విద్యుత్‌ చార్జీల్లో రూ.32.24 కోట్ల తగ్గింపు | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ చార్జీల్లో రూ.32.24 కోట్ల తగ్గింపు

Oct 4 2025 1:33 AM | Updated on Oct 4 2025 1:33 AM

విద్యుత్‌ చార్జీల్లో రూ.32.24 కోట్ల తగ్గింపు

విద్యుత్‌ చార్జీల్లో రూ.32.24 కోట్ల తగ్గింపు

నవంబర్‌ నుంచి బిల్లుల్లో తగ్గింపు

నెల్లూరు (వీఆర్సీ సెంటర్‌): ఆంధ్రప్రదేశ్‌ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌ (ఏపీఈఆర్సీ) ఆదేశాల మేరకు గతంలో ట్రూఅప్‌ చార్జీల పేరుతో అదనంగా వసూలు చేసిన రూ.32.24 కోట్లను తిరిగి ట్రూ డౌన్‌ ద్వారా వినియోగదారుల బిల్లుల్లో తగ్గిస్తామని ఎస్పీడీసీఎల్‌ జిల్లా సర్కిల్‌ ఎస్‌ఈ రాఘవేంద్రం చెప్పారు. నగరంలోని విద్యుత్‌ భవన్‌లో విలేకరుల సమావేశంలో శుక్రవారం ఆయన మాట్లాడారు. జిల్లా సర్కిల్‌ పరిధిలోని ఆత్మకూరు డివిజన్లో రూ.2.25 కోట్లు.. కావలి డివిజన్లో రూ.4.57 కోట్లు.. కోవూరు డివిజన్లో రూ.6.5 కోట్లు.. నెల్లూరు రూరల్‌ డివిజన్లో రూ.10.80 కోట్లు.. నెల్లూరు టౌన్‌ డివిజన్లో రూ.8.25 కోట్లను విద్యుత్‌ బిల్లుల్లో వచ్చే నెల నుంచి తగ్గించనున్నామని వివరించారు. జిల్లా సర్కిల్‌లోని తొమ్మిది లక్షల మంది వినియోగదారులకు మేలు చేకూరనుందన్నారు.

శ్రీవారి దర్శనానికి

20 గంటలు

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లో కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోయాయి. స్వామివారిని 75,188 మంది గురువారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 31,640 మంది భక్తులు అర్పించారు. స్వామి వారికి కానుకల రూపంలో హుండీలో రూ.2.66 కోట్లను సమర్పించారు. టైమ్‌స్లాట్‌ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనం లభిస్తోంది. టికెట్లు లేని వారికి 20 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు కలిగిన వారికి మూడు గంటల్లోనే తిరుమలేశుడి దర్శనం లభిస్తోంది. సర్వదర్శన టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టం చేసింది.

రీ సర్వేతో భూ సమస్యలకు

పరిష్కారం

వెంకటాచలం: రీ సర్వేతో భూ సమస్యలను పరిష్కరించనున్నామని జిల్లా సర్వే ఇన్‌స్పెక్టర్‌ రఘురామరాజు పేర్కొన్నారు. మూడో విడత రీ సర్వేపై మండలంలోని పూడిపర్తిలో శుక్రవారం నిర్వహించిన అవగాహన ర్యాలీలో ఆయన మాట్లాడారు. రైతులు తమ పొలాల వద్ద ఉండి సహకరించాలని కోరారు. మండల సర్వేయర్‌ సూర్యనారాయణ, రీ సర్వే డీటీ సతీష్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

విధుల నుంచి

ఉపాధి ఎఫ్‌ఏ తొలగింపు

దుత్తలూరు: మండలంలోని నరవ్రాడ పంచాయతీలో ఉపాధి హామీ పథక క్షేత్ర సహాయకుడిగా పనిచేస్తున్న హరికృష్ణను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులను డ్వామా పీడీ గంగాభవానీ జారీ చేశారు. ఇవి మండల పరిషత్‌ కార్యాలయానికి చేరాయని ఎంపీడీఓ చెంచమ్మ తెలిపారు. నర్రవాడ పంచాయతీలో ఉపాధి పథకంలో ఎఫ్‌ఏగా చేరిన హరికృష్ణ తన బంధువులు, గ్రామాల్లో లేని వారి పేర్లతో ఇష్టారాజ్యంగా మస్టర్లు వేసి నిధులను స్వాహా చేశారంటూ జిల్లా అధికారులకు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఏడాది జూన్‌లో విచారణకు డ్వామా ఉన్నతాధికారులు ఆదేశించారు. విచారణ జరిపిన అధికారులు నిధులను స్వాహా చేశారనే అంశాన్ని నిర్ధారించి నివేదికను పీడీకి సమర్పించారు. దీంతో విధుల నుంచి తొలగించడంతో పాటు స్వాహా చేసిన రూ.2.56 లక్షల రికవరీ, క్రిమినల్‌ కేసు నమోదు చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశిస్తూ పీడీ నుంచి ఉత్తర్వులందాయని ఎంపీడీఓ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement