
సత్ప్రవర్తనతో మెలగాలి
వెంకటాచలం: తప్పులను మరోసారి చేయకుండా.. ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలని జిల్లా ఫ్యామిలీ కోర్టు, సెషన్స్ జడ్జి నిఖిత సూచించారు. మండలంలోని చెముడుగుంట వద్ద గల జిల్లా కేంద్ర కారాగారంలో గాంధీ జయంతి, ఖైదీల సంక్షేమ దినోత్సవాన్ని గురువారం నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం ఆమె మాట్లాడారు. చేసిన తప్పులు గతమని, భవిష్యత్తు అనే దిశగా ముందుకు సాగాలని సూచించారు. అనంతరం న్యాయసేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి వాణి మాట్లాడారు. గాంధీ చూపిన అహింస మార్గం జీవితంలో కొత్త అఽధ్యయానికి నాంది కావాలని సూచించారు. మార్పువైపు అడుగులేస్తూ, జైలు నుంచి బయటకొచ్చాక సత్ప్రవర్తనతో మెలగాలని కాంక్షించారు. అనంతరం ఖైదీలకు వివిధ పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు. కేంద్ర కారాగార సూపరింటెండెంట్ సన్యాసిరావు, జైలర్లు రవిబాబు, శివశంకర్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.