
టీడీపీ నేత గుప్పెట్లో రెవెన్యూ వ్యవస్థ
సాక్షి టాస్క్‌ఫోర్స్: జిల్లాలోని జలదంకి తహసీల్దార్ కార్యాలయాన్ని ఓ టీడీపీ నేత అవినీతికి అడ్డాగా మార్చేశాడు. రెవెన్యూ వ్యవస్థను తన గుప్పెట్లో పెట్టుకుని, ప్రతి పనికీ రేటు నిర్ణయించి వసూలు చేస్తున్నాడు. అడిగినంత ఇవ్వకపోతే ఏ పని చేయడానికి వీల్లేదని రెవెన్యూ అధికారులకు స్పష్టం చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా భూముల మ్యుటేషన్‌కు సంబంధించి ముడుపులు ముట్టజెప్పకుంటే నిర్ధాక్షిణ్యంగా పక్కన పెట్టిస్తున్నట్లు టీడీపీ నేతలే ఆరోపిస్తున్నారు. తాజాగా ఓ టీడీపీ నేత.. సదరు టీడీపీ నేత అవినీతిపై ఓ మీడియా ప్రతినిధితో మాట్లాడిన ఆడియో, వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సంచలనం రేపుతోంది. జలదంకి మండలం కమ్మవారిపాళెంకు చెందిన కర్రావుల అప్పలనాయుడు ప్రతీ శాఖను శాసిస్తున్నట్లు తెలుస్తోంది. రెవెన్యూ, మండల పరిషత్, పోలీస్‌శాఖలతోపాటు ఇతర శాఖల అధికారులు సైతం ఆయన కనుసన్నల్లోనే పని చేయాలని ఎమ్మెల్యే కాకర్ల ఆదేశాలిచ్చినట్లు సమాచారం. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అత్తగారి ఊరు కమ్మవారిపాళెం. మండలంలోని ప్రభుత్వశాఖలను శాసిస్తున్న అప్పలనాయుడు ఇల్లు.. కాకర్ల అత్తగారింటి పక్కనే ఉండడంతో, ఆయన మామతో చెప్పించుకుని మండలాన్ని తన గుప్పెట్లో పెట్టుకున్నట్లు ఆ పార్టీలోనే నేతలు చెప్పుకుంటున్నారు. తాజాగా అప్పలనాయుడుకి జలదంకి పీఏసీఎస్ చైర్మన్ పదవిని కూడా కాకర్ల కట్టబెట్టారు. జలదంకి రెవెన్యూ శాఖలో జరుగుతున్న పరిస్థితిపై ఒక విలేకరి ఆ మండలంలోని గోపన్నపాళెం చెందిన టీడీపీ నేత మల్లేష్‌నాయుడుకు ఫోన్ చేయగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. మండలానికి చెందిన ఓ టీడీపీ నేత కనుసన్నల్లో రెవెన్యూ, పోలీస్ వ్యవస్థలు నడుస్తున్నాయని, ప్రతి పనికీ ఒక రేటు ఉందని చెప్పడం, సదరు నేత ఎమ్మెల్యేకు చెడ్డపేరు తెస్తున్నాడని, ఈ విషయాన్ని ఎమ్మెల్యేకు కూడా చెబుతామని అనడం విశేషం.రోస్టర్ నంబరు మార్చడానికి రూ.24 వేలు ఇచ్చానని, రెవెన్యూ ఉద్యోగులకు పలుమార్లు లంచం ఫోన్‌పే ద్వారా ఇచ్చానంటూ టీడీపీ నాయకుడే బయట పెట్టడంతో ఆ పార్టీ నాయకుడుతోపాటు రెవెన్యూ అధికారులు ఎంత దోచుకుంటున్నారో అర్థమవుతుంది. ప్రస్తుతం ఈ ఆడియో, వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మండలంలో చర్చనీయాంశంగా మారింది.
జలదంకి తహసీల్దార్ కార్యాలయం
భూముల మ్యుటేషన్ కావాలంటే ముడుపులు ముట్టజెప్పాల్సిందే
జలదంకి తహసీల్దార్ కార్యాలయ అడ్డాగా అవినీతి
ఈ దందాపై తమ్ముళ్ల ఆరోపణలు
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియో, వీడియో

టీడీపీ నేత గుప్పెట్లో రెవెన్యూ వ్యవస్థ