
అన్నదాతపై మొసలి కన్నీరు
పొదలకూరు: రైతుల సమస్యలపై కూటమి ప్రభుత్వం మొసలి కన్నీరు కారుస్తూ.. ధాన్యాన్ని విక్రయించాక కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామని ప్రకటించడం దారుణమని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని నేదురుమల్లిలో బుధవారం పర్యటించిన ఆయన రైతులతో ముచ్చటించి వారి సమస్యలను ఆరాతీశారు. అనంతరం ఆయన మాట్లాడారు. ధాన్యం దిగుబడయ్యాక కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. అయితే ధాన్యానికి గిట్టుబాటు ధర లభించక మిల్లర్లకు నష్టాలకు విక్రయించాక తాపీగా వీటిని ఏర్పాటు చేస్తామనడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. పుట్టి ధాన్యాన్ని రూ.12 వేలకు అన్నదాతలు తెగనమ్ముకుంటే.. సోమిరెడ్డి మాత్రం అసెంబ్లీలో మొక్కుబడిగా ప్రస్తావించి చేతులు దులుపుకొన్నారని విమర్శించారు. ప్రజల నుంచి అధిక విద్యుత్ చార్జీలను వసూలు చేసిన చంద్రబాబు నేరం చేశారని ఆరోపించారు. వీటిని 12 వాయిదాల్లో చెల్లిస్తాననడం దారుణమని పేర్కొన్నారు. అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలను తగ్గిస్తానని హామీ ఇచ్చిన ఆయన.. వీటిని పెంచి ప్రజల నడ్డి విరిచారని మండిపడ్డారు.
అవినీతిలో కూరుకుపోయిన సోమిరెడ్డి
రైతులను ఆదుకోవడాన్ని అటుంచి కుమారుడితో కలిసి గ్రావెల్, మట్టి, ఇసుక, బూడిదను అక్రమంగా తరలించడంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి బిజీగా ఉన్నారని కాకాణి ఆరోపించారు. ఉద్యోగాలు అమ్ముకోవడం, బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేయడం వంటి కార్యక్రమాలతో పాటు అసాంఘిక శక్తులను పెంచి పోషిస్తున్నారని ధ్వజమెత్తారు. ఆయనకు ఓటెందుకు వేశామని రైతులతో పాటు ప్రజలు తమను తాము ప్రశ్నించుకుంటున్నారని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వ మోసాలను ప్రశ్నించడమే కాకుండా సోమిరెడ్డి అవినీతి కార్యకలాపాలను అడ్డుకున్నందుకే తనపై అక్రమ కేసులు బనాయించారని పేర్కొన్నారు. ఆయన అక్రమాలకు సహకరిస్తున్న అధికారులెవర్నీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని.. ప్రజాకోర్టులో వారిని ఎండగట్టడం ఖాయమని స్పష్టం చేశారు. అనంతరం అనారోగ్యంతో బాధపడుతున్న పతకమూరి నాగయ్యను పరామర్శించారు. ఆపై చీర్ల వెంకటేశ్వర్లు కుమార్తె వివాహ వేడుకలకు హాజరయ్యారు. బచ్చల సురేష్‌కుమార్‌రెడ్డి, ఎంపీటీసీ పెంచలనాయుడు, సర్పంచ్ ఉడతా రమేష్, వెంకటశేషయ్య, రవి, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.
నిర్దయగా వ్యవహరిస్తున్న
కూటమి ప్రభుత్వం
ధాన్యాన్ని విక్రయించాక కొనుగోలు
కేంద్రాలా..?
అసెంబ్లీలో సోమిరెడ్డి మొక్కుబడి ప్రస్తావన
ధ్వజమెత్తిన కాకాణి గోవర్ధన్‌రెడ్డి