
టీబీ రహిత జిల్లాగా మార్చేందుకు సహకారం
నెల్లూరు(అర్బన్): టీబీ రహిత జిల్లాగా నెల్లూరును మార్చేందుకు ప్రైవేట్ ఆస్పత్రుల డాక్టర్లు సహకరించాలని జిల్లా టీబీ నివారణ అధికారి డాక్టర్ ఖాదర్‌వలీ కోరారు. గురువారం ఆయన తన బృందంతో కలిసి నగరంలోని అరవింద్ కిడ్నీ సెంటర్, పలు కార్పొరేట్ ఆస్పత్రులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఖాదర్‌వలీ మాట్లాడుతూ నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రాంలో భాగంగా జిల్లాలో పెద్ద సంఖ్యలో రోగులకు స్క్రీనింగ్ కార్యక్రమం వైద్యశాఖ ఆధ్వర్యంలో చేపట్టామన్నారు. అలాగే ప్రైవేట్ ఆస్పత్రులకు వచ్చే రోగుల్లో ఎవరికై నా రెండు వారాలకు మించిన దగ్గు, జ్వరం వస్తుంటే అలాంటి వారిని ప్రభుత్వాస్పత్రికి పంపి గళ్ల పరీక్ష చేయించాలని కోరారు. బరువు తగ్గినా, ఆకలి మందగించినా కూడా టీబీ ఆస్పత్రికి రెఫర్ చేయాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో టీబీ నిర్ధారణ అయితే రోగికి మందులతోపాటు పౌష్టికాహారానికి నగదు బ్యాంకు ఖాతాలో జమ చేస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా పబ్లిక్, ప్రైవేట్ మిక్స్ కో–ఆర్డినేటర్ హరీష్, భవ్య సంస్థ కో–ఆర్డినేటర్ తులసీరామ్ తదితరులు పాల్గొన్నారు.