
దసరా ఉత్సవాల్లో విచ్చలవిడిగా జూదం
● అనికేపల్లిలో డైమండ్ డబ్బా నిర్వహణ
● నిర్వాహకులకు టీడీపీ నాయకుల అండ
● పట్టించుకోని అధికారులు
వెంకటాచలం: దసరా పండగ సందర్భంగా మండలంలోని అనికేపల్లి గ్రామదేవత ఆలయంలో మూడు రోజులపాటు ఉత్సవాలు జరుగుతాయి. తొలిరోజైన మంగళవారం గ్రూపు డ్యాన్స్‌లు వేయించారు. అలాగే విచ్చలవిడిగా డైమండ్ డబ్బా నిర్వహించారు. ఉత్సవాలను తిలకించేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అత్యధిక సంఖ్యలో యువకులు వచ్చారు. టీడీపీ నాయకుల అండతో నిర్వాహకులు మంగళవారం మధ్యాహ్నం నుంచి డైమండ్ డబ్బా జూదాన్ని నిర్వహించారు. బుధవారం తెల్లవారుజామున వరకు ఇది జరిగింది. ఈ ఏడాది ఆగస్టు నెలలో గొలగమూడిలోని వెంకయ్యస్వామి ఆరాధనోత్సవాల సందర్భంగా ఈ జూదం జరిగినా పోలీసులు పట్టించుకోలేదు. దీంతో నిర్వాహకులు అనికేపల్లిలోనూ దర్జాగా జరిపి భారీగా సొమ్ము చేసుకున్నారు. అనికేపల్లి, గొలగమూడి గ్రామాల్లో ప్రతి ఆదివారం డైమండ్ డబ్బా సాగుతుండటంతో తమ కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తగిన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.