
ప్రశాంతమ్మ.. రాచరిక పాలన కాదు
కోవూరు: మాజీమంత్రి, ఆరుసార్లు ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలందించిన నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిని ‘కట్టిపడేసి నీ కళ్ల దగ్గర పడేయాలి’ అంటవా?. ఇది రాజరిక పాలన కాదు, ప్రజాస్వామ్యం. ప్రజలే నీకు తగిన బుద్ధి చెబుతారు’ అంటూ వైఎస్సార్‌సీపీ మహిళా నేతలు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిని హెచ్చరిచ్చారు. శుక్రవారం కోవూరులోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు లక్ష్మీసునంద, అధికార ప్రతినిధి మల్లి నిర్మల, అంగన్‌వాడీ విభాగం అధ్యక్షురాలు వేంకట జ్యోతి, కొడవలూరు ఎంపీపీ జ్యోతి, కోవూరు జెడ్పీటీసీ శ్రీలత, నేతలు సంపూర్ణ, షకీలా, ప్రవళ్లిక, ఉమా తదితరులు మాట్లాడారు. ప్రశాంతమ్మ అహంకారంగా మాట్లాడుతున్న తీరు రాష్ట్ర ప్రజలందరికీ అసహ్యం కలిగేలా ఉందన్నారు. రాజ్యాధికారం మీద మత్తులో మాట్లాడే భాష అని విమర్శించారు. ఇది ప్రజాస్వామ్యం, ప్రజలే తగిన తీర్పు ఇస్తారన్నారు. ప్రసన్న ఇంటిపై దాడి జరిగి ఐదు రోజులు గడిచినా ఇప్పటికీ నిందితులను అరెస్ట్ చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంట్లోకి చొరబడి కారు ధ్వంసం చేయడం, రూ.లక్షల విలువైన వస్తువులను ధ్వంసం చేయడం రాజ్యాంగ వ్యతిరేక చర్యలని పేర్కొన్నారు.
బండారు మాటలు మరిచిపోలేరు
టీడీపీ నేత బండారు సత్యనారాయణ మాజీమంత్రి ఆర్‌కే రోజాపై అసభ్యంగా మాట్లాడిన మాటలు ఇప్పటికీ ప్రజలకు గుర్తున్నాయన్నారు. ఆ సమయంలో ఉన్న సీఎం జగన్‌మోహన్‌రెడ్డి న్యాయపద్ధతిలో వ్యవహరించిన తీరును గుర్తు చేశారు. అప్పుడు అదే జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించారన్నారు. ప్రతి ఒక్కరికీ కుటుంబం ఉంటుందని, ఆ కుటుంబంలో అమ్మ, అక్కా, చెల్లెళ్లు ఉంటారనే విషయాన్ని ప్రశాంతిరెడ్డి కూడా గుర్తించాలన్నారు. మహిళగా ప్రశాంతమ్మ ఇతర మహిళల మనోభావాలను గౌరవించాల్సిన బాధ్యత ఉందని సూచించారు. దివంగత మాజీమంత్రి నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి జిల్లాకు గొప్ప పేరు తీసుకొచ్చారని, ఆయన భార్య శ్రీలక్ష్మమ్మ దాడి సమయంలో ఇంట్లో ఉండడాన్ని కూడా బేఖాతర్ చేయకపోవడం చూస్తే వీరి అరాచకానికి అద్దం పడుతుందన్నారు. జిల్లాలో ఒకే ఒక మహిళా ఎమ్మెల్యే ఉన్నప్పుడు మహిళలకు మేలు జరుగుతుందనుకున్నారు. కానీ ఆమె పేరులో ప్రశాంతి ఉన్నా.. చర్యల్లో మాత్రం అశాంతి కనబడుతోందని వ్యాఖ్యానించారు.
పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు
పార్టీ సమావేశం జరుగుతుందని తెలుసుకుని ముందుగానే పోలీసులు అక్కడికి చేరుకోవడంపై నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన వారు ఎవరో తెలిసినా ఇప్పటికీ చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు. న్యాయం జరగకపోవడంతో కోవూరు సెంటర్‌లో ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించేందుకు ర్యాలీగా వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సమావేశంలో పలు గ్రామాల మహిళా సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
మాజీమంత్రిని కట్టేసి నీ కాళ్ల దగ్గర
పడేయమంటావా?
ఇది ప్రజాస్వామ్య పాలన అని
గుర్తుపెట్టుకో
వైఎస్సార్‌సీపీ మహిళా నేతల హెచ్చరిక

ప్రశాంతమ్మ.. రాచరిక పాలన కాదు