
నిర్లక్ష్యానికి పరాకాష్ట
ఆత్మకూరు: ఆత్మకూరులోని ఏపీ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినులు గత వారం రోజులుగా జ్వరాల బారిన పడితే ఈ విషయాన్ని బయటకు పొక్కనియకుండా పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఆస్పత్రికి తరలించకుండా పాఠశాల వైద్య సిబ్బందితో వైద్య సేవలు అందించడం సర్వత్రా విమర్శలకు దారితీసింది. ఒకరిద్దరు జ్వరాల బారిన పడి ఉంటే సరేలే.. అనుకోవచ్చు. ఏకంగా పాఠశాలలో 40 మంది విద్యార్థులు జ్వరాలతో బాధపడుతుంటే.. పాఠశాల గదుల్లో కుక్కి పాఠశాలలోని నర్సు ద్వారా తాత్కాలిక చికిత్స చేయిస్తున్నారు. రోజు రోజుకు విద్యార్థినుల పరిస్థితి విషమిస్తుండడంతో సుమారు 20 మందిని వారి ఇళ్లకు పంపించారు. మిగతా విద్యార్థులు సైతం వాంతులు చేసుకుంటూ ఉన్నా.. పాఠశాల ప్రిన్సిపల్ ఈ విషయాన్ని జిల్లా అధికారులు దృష్టికి తీసుకెళ్లకపోవడంతో ఆమె నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. గురుకుల అధికారుల పర్యవేక్షణాధికారుల డొల్లతనం బయట పడింది. విద్యార్థులు జ్వరాల బారిన పడిన విషయం శనివారం ఒక్కసారిగా వెలుగులోకి రావడంతో జిల్లా అధికార యంత్రాంగం ఒక్కసారిగా కదిలింది. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి జోక్యంతో జేసీ కార్తీక్, డీఎంహెచ్‌ఓ సుజాత, ఆర్డీఓ పావని తదితర అధికారులు పాఠశాల వద్దకు వచ్చి హంగామా చేశారు. వాస్తవానికి ఈ పాఠశాల వెనుక వైపు మున్సిపల్ డంపింగ్ యార్డు ఉంది. ప్రహరీగోడ లేకపోవడంతో అప్పుడప్పుడు పందులు సంచరిస్తూ ఉంటాయి. ఇటీవల కురిసిన వర్షాలకు పాఠశాల ఆవరణలో నీటి మడుగులు కట్టాయి. దీనికి తోడు పాఠశాలలో దోమలు విజృంభించాయి. రాష్ట్రంలోని గురుకుల పాఠశాలలు, హాస్టళ్లు సంరక్షణ బాధ్యత నాది అని గొప్పలు చెప్పుకునే విద్యాశాఖ మంత్రి లోకేశ్, కూటమి ప్రభుత్వ నాయకులు విద్యార్థినులు విషజ్వరాల బారిన పడినా స్పందించకపోవడం శోచనీయం. విద్యార్థులకు ఏదైనా ప్రాణపాయం తలెత్తి ఉంటే.. వారి తల్లిదండ్రులకు ఏం సమాధానం చెబుతారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు నానా హంగామా చేసి తూతు మంత్రంగా చర్యలు తీసుకోవడమే తప్ప పటిష్ట చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గురుకులంలో ప్రబలిన జ్వరాలు
బయటకు రానివ్వకుండా వ్యవహరించిన పాఠశాల యాజమాన్యం
గుట్టుచప్పుడు కాకుండా కొందరు విద్యార్థినులను ఇళ్లకు పంపించేశారు
మంత్రి, అధికారుల దృష్టికి వెళ్లడంతో హడావుడిగా ఆస్పత్రికి తరలింపు

నిర్లక్ష్యానికి పరాకాష్ట