
అనుమతులుంటే చూపిస్తావా.. సోమిరెడ్డీ
● మాజీ మంత్రి కాకాణి సవాల్
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): సర్వేపల్లి నియోజకవర్గంలో గ్రావెల్ తవ్వకాలకు ఎంత మేర అనుమతులు ఉ న్నాయో, ఎంత గ్రావెల్ తవ్వకాలు జరిగాయో ఆధారాలతో సహా చూపిస్తావా.. సోమిరెడ్డీ అని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి సవాల్ విసిరారు. నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో సోమిరెడ్డిపై ధ్వజమెత్తారు. తాను చాలెంజ్ విసురుతున్నానని, వెంకటాచలం మండలం నాగంబొట్లవారి కండ్రికలో జరిగిన తవ్వకాలను చూపించేందుకు మీడియాను తీసుకొచ్చి చూపే దమ్ము సోమిరెడ్డికి ఉందా అని ప్రశ్నించారు. చట్టపరంగా గ్రావెల్ తవ్వుతుంటే.. ఆ గుంతలను చెత్తా చెదారంతో పూడ్చాల్సిన అవసరం ఏముందన్నారు. గుడ్లూరువారిపాళెం చెరువు కట్టను తవ్వుతున్నారు. కనబడడం లేదా? అని ప్రశ్నించారు. తనపై సోమిరెడ్డి పెట్టిన కేసులకు, చేసిన ఆరోపణలకు సీబీఐ విచారణకు సిద్ధంగా ఉన్నానని చాలెంజ్ చేశారు. గతంతోపాటు ప్రస్తుతం సర్వేపల్లి నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి నిగ్గు తేల్చాలన్నారు. తమ నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డిని దూషిస్తే చంద్రబాబు మంత్రి పదవి ఇస్తాడేమోననే భ్రమలో సోమిరెడ్డి ఉన్నారన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి కాలి గోటికి కూడా ఆయన సరిపోడని, తమ నాయకుడిని విమర్శించే స్థాయి సోమిరెడ్డికి లేదన్నారు. రాష్ట్రంలోని బస్సులన్నీ మళ్లించి సూపర్ సిక్స్ సభకు పంపారని, పోలీసులందరిని ఆ సభలోనే పెట్టుకున్నారన్నారు. సూపర్ సిక్స్ సభకు రాని వారిపై ఫైన్లు వేశారని, ‘అన్నదాత పోరు’ కార్యక్రమానికి వచ్చిన వారిపై కేసులు పెట్టారని తెలిపారు. ఎన్ని కేసులు పెట్టినా సూపర్ సిక్స్ సభ కంటే ఎక్కువ మంది ‘అన్నదాతపోరు’ కార్యక్రమానికే జనం ఎక్కువగా వచ్చారని, అధికారాన్ని చూపిన సూపర్‌సిక్క్ సభకు జనం రాలేదని అన్నారు. ‘నేను లావే.. నాకు తిన్నది తిన్నట్లుగా వంట బడుతుంది. ఆయనకు మాదరిగా నాకు కుళ్లు కుతంత్రాలు లేవంటూ కాకాణి గోవర్ధన్‌రెడ్డి వ్యంగ్యాస్త్రాలు విసిరారు.