
అక్రమ సంపాదనే ఎమ్మెల్యే సోమిరెడ్డి లక్ష్యం
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
తోటపల్లిగూడూరు: అక్రమ సంపాదనే లక్ష్యంగా పెట్టుకొని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి ముందుకు సాగుతున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆరోపించారు. మండలంలోని వరిగొండ పంచాయతీ వైఎస్సార్‌సీపీ నేత కోటా శేఖర్‌రెడ్డి మేనత్త శాంతమ్మ ఇటీవల కాలం చేయడంతో కాకాణి శనివారం ఆ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం స్థానిక నేతలు, కార్యకర్తలతో కాకాణి మాట్లాడుతూ సోమిరెడ్డి, ఆయన కుమారుడు అధికారం దక్కినప్పటి నుంచి ఏ రూపంలో ఎక్కడ అక్రమ సంపాదన వస్తుందో అక్కడ తన మనుషులను పెట్టి దోచుకుంటూ అపర కుబేరులుగా మారుతున్నారని ఆరోపించారు. ప్రజాధనాన్ని ఏ విధంగా దోచుకుతిందామా అనే ఆలోచన తప్ప గ్రామాల అభివృద్ధిని, ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేశారని విమర్శించారు. సర్వేపల్లిలో గ్రావెల్, మట్టి, ఇసుక దోపిడీ చేస్తూ సోమిరెడ్డి అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. ఏపీ జెన్‌కోపై దాడి వెనుక సోమిరెడ్డి పాత్ర ఉందని ఆరోపించారు. నియోజకవర్గంలో ఎక్కడ లేఅవుట్ వేసినా యజమానులను సర్వేపల్లి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దోచుకుంటున్నారన్నారు. సోమిరెడ్డికి దమ్ము, ధైర్యం ఉంటే సర్వేపల్లిలో జరిగిన అక్రమ గ్రావెల్, మట్టి, ఇసుక తవ్వకాలపై అనుమతులు చూపించాలన్నారు. తవ్వకాలు సక్రమేనని అనుమతులు చూపించి మీడియాతో కలిసి వస్తే సోమిరెడ్డి అవినీతిని నిగ్గు తేల్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, ఆయన సిధ్ధమైతే తేదీ చెప్పాలని సవాల్ విసిరారు.
పుట్టి ధాన్యం రూ.13 వేల నుంచి రూ.15 వేలే
ప్రస్తుత ఎడగారు సాగుకు సంబంధించి ధాన్యానికి గిట్టుబాటు ధర అందక రైతులు అల్లాడిపోతున్నారని కాకాణి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ధాన్యం పుట్టి (845 కేజీలు) కనీస మద్దతు ధర రూ.20,187గా కేంద్రం ప్రకటించిందన్నారు. అయితే వ్యాపారులు, దళారులు రూ.13 వేల నుంచి రూ.15 వేలకు మించి కొనుగోలు చేయడం లేదన్నారు. తమ ప్రభుత్వంలో పుట్టి రూ.22 వేల నుంచి రూ.24 వేల వరకు అమ్ముకున్నారన్నారు. చంద్రబాబు ఏ నాడు అధికారంలోకి వచ్చినా ఇలా గిట్టుబాటు ధర అందక తాము ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు నెలకొంటుంటాయని రైతులే బహిరంగంగానే విమర్శిస్తున్నారన్నారు. వరి కోతలు మరో రెండు.. మూడు వారాల్లో పూర్తి కానున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఇప్పటికై నా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు గిట్టుబాటు ధర అందించాలన్నారు. ఇటు యూరియా దొరక్క, అటు పంటకు గిట్టుబాటు ధర అందక రైతులు చితికిపోతున్నారన్నారు. ఆయన వెంట వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి చిల్లకూరు సుధీర్‌రెడ్డి, మండల కన్వీనర్ ఉప్పల శంకరయ్యగౌడ్, పార్టీ నాయకులు గూడూరు విష్ణుమోహన్‌రెడ్డి, గండవరపు శ్యామలమ్మ, కోసూరు రవీంద్రయ్య, చిల్లకూరు ప్రవీన్‌రెడ్డి, చింతరెడ్డి దశరథరామిరెడ్డి, కామిరెడ్డి మురళీరెడ్డి, కామిరెడ్డి సుబ్బారెడ్డి, దువ్వూరు సుధాకర్‌రెడ్డి, పోలంరెడ్డి అవినాష్‌రెడ్డి తదితరులు ఉన్నారు.