
జలాశయానికి వరద ప్రవాహం
సోమశిల: జలాశయం నీటి మట్టం పెరగనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. శ్రీశైలం నుంచి జలాలు దిగువకు విడుదల చేసిన నేపథ్యంలో సోమశిలకు క్రమేణా నీటి ప్రవాహం రానుంది. శుక్రవారానికి ఆదినిమ్మాయపల్లి రెగ్యులేటర్ ద్వారా 1,131 క్యూసెక్కుల నీరు జలాశయానికి చేరుతున్నట్లు ప్రాజెక్ట్ ఈఈ శ్రీనివాసులు తెలిపారు. మరికొన్ని రోజులు ఈ వరద ప్రవాహం ఇలానే కొనసాగితే 35 టీఎంసీలకు చేరుకునే అవకాశం ఉందని అధికారుల సమాచారం. ప్రస్తుతం జలాశయంలో 28.660 టీఎంసీలు ఉన్నాయి. పెన్నా డెల్టాకు 2,650 క్యూసెక్కులు, ఉత్తర కాలువకు 375, దక్షిణ కాలువకు 400 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
అభ్యసన సామర్థ్యాన్ని
మెరుగు పరచండి
● కలెక్టర్ ఆనంద్
నెల్లూరురూరల్: ప్రాథమిక తరగతుల విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని మెరుగు పరిచేందుకు ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు అందరూ సమష్టిగా కృషి చేయాలని కలెక్టర్ ఒ. ఆనంద్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో విద్యార్థుల ప్రావీణ్యత గురించి నిర్వహించిన పరాఖ్ సర్వేక్షన్ సర్వే, 2024 ఫలితాలపై డీడీఈఓలు, ఎంఈఓలు, డైట్ అధ్యాపకులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులతో కలెక్టర్ విస్తృతంగా చర్చించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు అధికారులందరూ కలిసి మోడల్ స్కూల్లో చదువుతున్న విద్యార్థుల్లో గుణాత్మక మార్పు తెచ్చేందుకు కృషి చేయాలన్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో పిల్లల విద్యా సంబంధ విషయాలపై ప్రత్యేక దృష్టి పెట్టి విద్యార్థుల నాణ్యత ప్రమాణాలను పెంచాలన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో మోడల్ స్కూల్స్‌లో చేర్పించేందుకు తల్లిదండ్రులు ఉత్సాహపడే విధంగా వాటిని తయారు చేయాలన్నారు. డీఈఓ బాలాజీరావు మాట్లాడుతూ గతేడాది జిల్లాలోని 108 పాఠశాలల్లో 3, 6, 9 తరగతులకు చెందిన 2,927 మంది విద్యార్థులు, 379 మంది ఉపాధ్యాయులు ఈ సర్వేలో పాల్గొన్నారన్నారు. ఉపాధ్యాయుల ప్రమేయం లేకుండా పిల్లలు స్వతహాగా ఈ సర్వేలో పాల్గొనేలా నిర్వహించామన్నారు. ప్రాథమిక తరగతుల నుంచి ఉన్నత పాఠశాల తరగతులకు వచ్చిన విద్యార్థుల్లో కొన్ని అంశాల్లో ప్రావీణ్యత తగ్గడం గమనించామన్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టి కృషి చేస్తామన్నారు. ఈ సమావేశంలో సమగ్రశిక్ష ఏపీఓ వెంకటసుబ్బయ్య ఇతరులు పాల్గొన్నారు.

జలాశయానికి వరద ప్రవాహం