ఖనిజ సంపద.. కొట్టేసేందుకు పెద్ద స్కెచ్‌ | - | Sakshi
Sakshi News home page

ఖనిజ సంపద.. కొట్టేసేందుకు పెద్ద స్కెచ్‌

Oct 17 2025 6:40 AM | Updated on Oct 17 2025 6:40 AM

ఖనిజ

ఖనిజ సంపద.. కొట్టేసేందుకు పెద్ద స్కెచ్‌

ఖనిజ సంపద.. కొట్టేసేందుకు పెద్ద స్కెచ్‌

‘దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి’ అనే సామెతలా అధికారంలో ఉండగానే అడ్డగోలుగా సంపాదించేందుకు కూటమి పెద్దలు రకరకాల స్కెచ్‌లు వేస్తున్నారు.

ఇందులో భాగంగా ప్రభుత్వ గనుల

శాఖ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన రాయల్టీ

బాధ్యతను ‘ప్రైవేటు’పరం చేశారు.

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం కోట, చిల్లకూరు, చిట్టమూరు, వాకాడు పరిధిలో సిలికా, గ్రావెల్‌, బ్లూమెటల్‌, ఇసుక సంపద పుష్కలంగా దొరుకుతాయి. దీనిపై కన్నేసిన కూటమి పెద్దలు ప్రైవేట్‌ సైన్యాన్ని రంగంలోకి దింపారు. అక్రమాలను అరికట్టేందుకు రాయల్టీ వసూళ్లను ప్రైవేట్‌ సంస్థలకు అప్పగించామని సాకు చెబుతూ దొడ్డి దారిలో రూ.కోట్లు కొల్లగొట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ సంపదంతా ఎక్కువ శాతం ప్రభుత్వ భూముల్లో ఉండటంతో చిన్నపాటి అనుమతి తీసుకుంటే చాలు. వాటిని చూపించి పక్కనే ఉన్న ప్రభుత్వ భూమి నుంచి తవ్వకాలు చేపట్టి రూ.కోట్లు కొట్టేయొచ్చు. ఇందులో భాగంగా ఏడాది కాలంగా కూటమి బ్యాచ్‌ గూడూరులో తిష్టవేసి ఖనిజ సంపద గురించి అన్వేషించారు. అయితే తెల్లరాయి, సిలికా తరలింపులు వివాదాస్పదంగా మారడంతో దీనిపై కూటమి ప్రభుత్వం తమకు అనుకూలంగా ఎవరైతే ఉంటారో వారికే సిలికా, ఇసుక, గ్రావెల్‌ (మైనర్‌ మినరల్‌) తరలించేలా అనుమతిచ్చింది.

గనుల శాఖ నిర్వీర్యం

ప్రభుత్వం ఎప్పటికప్పుడు గనుల శాఖ ఆధ్వర్యంలో మైనర్‌ మినరల్‌ తవ్వకాలు, తరలింపులకు సంబంధించి అన్ని అనుమతులిచ్చేది. అయితే కూటమి అధికారం చేపట్టిన తర్వాత ఆ శాఖను నిర్వీర్యం చేస్తూ ప్రైవేట్‌ ఏజెన్సీ ద్వారా రాయిల్టీ వసూళ్లకు అనుమతులను ఇచ్చింది. రెండేళ్లలో ప్రభుత్వానికి రూ.340 కోట్లు చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకుంది. ఇక దొరికిందే తడవు నిబంధనలకు విరుద్ధంగా ఆ ఏజెన్సీ అంతకు రెండింతలు వసూలు చేయడం మొదలు పెట్టింది. అనుచరుల ద్వారా ప్రభుత్వ భూముల్లో అక్రమంగా తవ్వకాలు జరిపి తరలించేలా పక్కా ప్రణాళికలు రూపొందించుకున్నారు. సాధారణంగా సిలికా టన్నుకు రూ.307లు వసూలు చేసేవారు. ఇదే బయటి మార్కెట్‌లో రూ.3 వేలకుపైనే ఉంటుంది. మిగిలిన గ్రావెల్‌, ఇసుక, బ్లూమెటల్‌ పరిస్థితి కూడా దాదాపు అంతే. బయటి మార్కెట్‌ని దృష్టిలో ఉంచుకుని ఒక రాయల్టీ రసీదును చూపించి ఖనిజాన్ని అక్రమంగా తరలించి సొమ్ముచేసుకోవడం ప్రారంభించారు.

అనధికారిక చెక్‌ పోస్టులు

ప్రైవేట్‌ సైన్యం కన్నుగప్పి ఒక్క టన్ను కూడా బయటకు వెళ్లకుండా గూడూరు నియోజకవర్గ పరిధిలోని గొల్లపల్లి, తిప్పవరప్పాడు, చిల్లకూరు మండలంలోని నల్లయగారిపాళెం, చేడిమాల, అంకులపాటూరు, చింతవరం, వరగలి, కోట క్రాస్‌రోడ్డు, బూదనం రోడ్డు, కోట మండలం గూడలి, మెట్టు, కర్లపూడి, కేసవరం, రాఘవాపురం, కోట క్రాస్‌ రోడ్డు, వాకాడు మండలంలో బాలిరెడ్డిపాళెం, వాకాడు బ్యారేజ్‌, చిట్టమూరు మండలంలో మెట్టు, చిట్టమూరులో అనధికారిక చెక్‌ పోస్టులు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రైవేట్‌ ఏజెన్సీ ద్వారా పొందిన రాయల్టీ రసీదు చూపిస్తే వాహనాలకు అనుమతి ఉంటుంది. లేదంటే ఫైన్‌, కేసులు ఇతరత్రా వేధింపులు తప్పవు.

చిల్లకూరులో పోటీ కార్యాలయం

గనులకు సంబంధించి అధికారిక కార్యాలయాలు, చెక్‌పోస్టులు ఉంటాయి. ప్రైవేట్‌ ఏజెన్సీల పుణ్యమా అని వారే చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు. ఇదిలా ఉంటే గూడూరు నెల్లూరు జిల్లాలో ఉన్న సమయంలో గనుల శాఖ కార్యాలయం పూర్తిగా అక్కడే ఉండేది. జిల్లాల మార్పుతో గూడూరు నియోజకవర్గంలో ఎక్కువగా మైనర్‌, మేజర్‌ మినరల్‌ దొరుకుతుండటంతో చిల్లకూరులో గనుల శాఖ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మైనర్‌ మినరల్‌ రాయల్టీ వసూళ్లను ప్రైవేట్‌ ఏజెన్సీకి అప్పగించడంతో వారు చిల్లకూరులో అనధికారికంగా గనుల శాఖ కార్యాలయం ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇకపై ఎవరైనా సిలికా, ఇసుక, గ్రావెల్‌, నల్ల, బ్లూ కంకరను తరలించాలంటే ఇక్కడ రాయిల్టీ చెల్లించి అనుమతులు తీసుకున్న తర్వాతనే తరలించాల్సి ఉంటుంది.

రాయల్టీ బాధ్యత ప్రైవేట్‌కు అప్పగింత

గనుల శాఖకు ఇకపై

ఎటువంటి సంబంధం ఉండదు

వసూళ్ల కోసం గూడూరులో

అనధికారిక చెక్‌పోస్టులు

ప్రైవేట్‌ సైన్యం గుప్పెట్లో సిలికా,

గ్రావెల్‌, ఇసుక సంపద

ఏజెన్సీలే చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలి

మైనర్‌ మినరల్‌ తవ్వకాలు, తరలింపులకు సంబంధించి ఇటీవల ప్రభుత్వం ఏఎంఆర్‌ అనే ఏజెన్సీతో ప్రతి టన్నుకు రాయిల్టీ చెల్లించేలా ఒప్పందం చేసుకుంది. దీంతో ఏజెన్సీకి చెందిన వారు పలు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసుకుని తనిఖీలు చేస్తూ అనుమతులున్న వాహనాలకు మాత్రమే పంపేలా చేస్తున్నారు. ఇది మొత్తంగా ప్రైవేట్‌ ఏజెన్సీకి చెందిన విషయం.

– శ్రీనివాసరావు, గనుల శాఖ ఏడీ

ఖనిజ సంపద.. కొట్టేసేందుకు పెద్ద స్కెచ్‌1
1/1

ఖనిజ సంపద.. కొట్టేసేందుకు పెద్ద స్కెచ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement