
పేదలే వారి టార్గెట్
రుణాలిస్తామని నమ్మించి మోసం
బ్లాక్‌మనీని చలామణిలోకి తెచ్చేందుకని మాయమాటలు
పోలీసులకు చెప్పొద్దన్న కేటుగాళ్లు
రూ.3,300 చొప్పున వసూలు చేసి నాసిరకం ఫ్యాన్లు
అంటగట్టిన వైనం సుమారు 600 మంది బాధితులు
రూ.లక్షలు దండుకుని పరారైన ఇద్దరు వ్యక్తులు
దుత్తలూరు: ఎస్సీ, ఎస్టీ కాలనీల్లోని పేదలకు రుణాలిస్తామని కేటుగాళ్లు నమ్మించి నగదు వసూలు చేసి పరారయ్యారు. దుత్తలూరు, పరిసర మండలాల్లో జరిగిన ఈ వ్యవహారం శుక్రవారం వెలుగు చూసింది. వివరాలిలా ఉన్నాయి. కొద్దిరోజుల క్రితం ఇద్దరు వ్యక్తులు లక్ష్మి ఫైనాన్స్ సంస్థ పేరుతో ప్రజల వద్దకెళ్లారు. బ్లాక్‌మనీని చలామణిలోకి తెచ్చుకునేందుకు అతి తక్కువ వడ్డీకి రుణాలిస్తున్నామని నమ్మబలికారు. అయితే రుణాలు మంజూరు చేయాలంటే ముందుగా తమ దగ్గరున్న ఫ్యాన్లను తీసుకోవాలన్నారు. దానిని తీసుకుని రూ.3,300 చెల్లించిన వారికి రూ.55 వేల రుణమిస్తామని చెప్పారు. వాస్తవానికి ఒక్కో ఫ్యాన్ ధర రూ.1,000 కూడా ఉండదని బాధితులు చెబుతున్నారు. అవి కూడా సక్రమంగా పనిచేయడం లేదంటున్నారు.
ఎక్కడంటే..
ఆ ఇద్దరు వ్యక్తులు నాలుగైదు రోజుల క్రితం దుత్తలూరు మండలంలోని కట్టకిందపల్లి దళిత కాలనీ, ఏఏ కాలనీ, ఎట్టిపాళెం తదితర కాలనీలతోపాటు మండలంలోని పలు ప్రాంతాలకు వెళ్లారు. గుట్టుచప్పుడు కాకుండా రుణాలు ఇస్తామంటూ సుమారు రూ.10 లక్షల మేర దండుకున్నారు. 11వ తేదీన వస్తామని, ఆధార్, రేషన్‌కార్డుల జెరాక్స్‌లు, రెండు ఫొటోలు సిద్ధం చేసుకుంటే ఒక కార్డు అందజేసి వెంటనే రుణ మొత్తాన్ని నగదు రూపంలో అందజేస్తామన్నారు. రూ.55 వేల రుణం ఇస్తే నెలకు రూ.2,650 వంతున 24 నెలలపాటు వాయిదాలు చెల్లించాలన్నారు. ఇదంతా రహస్యంగా ఉంచాలని, పోలీసులకు చెబితే బ్లాక్‌మనీ బట్టబయలవుతుందని, అందుకే మీకు ఆఫ్‌లైన్ ద్వారా రుణాలు అందిస్తున్నామని నమ్మించారు. అంతేకాక ఫ్యాన్లు ఇచ్చే సమయంలో ఎవరైనా ఆన్‌లైన్ ద్వారా పంపుతామంటే వద్దని, చేతికి నగదు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొందరికి అనుమానం వచ్చి ప్రశ్నిస్తే పొంతన లేని సమాధానాలు చెప్పారు. రోజువారీ కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్న పేదలు రుణంతో అవసరాలు తీరుతాయని భావించారు. ఫ్యాన్లకు నగదు చెల్లించినట్లు రశీదు ఇవ్వాలని బాధితులు అడిగితే.. మీకు అవసరం లేకపోతే రుణాలిచ్చినప్పుడు ఫ్యాన్లు తిరిగి తీసుకుని ఆ నగదును రుణ వాయిదాల్లో తగ్గించుకుంటామని సెలవిచ్చారు. బిల్లుల తమ వద్ద ఉంటాయన్నారు.
మీకే నష్టమంటూ..
పలువురు మిమ్మల్ని ఎలా నమ్మాలని ప్రశ్నించగా.. ఎవరో ఎక్కడో మోసం చేశారని అందర్నీ అనుమానిస్తే మీకే నష్టమని కేటుగాళ్లు చెప్పారు. దీంతో తమకు రుణాలిస్తే చాలని మిన్నకుండిపోయారు. దుత్తలూరులో గదిని అద్దెకి తీసుకుని కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని, తమకు గుంటూరు, రాజమండ్రిలో ప్రధాన కార్యాలయాలున్నాయని, వింజమూరు, బద్వేలు ప్రాంతాల్లో బ్రాంచ్‌లు ఉన్నాయని ఎవరు అనుమానించొద్దని ఆ ఇద్దరు చెప్పారు. ఉదయగిరి నియోజకవర్గంలోని పలు మండలాల్లో సుమారు 600 మంది వరకు రూ.3,300 చొప్పున చెల్లించినట్లు తెలుస్తోంది. సుమారు రూ.20 లక్షల వరకు దండుకున్నారు. 11వ తేదీన వారు రాకపోవడంతో బాధితులు ఫోన్ చేయగా అది పని చేయలేదు. దుత్తలూరులోని గదిని ఖాళీ చేసేశారు. దీంతో మోసపోయామని బాధితులు గ్రహించి లబోదిబోమంటున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే పరువు పోతుందని చాలామంది లోలోపల కుమిలిపోతున్నారు. ఆ ఇద్దరు వివిధ ప్రాంతాలు తిరుగుతూ ప్రజలను మోసం చేస్తున్నట్లు తెలిసింది.