
నా పాత్రపై ఆధారాలు చూపించండి
కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపించినందుకే అక్రమ కేసులు
సాక్షులను భయపెట్టి, బెదిరించి స్టేట్‌మెంట్లు తీసుకుంటున్నారు
నేను తప్పు చేశానని స్పష్టమైన ఆధారం ఒక్కటున్నా నేను ఏ శిక్షకై నా సిద్ధమే
కనుపూరు చెరువులో అక్రమ గ్రావెల్ తరలింపు కేసులో పోలీసులను ప్రశ్నించిన మాజీ మంత్రి కాకాణి
కాకాణి ప్రశ్నలకు సమాధానమివ్వలేక నీళ్లు నమిలిన పోలీసులు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కూటమి ప్రభుత్వ వైఫల్యాను ప్రశ్నించమే నేరంగా నాపై ఎన్నో అక్రమంగా కేసులు పెడుతున్నారు. ఆ కేసుల్లో పోలీసులు నా పాత్ర ఉన్నట్లు ఏ ఒక్క ఆధారం చూపించినా నా తప్పు ఒప్పుకుని ఏ శిక్ష కై నా సిద్ధం అంటూ పోలీసులకు మాజీమంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి సవాల్ విసిరారు. సాక్షులను బెదిరించి, భయపెట్టి నన్ను కేసుల్లో ఇరికిస్తున్నారంటూ పోలీసులపై ఫైర్ అయినట్లు సమాచారం. కనువూరు చెరువులో అక్రమంగా గ్రావెల్ తరలించారని నమోదు చేసిన అక్రమ కేసులో విచారణ నిమిత్తం వెంకటాచలం పోలీసులు బుధవారం కస్టడీకి తీసుకున్నారు.
న్యాయవాది కటారి విద్యాసాగర్‌రెడ్డి సమక్షంలో పోలీసులు తొలి రోజు కాకాణిని 30 ప్రశ్నలు అడిగారు. అన్నింటికి దీటుగా సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది. గ్రావెల్ తరలింపు కేసులో నాపాత్ర ఎందుకు ఉంటుంది. ఆరోపణలు చేయడం, వాటి ఆధారంగా కేసులు నమోదు చేయడం, నిందితులను బెదిరించి, భయపెట్టి చెప్పించడం తప్ప నా పాత్రపై పోలీసులు వద్ద ఏదైనా స్పష్టత ఉందా. ఏదైనా ఆధారం ఉంటే చూపిస్తే నేను స్పదించగలను. మంత్రిగా నా బాధ్యత ఏముంటుంది. ఏదైనా పత్రికల్లో కానీ, సోషల్ మీడియాలో ఏదైనా వార్తలు వస్తే అధికారులకు తగు చర్యలు తీసుకోమ్మని కోరడం, నాకు తెలిసిన బుజ్జయ్యనాయుడు కనువూరు చెరువు మట్టి అక్రమంగా తరలిస్తూ అతని టిప్పర్ ఒక వ్యాన్‌ను ఢీకొట్టి కొంత మంది చనిపోయారు.
అప్పుడు పోలీసులు కేసు నమోదు చేశారు. బుజ్జయ్యను స్టేషన్‌కు తీసుకురాగా ఆయన అక్కడినుంచి తప్పించుకుని హైకోర్టుకు వెళ్లి బెయిల్ తెచ్చుకున్నాడు. బుజ్జయ్యనాయుడు టీడీపీ నాయకుడు. సోమిరెడ్డికి ప్రధాన అనుచరుడిగా చెలామణి అవుతున్నాడు. నేను ఎప్పుడూ నిబంధనలు వ్యతిరేకించి విరుద్ధంగా పని చేయమని అధికారులెవరికి చెప్పలేదు. ప్రభుత్వ నిబంధనలు ప్రకారం నడుచుకోవడం అధికారుల పని. చట్ట వ్యతిరేక కార్యకలాపాలను అడ్డుకోవడం పోలీస్ శాఖ బాధ్యత. ఇలాంటి బాధ్యతలను నాకు ఆపాదించడం ఎంత వరకు సబబు అని పోలీసులను ప్రశ్నించారని సమాచారం. కాకాణి అడిగిన ప్రశ్నలకు పోలీసులు సమాధానం చెప్పలేక నీళ్లు నమిలినట్లు తెలిసింది.
నెల్లూరు (లీగల్): మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిని వెంకటాచలం ఇన్‌స్పెక్టర్ పి.సుబ్బారావు మొదటి రోజు విచారించారు. కనుపూరు చెరువులో అక్రమంగా గ్రావెల్ తవ్వారని నమోదైన అక్రమ కేసులో జిల్లా కేంద్ర కారాగారంలో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న కాకాణిని కోర్టు అనుమతితో వెంకటచలం పోలీసులు రెండు రోజుల విచారణ నిమిత్తం బుధవారం జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రానికి తరలించారు. న్యాయవాది కాటూరు విద్యాధర్‌రెడ్డి సమక్షంలో గోవర్ధన్ రెడ్డిని వెంకటచలం పోలీస్‌స్టేషన్ ఇన్‌స్పెక్టర్ పి.సుబ్బారావు 30 ప్రశ్నలు అడిగారు. వెంకటాచలం మండలం ఇడిమేపల్లి వీఆర్‌ఓ దేవరపాటి నాగేంద్రబాబు, కురిచెర్లపాడు వీఆర్వో కవరగిరి వినయ్ మధ్యవర్తుల సమక్షం విచారణ జరిగింది. సాయంత్రం 5 గంటలకు కాకాణిని జిల్లా కేంద్ర కారాగారానికి తరరించారు.