
రైతు ఉత్పత్తి సంఘాలను బలోపేతం చేయాలి
● కలెక్టర్ హిమాన్షు శుక్లా
నెల్లూరు రూరల్: జిల్లాలో వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికత, యాంత్రీకరణను సమ్మిళతం చేసుకుంటూ.. సరికొత్త ఆలోచనలతో రైతు ఉత్పత్తి సంఘాలను బలోపేతం చేయాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా పిలుపునిచ్చారు. రైతు ఉత్పత్తి సంఘాల పురోగతిపై గురువారం నిర్వహించిన జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో రైతు ఉత్పత్తి సంఘాలు 108 ఉన్నాయని, దీన్ని 150కు పెంచాలని ఆదేశించారు. ప్రతి ఎఫ్పీఓ పరిధిలో రైతుల అవసరాల మేరకు వ్యవసాయ యంత్ర పరికరాలను కొనుగోలు చేయాలని, దీనికి బ్యాంకులు సహకారం అందించాలని కోరారు. వరితో పాటు కూరగాయలు, పండ్లు, పూల సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. మార్కెటింగ్ సౌకర్యాలను మెరుగుపర్చేందుకు, ఉత్తమమైన ప్యాకింగ్ విధానాలను అవలంబించేందుకు శిక్షణను ఇవ్వాలన్నారు. అనంతరం రైతు ఉత్పత్తి సంఘాలు తయారు చేసిన కొబ్బరి నూనె, తినుబండారాలను పరిశీలించారు. జిల్లా వ్యవసాయాధికారి సత్యవాణి, మత్స్య, పశుసంవర్థక శాఖల జేడీలు శాంతి, రమేష్‌నాయక్, నాబార్డు డీడీఎం బాబు తదితరులు పాల్గొన్నారు.