
రోజుకో అవినీతి బాగోతం
● నిన్న నకిలీ మద్యం..
నేడు రేషన్ బియ్యం అక్రమ రవాణా
● ధ్వజమెత్తిన మాజీ మంత్రి
కాకాణి గోవర్ధన్‌రెడ్డి
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): నిన్న నకిలీ మద్యం.. నేడు రేషన్ బియ్యం అక్రమ రవాణా దందా.. ఇలా టీడీపీ నేతల బాగోతాలు రోజుకొకటి బయటపడుతున్నాయని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ధ్వజమెత్తారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో గురువారం ఆయన మాట్లాడారు. రేషన్ మాఫియాలో వాటాల పంపకాల్లో తేడాలు రావడంతో ఈ వ్యవహారాన్ని టీడీపీ నేత, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డే స్వయంగా బయటపెట్టారని చెప్పారు. మంత్రి నారాయణ అనుచరులే ఇందులో కీలకపాత్ర పోషిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో విచారణ చేయించాల్సింది పోయి.. మన తప్పులను మనమే బయటపెట్టుకుంటామా అంటూ ఆయన మండిపడటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని చెప్పారు. అవినీతి సొమ్మును పంచుకోవాలే గానీ అల్లరి చేసుకోవద్దంటూ ఆయన కూటమి ధర్మంపై ఉపదేశాలిస్తుండటాన్ని చూస్తున్న జిల్లా ప్రజలు నివ్వెరపోతున్నారని చెప్పారు. జిల్లా కేంద్రంగా పచ్చ పార్టీ నేతలు సాగిస్తున్న ఈ దందాను తమ పార్టీ అడ్డుకుంటుందని స్పష్టం చేశారు.
పూర్తి స్థాయిలో
దర్యాప్తు చేయించగలరా..?
రేషన్ మాఫియా వెనుక అధికార పార్టీకి చెందిన నేతలున్నారని, వీరికి సివిల్ సప్లయ్స్ అధికారులు వంతపాడుతున్నారని, వీటిపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్‌ను కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి డిమాండ్ చేశారన్నారు. మంత్రి నారాయణకు చెందిన ముఖ్య అనుచరులున్నారని ఆరోపించారని, పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఆయన వ్యాఖ్యల ద్వారా అర్థం చేసుకోవచ్చని చెప్పారు. అనంతసాగరానికి చెందిన వారు, నగరానికి చెందిన ముగ్గురు కలిసి నడిపిస్తున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి జిల్లాలో రేషన్ మాఫియా చెలరేగిపోతోందని, దీనికి అధికార పార్టీ నేతలే సూత్రధారులుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.
యథేచ్ఛగా విదేశాలకు తరలింపు
జిల్లాలో దాదాపు తొమ్మిది వేల టన్నుల బియ్యం.. మాఫియా చేతుల్లోకి వెళ్లి అక్రమంగా రవాణా అవుతోందని ఆరోపించారు. జిల్లాలోని పలు రైస్‌మిల్లుల్లో నేరుగా రేషన్ బియ్యాన్ని పాలిష్ చేసి.. చైన్నె మార్కెట్‌కు.. కృష్ణపట్నం పోర్టు నుంచి విదేశాలకు తరలిస్తున్నారని చెప్పారు. ప్రజల పొట్టగొట్టి, అక్రమంగా తరలిద్దామనుకుంటే సహించేదిలేదని స్పష్టం చేశారు.
నారాయణా...
ఏమిటీ బెదిరింపులు..?
టీడీపీ నేతలతో మంత్రి నారాయణ మాట్లాడిన ఆడియో రికార్డును వినిపించారు. ఆయన సొంత జిల్లాలో రేషన్ మాఫియా పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతోందనేది బహిరంగ రహస్యమని పేర్కొన్నారు. బాధ్యత గల హోదాలో ఉన్న ఆయన రేషన్ బియ్యం మాఫియాపై తనకు సమాచారమివ్వండి.. నిరోధిద్దాం అని చెప్పాల్సింది పోయి అందుకు విరుద్ధంగా వ్యవహరించారని విమర్శించారు. ఈ బెదిరింపులు ఏమిటని ప్రశ్నించారు. నెల్లూరు, వైఎస్సార్ కడప, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని మిల్లులను కూటమి పార్టీల నేతలు అద్దెకు తీసుకొని నడిపిస్తున్నారని, రేషన్ డీలర్ల నుంచి బియ్యాన్ని కొనుగోలు చేసి, అక్రమంగా సరఫరా చేస్తున్నారని ఆరోపించారు.