
వేమిరెడ్డి దంపతుల ప్రోద్బలంతోనే దాడి
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ప్రోద్బలంతో వారి ముఖ్య అనుచరులు, టీడీపీ రౌడీ మూకలు మాజీమంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిని హత్య చేయాలనే ఆయన ఇంటి మీద దాడి చేశారని, నిందితులపై చర్యలు తీసుకోవాలని కోవూరు జెడ్పీటీసీ కౌరవగిరి శ్రీలత, వైఎస్సార్‌సీపీ మహిళా నేతలు పోలీసు అధికారులను కోరారు. ఆమె బుధవారం రాత్రి మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు లక్ష్మీసునంద, మరికొందరు నేతలు, కార్యకర్తలతో కలిసి దర్గామిట్ట ఎస్‌ఐ రమేష్‌బాబుకు వినతిపత్రం అందజేశారు. శ్రీలత మాట్లాడుతూ సోమవారం రాత్రి 9 గంటల సమయంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిల ముఖ్య అనుచరులు కోడూరు కమలాకర్‌రెడ్డి, జెట్టి రాజగోపాల్‌రెడ్డి, ఇంత మల్లారెడ్డి, పల్లా సుధాకర్‌రెడ్డి, పెనుబల్లి కృష్ణచైతన్య, గుడిహరి కుమార్‌రెడ్డి, సాయితేజరెడ్డి, గురు మహేష్ మరో వంద మందికిపైగా టీడీపీ రౌడీమూకలు నెల్లూరు సుజాతమ్మ కాలనీలోని నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంట్లో విధ్వంసం సృష్టించారన్నారు. ప్రసన్నకుమార్‌రెడ్డిని చంపాలన్న ఉద్దేశంతోనే ఈ దాడి జరిగిందని, ఆయన ఆ సమయంలో ఇంట్లో లేకపోవడంతో ఇంట్లోని ఫర్నీచర్ మొదలు అన్నీ వస్తువులును, బెంజ్‌కారును ధ్వంసం చేశారన్నారు. ప్రసన్నకుమార్‌రెడ్డి తల్లి శ్రీలక్ష్మమ్మతోపాటు పనిచేసే వారిపై దుండగులు భౌతిక దాడిచేశారన్నారు. విధ్వంసంలో రూ.5 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగిందన్నారు. ఈ దాడి ఘటనకు సంబంధించిన వీడియోల్లో నిందితుల చిత్రాలు ఉన్నాయన్నారు. ఈ ఘటనపై అదేరోజు అర్థరాత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఫిర్యాదు చేసినా ఇంత వరకూ కేసు నమోదు చేయకపోవడం బాధాకరమన్నారు.
నిందితులపై చర్యలు తీసుకోవాలి
దర్గామిట్ట పోలీసులకు జిల్లా వైఎస్సార్‌సీపీ మహిళా నేతల ఫిర్యాదు