పెన్నాకు వరద జలాలు విడుదల నేడు | - | Sakshi
Sakshi News home page

పెన్నాకు వరద జలాలు విడుదల నేడు

Sep 14 2025 2:24 AM | Updated on Sep 14 2025 2:24 AM

పెన్నాకు వరద జలాలు విడుదల నేడు

పెన్నాకు వరద జలాలు విడుదల నేడు

సోమశిల: సోమశిల జలాశయం నిండుకుండలా మారడం, ఎగువ నుంచి వరద జలాలు కొనసాగుతుండడంతో ఆదివారం నుంచి దిగువ పెన్నాకు విడుదల చేస్తున్నట్లు జలాశయం ఈఈ శ్రీనివాసులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జలాశయం పూర్తి సామర్థ్యం 78 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటిమట్టం 73.130 టీఎంసీలకు చేరుకుంది. పైతట్టు ప్రాంతాల నుంచి జలాశయానికి వచ్చే వరద నీటిని నిల్వ ఉంచే అవకాశం లేనందున ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు క్రస్ట్‌ గేట్ల నుంచి పెన్నాడెల్టాకు నీటిని విడుదల చేస్తామని ఆయన తెలిపారు. ప్రస్తుతం జలాశయం నుంచి పవర్‌ టర్నల్‌ ద్వారా పెన్నాడెల్టాకు 2,650, ఉత్తర కాలువకు 400, కండలేరుకు 10 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని తెలిపారు.

శ్రీవారి దర్శనానికి

15 గంటలు

తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో కంపార్ట్‌మెంట్లు అన్నీ నిండిపోయాయి. క్యూలైన్‌ కృష్ణతేజ అతిథి గృహం వద్దకు చేరుకుంది. శుక్రవారం అర్ధరాత్రి వరకు 69,842 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 28,234 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామి వారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.18 కోట్లు సమర్పించారు. టైం స్లాట్‌ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 15 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారికి 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

ఎస్పీగా అజిత వేజెండ్ల

తొలి మహిళా పోలీసు బాస్‌

నెల్లూరు (క్రైమ్‌): జిల్లా ఎస్పీగా అజిత వేజెండ్లను నియమితులయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 14 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ శనివారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అందులో భాగంగా జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్‌ను బదిలీ చేసి ఆయన స్థానంలో విశాఖపట్నం డీసీపీ (లా అండ్‌ ఆర్డర్‌)గా పనిచేస్తున్న అజిత వేజెండ్లను నియమించారు. అజిత వేజెండ్లది గుంటూరు జిల్లా తెనాలి. ఆమె తల్లిదండ్రులు ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో స్థిరపడడంతో అక్కడి సెయింట్‌ ఆన్స్‌ పాఠశాలలో ప్రాథమిక స్థాయి నుంచి పదో తరగతి వరకు విద్యాభ్యాసం చేశారు. నెల్లూరు నారాయణ కళాశాలలో ఇంటర్మీడియట్‌, మద్రాస్‌ ఐఐటీలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ను పూర్తి చేశారు. యూఎస్‌లో ఎంఎస్‌ ఫైనాన్స్‌ కోర్సు పూర్తి చేసి అక్కడే కొంత కాలం ఉద్యోగం చేశారు. అయితే సివిల్స్‌పై మక్కువతో తిరిగి స్వదేశానికి వచ్చారు. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో ఎకనామిక్స్‌లో పీహెచ్‌డీ చేస్తూ సివిల్స్‌ రాసి 2015లో ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. శిక్షణ అనంతరం రంపచోడవరం ఓ ఎస్డీగా పనిచేశారు. అనంతపురం, మంగళగిరి బెటాలియన్‌ కమాండెంట్‌గా, విజయవాడ, విశాఖపట్నంలో డీసీపీగా, గుంతకల్‌ రైల్వే ఎస్పీగా పనిచేశారు. ఆమె భర్త రాహుల్‌దేవ్‌ సింగ్‌ సైతం 2015 ఐపీఎస్‌ అధికారి. ఆయన ప్రస్తుతం విజయవాడ రైల్వే ఎస్పీగా పనిచేస్తున్నారు. జిల్లాలో తొలి మహిళా ఎస్పీగా ఆమె చరిత్ర రికార్డుల్లో ఎక్కారు. ఆమె నేడో, రేపో బాధ్యతలు స్వీకరించనున్నారు.

14 నెలల పాటు

బదిలీపై వెళుతున్న కృష్ణకాంత్‌ గతేడాది జూలైలో జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. 14 నెలల పాటు జిల్లాలో పనిచేశారు. శాంతిభదత్రల పరిరక్షణకు తనవంతు కృషి చేశారు. అయితే ప్రస్తుతానికి కృష్ణకాంత్‌కు పోస్టింగ్‌ వేయలేదు. రిలివ్‌ అయ్యాక పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో రిపోర్టు చేసుకోవాల్సి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement