
చంద్రబాబు రైతు ద్రోహి
పథకాలను నిలిపితే ఊరుకునేదిలేదు
● ధాన్యాన్ని విక్రయించాక
కొనుగోలు కేంద్రాలా..?
● ధ్వజమెత్తిన మాజీ మంత్రి
కాకాణి గోవర్ధన్‌రెడ్డి
మనుబోలు: తనకెంతో విజన్ ఉందంటూ సీఎం చంద్రబాబు తరచూ చెప్పుకొంటారని.. వరి కోతలు కోసి ధాన్యాన్ని తక్కువ ధరలకే తెగనమ్ముకున్నాక ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. మండలంలోని రాజవోలుపాడులో వరి కోతలు పూర్తయిన పొలాలను గురువారం పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. చంద్రబాబు రైతు ద్రోహి అని ధ్వజమెత్తారు. గతేడాది ఇదే సమయంలో ధాన్యం పుట్టి ధర రూ.24 వేల నుంచి రూ.25 వేల వరకు ఉండిందని, అయితే ప్రస్తుతం రూ.15 వేల్లోపే పలుకుతోందని చెప్పారు. అసెంబ్లీలో స్థానిక ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తూతూమంత్రంగా ప్రస్తావించి చేతులు దులుపుకొన్నారని మండిపడ్డారు. అధికార పక్షంలో ఉన్న ఆయన.. సీఎంకు చెప్పి ధాన్యానికి గిట్టుబాటు ధరను ఎందుకు కల్పించలేకపోయారని ప్రశ్నించారు. దళారులకు లాభం చేకూర్చేందుకే.. ఇప్పుడు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు.
భారీగా ఎగ్గొట్టారు..
గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో 54 లక్షల మందికి రైతు భరోసాను అందించారని, అయితే ప్రస్తుత ప్రభుత్వం 47 లక్షల మందికే ఇస్తున్నామని చెప్తూ.. మిగిలిన వారికి ఎగ్గొట్టి రైతు సేవా కేంద్రాల చుట్టూ తిప్పుకొంటోందని ఆరోపించారు. యూరియా లభించక రైతులు తీవ్ర ఆవేదనతో ఉన్నారని తెలిపారు. డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే గత ప్రభుత్వ హయాంలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారంటూ తప్పుడు ప్రచారాన్ని చంద్రబాబు చేస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో వ్యవసాయ శాఖ మంత్రిగా తాను పంటల ధరలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ రైతులను అన్ని విధాలా ఆదుకున్న అంశాన్ని ప్రస్తావించారు. నేతలు మోటుపల్లి వెంకటేశ్వర్లు, దాసరి భాస్కర్‌గౌడ్, జెట్టి సురేంద్రరెడ్డి, మందల వెంకటశేషయ్య, ఈగా సురేష్ తదితరులు పాల్గొన్నారు.
పొదలకూరు: రాజకీయ ఒత్తిళ్లతో అర్హులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను నిలిపితే ఊరుకునేది లేదని మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి స్పష్టం చేశారు. మండలంలోని మొగళ్లూరు, నావూరుపల్లిలో పర్యటించిన ఆయన మాట్లాడారు. నావూరుపల్లికి చెందిన చొప్పా రాజమ్మకు వృద్ధాప్య పింఛన్‌ను నిలిపివేయడం దారుణమని, ఈ వ్యవహారమై హైకోర్టును ఆమె ఆశ్రయించడంతో బకాయిలతో సహా పింఛన్ మొత్తాన్ని చెల్లించాలని ఆదేశాలు జారీ అయ్యాయని వివరించారు. దీంతో ఆమెకు పింఛన్‌ను ఈ నెల ఒకటినే అందజేశారని వివరించారు. అధికారులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించి.. టీడీపీ నేతల మాటలను నమ్మి పథకాలను నిలిపేస్తే ప్రభుత్వం మారాక విచారణను జరుపుతామని వివరించారు.
అదుపుతప్పిన శాంతిభద్రతలు
సర్వేపల్లి నియోజకవర్గంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపుతప్పాయని కాకాణి ధ్వజమెత్తారు. మండలంలోని కల్యాణపురంలో శుక్రవారం పర్యటించిన ఆయన నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి ఆయన కుమారుడు బరితెగించి విచ్చలవిడిగా అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అక్రమార్జనతో రూ.కోట్లు వెనుకేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. హత్యలు, ఆక్రమణలు, బెదిరింపులు, దాడులు, అక్రమ కేసులు, బ్లాక్‌మెయిలింగ్ తారస్థాయికి చేరాయని విమర్శించారు. అనంతరం గ్రామానికి చెందిన అక్కెం వెంకటేశ్వరరెడ్డి, లక్ష్మీదేవి గృహ ప్రవేశ కార్య క్రమానికి హాజరయ్యారు. నేతలు బచ్చల సురేష్‌కుమార్‌రెడ్డి, పెదమల్లు రమణారెడ్డి, కోనం చినబ్రహ్మయ్య, వెన్నపూస దయాకర్‌రెడ్డి, వెన్నపూస కృష్ణారెడ్డి, ఆకుల గంగిరెడ్డి, రావుల ఇంద్రసేన్‌గౌడ్, ఆకుల గణేష్‌రెడ్డి, యనమల శ్రీనివాసులురెడ్డి, చెన్నూరు గంగిరెడ్డి, విజయలక్ష్మి, ఆకుల లక్ష్మి, గాలం వెంగయ్య, రమేష్, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.