
నాకు అపాయింట్‌మెంట్ అవసరం లేదు
● కలెక్టర్ హిమాన్షు శుక్లా బాధ్యతల స్వీకరణ
నెల్లూరు (అర్బన్): సామాన్యులకు సైతం అందుబాటులో ఉంటా. నాకు ముందస్తు అపాయింట్‌మెంట్ అవసరం లేదు. ఎప్పుడైనా తనను కలిసి సమస్యలు తెలియజేస్తే.. పరిష్కరించేందుకు కృషి చేస్తానని కలెక్టర్ హిమాన్షు శుక్లా చెప్పారు. జిల్లా కొత్త కలెక్టర్‌గా హిమాన్షు శుక్లా శనివారం సాయంత్రం కలెక్టరేట్‌లో బాధ్యతలు స్వీకరించారు. ప్రత్యేకంగా పంచెకట్టుతో కలెక్టర్ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చారు. కలెక్టరేట్‌లో వేద పండితులు మంత్రోచ్ఛారణలతో ఆశీర్వదించారు. జేసీ కార్తీక్, కందుకూరు సబ్ కలెక్టర్ హిమవంశీ, డీఆర్వో విజయకుమార్, కలెక్టర్ ఏఓ విజయకుమార్ పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కలెక్టర్ హిమాన్షు శుక్లా కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తన జీవితాన్ని రాష్ట్రం కోసం, ప్రజల కోసం త్యాగం చేసిన నెల్లూరు జిల్లా వాసి పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో ప్రజలకు సేవ చేస్తానన్నారు. ఎస్‌ఆర్ శంకరన్, అర్జున్‌రావు వంటి పెద్దలు ఈ జిల్లాలో ప్రజలతో మమేకమై కలెక్టర్లుగా పనిచేసి కలెక్టర్ అంటే ఇలా ఉండాలని ఒక ప్రత్యేకతను చూపారన్నారు. వారి బాటలో పయనిస్తానన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, ఎన్‌జీఓలు అందరితో కలిసి సమన్వయం చేసుకుంటూ జిల్లా అభివృద్ధికి తన వంతు సహకారమందిస్తానన్నారు. తనకు దేవుడిచ్చిన అవకాశంగా భావించి సేవ చేస్తానన్నారు. తాను ఎక్కువ సమయం కలెక్టరేట్‌లో ఉంటానన్నారు. తనను కలవడానికి వచ్చే ప్రజలకు సీసీ అపాయింట్‌మెంట్ అవసరం లేదన్నా రు. నేరుగా కలెక్టరేట్‌కు వచ్చి కలవ వచ్చన్నారు. తాను కొత్త అయినప్పటికీ ఈ జిల్లా గురించి స్టడీ చేసి వచ్చానన్నారు. తాను పక్కనే ఉన్న తిరుపతి సబ్ కలెక్టర్‌గా, టూరిజం డైరెక్టర్‌గా, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్ట్స్ ల్స్ ఎండీగా, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాలో జాయింట్ కలెక్టర్‌గా, కోనసీమ కలెక్టర్‌గా పని చేశానన్నారు. సమాచార, పౌరసంబంధాల శాఖ సంచాలకులుగా పనిచేస్తూ నెల్లూరుకు వచ్చానన్నారు. 12 ఏళ్లుగా విధులు నిర్వర్తించిన అనుభవంతో జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానన్నారు. తాను తప్పులు చేస్తే మీడియా తెలపచ్చన్నారు. మంచి చేస్తే కూడా ప్రజలకు తెలపాలన్నారు. ప్రభుత్వ పరంగా సంక్షేమ కార్యక్రమాలు విజయవంతం కావడంలో మీడియా పాత్ర ఎంతో ఉందన్నారు. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా ఉన్న మీడియా అభివృద్ధిలో గణనీయపాత్ర పోషించాలని కోరారు. నెల్లూరుకు కలెక్టర్‌గా రావడం ఆనందంగా ఉందన్నారు.

నాకు అపాయింట్‌మెంట్ అవసరం లేదు