
సమర్థంగా సాగునీటి వ్యవస్థ నిర్వహణ
● కలెక్టర్ హిమాన్షు శుక్లా
నెల్లూరు రూరల్: జిల్లాలో సాగునీటి వ్యవస్థను సమర్థంగా నిర్వహించాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశించారు. జిల్లాలోని రిజర్వాయర్లు, చెరువుల్లో సాగునీటి నిల్వలు, ఇరిగేషన్ పనులు, మరమ్మతులపై కలెక్టరేట్లోని తన చాంబర్‌లో శుక్రవారం సమీక్షించిన అనంతరం ఆయన మాట్లాడారు. సోమశిల, కండలేరు జలాశయాల్లో నీటి నిల్వలు సమృద్ధిగా ఉన్న నేపథ్యంలో అన్ని మేజర్, మైనర్ చెరువులను 50 శాతానికిపైగా నీటితో నింపాలని సూచించారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్వహణ పనులకు సంబంధించిన నిధులను మంజూరు చేస్తామని వెల్లడించారు. కండలేరు, సర్వేపల్లి రిజర్వాయర్ల వద్ద అత్యవసర పనులకు నిధులను కేటాయిస్తామన్నారు. ఆర్‌ఆర్‌ఆర్ స్కీమ్ ద్వారా ఎంపిక చేసిన పనులపై ప్రతిపాదనలను వెంటనే పంపాలని సూచించారు. పంట కాలువలు, చెరువుల్లో గుర్రపు డెక్క, పూడికతీత, రిజర్వాయర్ల వద్ద షట్టర్ల మరమ్మతులను వెంటనే చేపట్టాలన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా చెరువులు, కాలువల బలోపేతానికి చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ఉద్యాన పంటలు, పండ్ల తోటల పెంపకంపై అవగాహన కల్పించాలని కోరారు. ఇరిగేషన్, సోమశిల ప్రాజెక్ట్ ఎస్‌ఈలు దేశ్‌నాయక్, వెంకటరమణారెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి సత్యవాణి, డ్వామా పీడీ గంగాభవానీ తదితరులు పాల్గొన్నారు.
జిల్లాకు అవార్డులు
స్వర్ణాంధ్ర.. స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా జిల్లాకు రాష్ట్ర స్థాయిలో రెండు, జిల్లా స్థాయిలో 48 అవార్డులు లభించాయని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా స్థాయి అవార్డు గ్రహీతలను జిల్లా ఇన్‌చార్జి మంత్రి, ప్రజాప్రతినిధులు ఈ నెల ఆరున సత్కరించనున్నారని వివరించారు.