
సేవాసదన్‌లో లోటుపాట్లు సరిచేయండి
నెల్లూరు(పొగతోట): జిల్లాలోని సేవాసదన్‌లలో లోటుపాట్లను సరిచేసి పిల్లల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఐసీడీఎస్ పీడీ హేనాసుజన్ ఆదేశించారు. నగరంలోని సేవాసదన్‌లో పిల్లలకిస్తున్న ఆహారం, నివాసం, ఆరోగ్యం, విద్యా తదితర సదుపాయాలను గురువారం పర్యవేక్షించారు. భద్రత చర్యలు, రికార్డులను పరిశీలించిన అనంతరం ఆమె మాట్లాడారు. పిల్లల సంక్షేమం, భద్రత, ఆరోగ్యం, శారీరక, మానసికాభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. డిస్ట్రిక్ట్ మిషన్ నోడల్ ఆఫీసర్ అనూరాధ, మహిళా ప్రాంగణ మేనేజర్ మాధవి, సేవా సదన్ ఇన్‌చార్జి అరుణ తదితరులు పాల్గొన్నారు.