
అధికారులను శాసిస్తున్న మండల స్థాయి నేత
● ఆత్మకూరు కేంద్రంగా రేషన్ మాఫియా
సాక్షి టాస్క్‌ఫోర్స్: జిల్లాలో రేషన్ మాఫియా రోజు రోజుకు విస్తరిస్తూ కోరలు చాస్తోంది. ప్రతి రోజూ ఎక్కడో ఒక చోట రేషన్ బియ్యం పట్టుబడుతోంది. అయితే అది కూడా స్థానికులు ఎవరైనా సమాచారం ఇస్తే విధి లేని పరిస్థితుల్లో స్పందిస్తున్న అధికారులు మొక్కుబడిగా కేసులు నమోదు చేసి, బియ్యాన్ని ఎంఎల్‌ఎస్ పాయింట్లకు తరలించి చేతులు దులుపుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా విచ్చలవిడిగా రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతున్న విషయం పౌరసరఫరాలశాఖ, రెవెన్యూ, విజిలెన్స్, పోలీస్ అధికారులకు తెలిసినా.. ఆ వైపు కన్నెత్తి చూడడం లేదు. మొదటి వారంలోనే రేషన్ షాపుల్లో బియ్యం బస్తాలు ఖాళీ అయిపోతున్నాయంటే ఏ స్థాయిలో అక్రమ దందా జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. అనంతసాగరం మండలం వెంగంపల్లికి చెందిన టీడీపీ కార్యకర్త పేదల బియ్యం దందా చేస్తున్నాడు. నెల్లూరులో ఉంటూ మాఫియా డాన్‌గా ఎదిగిన సదరు చోట నేత పేదల బియ్యాన్ని బొక్కేస్తున్నాడు. తన సామ్రాజ్యాన్ని ఆత్మకూరు నియోజకవర్గం నుంచి నాలుగు జిల్లాల వరకు విస్తరించాడు. నెలనెలా రెండో వారానికే రూ.కోట్ల విలువైన రేషన్ బియ్యాన్ని రాష్ట్ర సరిహద్దులు దాటిస్తున్నారు. చోటా నేత దందాపై విజిలెన్స్, పోలీసులు, రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ అధికారులకు తెలిసినా కూడా కిమ్మనకపోవడం వెనుక నెలవారీగా భారీగా ముడుపులు చేతులు మారుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
నెల రోజుల్లోనే
రూ.కోటి విలువైన బియ్యం పట్టివేత
జిల్లాలో ఒక్క ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలో నెల రోజుల వ్యవధిలో రూ.కోటి విలువైన రేషన్ బియ్యం పట్టుబడిదంటే దందా ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఈ బియ్యాన్ని అధికారులు చిత్తశుద్ధితో పట్టుకున్నారంటే పప్పులో కాలేసినట్లే. రెండు వర్గాల మధ్య జరిగిన అధిపత్యపోరులో భాగంగానే పేదల బియ్యం పట్టుకున్నారు. వెంగంపల్లిలోనే బహిరంగంగా రేషన్ దందా నిర్వహిస్తున్నా స్థానిక పోలీసులు, రెవెన్యూ, పౌరసరఫరా శాఖ అధికారులకు తెలియదనుకుంటే పొరపాటే.
వెంగంపల్లిలో గోదాము
రేషన్‌బియ్యం దందా కొనసాగిస్తున్న సదరు డాన్ వెంగంపల్లిలో ఏకంగా ప్రత్యేకంగా గోదాము నిర్మించాడు. ఆత్మకూరు, బద్వేలు, ఉదయగిరి నియోజకవర్గాల నుంచి పేదల బియ్యాన్ని సేకరించి అక్కడే నుంచే దందా చేస్తున్నాడు. ప్రకాశం, కడప, గుంటూరు, తిరుపతి జిల్లాల నుంచి మాఫియా డాన్ రేషన్ బియ్యం సేకరణ చేస్తున్నారు. నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలకు నెలకు రూ.లక్షల్లో ముడుపులు ఇస్తూ పేదల బియ్యం డీలర్ల నుంచే సేకరణ చేస్తున్నారు. 16 టైర్ల భారీ లారీల్లో 16 వాహనాల ద్వారా బియ్యం సేకరించి అక్రమ రవాణా చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. నెల్లూరు, బుచ్చిరెడ్డిపాళెంలో రైస్‌మిల్లులు లీజుకు తీసుకుని సేకరించిన బియ్యాన్ని అక్కడే నిల్వ చేసి పాలిష్ పెట్టి బ్రాండెడ్ బ్యాగుల్లో నింపి చైన్నెతో పాటు కృష్ణపట్నం పోర్టు ద్వారా విదేశాలకు పంపుతున్నాడు.
దందా రాయుళ్ల మధ్య రాజీ యత్నాలు
ఆత్మకూరు నియోజకవర్గంలో జరిగే రేషన్ దందాలో నెల ముడుపులు తీసుకునే పోలీస్ శాఖ ఉన్నతాధికారి రేషన్ దందా రాయుళ్ల మధ్య రాజీ కోసం ఒత్తిడి తెస్తున్నారన్న ఆరోపణలున్నాయి. వ్యాపారం సజావుగా జరగకపోతే తనకు ముడుపులు రావని రాజీ కోసం పోలీస్ ఉన్నతాధికారి ఒత్తిడి చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
వెంగంపల్లిలో రేషన్ మాఫియా డాన్ ఏర్పాటు చేసిన గోడౌన్
నెల రోజుల వ్యవధిలో
రూ.కోటి విలువైన బియ్యం పట్టివేత
ఆధిపత్య పోరుతోనే పట్టించిన వైనం
పౌరసరఫరాలశాఖ, పోలీస్, రెవెన్యూ, విజిలెన్స్ అధికారులకు నెల మామూళ్లు
దందా రాయుళ్ల మధ్య రాజీకి ఓ పోలీస్ ఉన్నతాధికారి ఒత్తిడి
అనంతసాగరం మండల స్థాయి ఓ టీడీపీ నేత రేషన్ మాఫియా డాన్‌కు అండగా ఉన్నాడనే ఆరోపణలున్నాయి. ఇటీవల రేషన్ బియ్యం తరలిస్తున్న వాహనాన్ని స్థానిక విలేకరులు పట్టించిన సమయంలో సదరు టీడీపీ నేత పోలీస్, రెవెన్యూ అధికారులకు ఫోన్ చేసి అక్కడికి వెళ్లొద్దని, మీడియాను తానే మేనేజ్ చేస్తానని చెప్పినట్లుగా ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే అధికారులు దాదాపు రెండు గంటల పాటు అక్రమ రవాణా చేస్తున్న వాహనం వద్దకు వెళ్లేందుకు కూడా సాహసం చేయలేకపోయారు. సదరు మండల నేత సహకారంతోనే రేషన్ దందా నిర్విఘ్నంగా సాగుతుందనేందుకు ఈ ఘటనే ఉదహరించవచ్చు.
ముడుపుల మత్తులో అధికారులు
అక్రమ రవాణాకు పోలీసులు, రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ, విజిలెన్స్ అధికారులకు రూ.లక్షల్లో ముడుపులు ఇస్తూ అతని వ్యాపారం సజావుగా సాగిస్తున్నాడనే ఆరోపణలున్నాయి. వాహనం వెళ్లే ప్రతి మండలంలో పోలీస్‌స్టేషన్‌కు నెలవారీ మామూళ్లు వెళ్తాయి. ఇక విజిలెన్స్ విభాగం నిద్రలో జోగుతుంది.
జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గం రేషన్ మాఫియాకు అడ్డాగా మారింది. అధికారం అండతో నాలుగు జిల్లాల్లో రేషన్ దందా సాగిస్తున్నారు. ఓ టీడీపీ కార్యకర్త ఈ మాఫియాకు డాన్‌గా వ్యవహరిస్తున్నాడు. గత ప్రభుత్వంలో నెల ప్రారంభం రోజు నుంచే ఇంటింటికి ఎండీయూ వాహనాలు వెళ్లి రేషన్ సరఫరా చేస్తే.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇందుకు భిన్నంగా బియ్యం అక్రమ రవాణా జరుగుతోంది. ఇది ఏ స్థాయికి చేరిందంటే బియ్యం దందాలో ఆధిపత్యపోరు మితిమీరి అధికారులకు ఫిర్యాదులు చేసే పరిస్థితికి వచ్చింది. అయితే పౌరసరఫరాలశాఖ, పోలీస్, రెవెన్యూ, విజిలెన్స్ అధికారులకు నెల మామూళ్లు అందజేస్తుండడంతో ఇలాంటి వ్యవహారాలు బయటకు రాకుండా ఇరుపక్షాల మధ్య రాజీ కుదిర్చేందుకు ఓ పోలీస్ అధికారి బాధ్యత తీసుకున్నారంటే అధికారుల అండదండలతో రేషన్ బియ్యం దందా సరి‘హద్దులు’ దాటుతోంది.

అధికారులను శాసిస్తున్న మండల స్థాయి నేత