
శ్రీగంధం చెట్ల నరికివేత
ఉదయగిరి రూరల్: మండలంలోని కొండాయపాళెం పంచాయతీ మాసాయిపేట బీసీ కాలనీ సమీపంలో ఉన్న గానుగపెంటపల్లి గ్రామానికి చెందిన నారాయణరెడ్డి అనే రైతు పొలంలో గుర్తుతెలియని వ్యక్తులు శ్రీగంధం చెట్టు నరికి తీసుకెళ్లారు. గురువారం ఆయన మాట్లాడుతూ తన వ్యవసాయ పొలంలో 35 ఏళ్ల నుంచి శ్రీగంధం చెట్లు సాగు చేస్తున్నట్లు చెప్పారు. మూడేళ్ల క్రితం కూడా తోటలో 16 చెట్లు నరికి తీసుకెళ్లారన్నారు. అలాగే ఈనెల 8న ఒక చెట్టును నరికి తీసుకెళ్లగా పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు. తాజాగా బుధవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు రెండు చెట్లను నరికారని, ఒక చెట్టు దుంగను తీసుకెళ్లినట్లు చెప్పారు. పోలీసులు స్పందించి న్యాయం చేయాలని కోరారు.
అదుపుతప్పి.. రోడ్డుకు
అడ్డుగా నిలిచి..
● డివైడర్ కోసం పెట్టిన రాళ్లను ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు
● తప్పిన ప్రమాదం
● 2 కిలోమీటర్ల మేర స్తంభించిన ట్రాఫిక్
దగదర్తి: మండలంలోని అల్లూరు రోడ్డు రైల్వే బ్రిడ్జి జాతీయ రహదారిపై గురువారం వేగంగా వెళ్తున్న లారీని ఓవర్‌టేక్ చేసే క్రమంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి డివైడర్ కోసం ఏర్పాటు చేసిన రాళ్లను ఢీకొంది. బస్సు డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో బోల్తా పడకుండా రహదారికి అడ్డుగా నిలిచిపోయింది. అందులో ఉన్న ప్రయాణికులకు ఏమీ కాలేదు. రెండు లేన్ల రహదారి కావడం.. అడ్డు గా బస్సు నిలిచిపోవడంతో సుమారు రెండు కిలోమీటర్ల మేర ఇరువైపులా ట్రాఫిక్ స్తంభించిపోయింది. సమాచారం అందుకున్న ఎస్సై జంపాని కుమార్ తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టారు. క్రేన్ సాయంతో బస్సును పక్కకు తొలగించారు. ఈ ప్రదేశంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నా హైవే అధికారులు సూచిక బోర్డులు ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని వాహనచోదకులు ఆరోపిస్తున్నారు. డివైడర్ కోసం ఏర్పాటు చేసిన రాళ్లు రాత్రి వేళల్లో కనిపించేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.
19న ఎల్‌ఐసీ ఏఓఐ
డివిజన్ మహాసభ
నెల్లూరు(అర్బన్): ఎల్‌ఐసీ ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా నెల్లూరు డివిజన్ (నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలు) 6వ మహాసభ ఈనెల 19వ తేదీన కందుకూరులోని యూటీఎఫ్ భవన్‌లో జరుగుతుందని ఆ సంఘం రాష్ట్ర నిర్వహణ కార్యదర్శి రాజశేఖర్ తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫ్లెక్సీలను గురువారం నెల్లూరు దర్గామిట్టలోని డివిజన్ కార్యాలయం వద్ద, అలాగే సిటీ బ్రాంచ్ – 1 కార్యాలయం వద్ద ఆవిష్కరించారు. రాజశేఖర్ మాట్లాడుతూ ఎల్‌ఐసీలో జీఎస్టీ ఎత్తేయడానికి ప్రధాన కారణం ఏఓఐ చేసిన పోరాటాలేనన్నారు. అలాగే ఎల్‌ఐసీలో పెట్టుబడులు ఉపసంహరించుకోవడానికి వ్యతిరేకంగా, ఏజెంట్ల కమీషన్ తగ్గించడం ఒప్పుకోమంటూ చిత్తశుద్ధితో పోరాటాలు చేసింది తమ ఏఓఐ సంఘమన్నారు. ప్రజల ప్రీమియానికి భద్రత ఉండాలంటే ఎల్‌ఐసీ ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలన్నారు. నాయకులు హజరత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కండలేరులో
59.910 టీఎంసీలు
రాపూరు: కండలేరు జలాశయంలో గురువారం నాటికి 59.910 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. సోమశిల జలాశయం నుంచి కండలేరుకు 4,000 క్యూసెక్కుల నీరు చేరుతోందన్నారు. కాగా కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 2,050, పిన్నేరు కాలువకు 300, లోలెవల్ కాలువకు 40, హైలెవల్ కాలువకు 200, మొదటి బ్రాంచ్ కాలువకు 5 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.

శ్రీగంధం చెట్ల నరికివేత

శ్రీగంధం చెట్ల నరికివేత