంతో ఈ నెల 4న ‘సాక్షి’లో ‘కట్టుకో.. పైసలిచ్చుకో..! శీర్షికన కథనం ప్రచురితమైంది. స్పందించిన నగర పాలక సంస్థ కమిషనర్ ఆదేశాల మేరకు టౌన్‌ప్లానింగ్ డీసీపీ ఇన్‌చార్జి రఘునందనరావు, టీపీఓ సతీష్‌కుమార్, అధికారులు తమ సిబ్బందితోపాటు రెవెన్యూ, విద్యుత్ శాఖల సిబ్బందితో కలిసి ఎంఐహెచ్‌ఎం కన్వెన్షన్ హాల్‌ను ప్రస్తుతానికి సీజ్ చేశారు. విద్యుత్ కనెక్షన్ కూడా తొలగించేలా చర్యలు చేపట్టారు. తదుపరి చర్యలు కమిషనర్ ఆదేశాల మేరకు చేపట్టనున్నామని డీసీపీ ఇన్‌చార్జి రఘునందనరావు తెలియజేశారు.
19న సీనియర్ బాస్కెట్‌బాల్ జట్టు ఎంపిక
కందుకూరు రూరల్: ఉమ్మడి ప్రకాశం జిల్లా సీనియర్ మహిళలు, పురుషుల బాస్కెట్ బాల్ జట్ల ఎంపిక ఈ నెల 19న మధ్యాహ్నం 2 గంటలకు స్థానిక టీఆర్‌ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో నిర్వహించనున్నట్లు జిల్లా అసోసియేషన్ ప్రెసిడెంట్ వలేటి రవీంద్ర, సెక్రటరీ తొట్టెంపూడి సుబ్బారావు మంగళవారం తెలిపారు. ఎంపికల్లో పాల్గొనే సీ్త్రలు, పురుషులకు వయసు పరిమితి లేదన్నారు. ఎంపికలకు వచ్చే వారు ఆధార్‌కార్డు తీసుకురావాలన్నారు. ఎంపికై న జట్లు విశాఖపట్నంలో జరిగే 11వ సీనియర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చాంపియన్‌షిప్‌లో పాల్గొంటారని తెలిపారు. నవంబర్ 7 నుంచి 10వ తేదీ వరకు పోటీలు జరుగుతాయని తెలిపారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు ఎంపికలకు హాజరుకావాలని కోరారు.
కర్నూలు సభకు 250 బస్సుల కేటాయింపు
నెల్లూరు సిటీ: ఈ నెల16న కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలోని నన్నూరు వద్ద నిర్వహించే ప్రధానమంత్రి భారీ బహిరంగ సభకు నెల్లూరు జిల్లా నుంచి ఏపీఎస్‌ఆర్టీసీ 250 బస్సులు కేటాయించారు. ఆత్మకూరు డిపో నుంచి 31, కందుకూరు 35, కావలి 40, నెల్లూరు డిపో–1 నుంచి 40, నెల్లూరు డిపో–2 నుంచి 50, రాపూరు 25, ఉదయగిరి డిపో నుంచి 29 బస్సులు సభకు వెళ్లనున్నాయి. ఈ బస్సుల్లో పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులు ఎక్కువగా ఉండడంతో నేడు, రేపు ప్రయాణికులు, మహిళా ప్రయాణికులు ఇబ్బందులు పడే అవకాశం ఉంది.

ఎంఐహెచ్‌ఎం కన్వెన్షన్ హాల్ సీజ్