
అవకాశమిచ్చి.. అధికారం కట్టబెడితే..
● కాసులకు కక్కుర్తిపడి పచ్చకండువా కప్పుకున్న జెడ్పీ వైస్ చైర్‌పర్సన్
ఇందుకూరుపేట: రాష్ట్రంలోనే మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన ఓ మహిళకు అవకాశమిచ్చి.. జెడ్పీ వైస్ చైర్‌పర్సన్ అధికారం కట్టబెడితే.. ఇప్పుడు టీడీపీ నేతల ప్రలోభాలకు తలొగ్గి పచ్చకండువా కప్పుకున్నారు. మండలంలోని మైపాడు గ్రామానికి చెందిన శ్రీహరికోట జయలక్ష్మి ఇందుకూరుపేట జెడ్పీటీసీగా వైఎస్సార్‌సీపీ తరఫున అప్పటి ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి గెలిపించారు. మత్స్యకార సామాజిక వర్గానికి గుర్తింపు కల్పించాలని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆమెకు సముచిత స్థానం కల్పించాలని నెల్లూరు జిల్లా పరిషత్ ఉపాధ్యక్షురాలుగా ఎన్నుకోవాలని నేరుగా ఆదేశించారు. దీంతో ఒక్కసారిగా ఆ సామాజిక వర్గంలో ఎప్పుడూ లేని విధంగా ఈ హోదా దక్కడంతో వారిలో ఆనందం వెల్లివిరిసింది.
తాజాగా టీడీపీలో చేరిక
జెడ్పీ వైస్ చైర్‌పర్సన్ జయలక్ష్మి శుక్రవారం కోవూ రు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి ఆధ్వర్యంలో పచ్చకండువా కప్పుకుంది. అందుకు ఆమెను భారీ మొత్తంతో ప్రలోభ పెట్టినట్లు ఆ సామాజికవర్గంలో చర్చ జరుగుతోంది. మైపాడుకు చెందిన టీడీపీ నేత దువ్వూరు కళ్యాణ్‌కుమార్‌రెడ్డి నేరుగా ఆమెను తన కారులో ఎక్కించుకొని ఎమ్మెల్యే నివాసానికి తీసుకెళ్లి కండువా కప్పించినట్లు తెలిసింది. మత్స్యకారులను గుర్తించి ఈ పదవి ఇచ్చారని, కానీ నమ్మక ద్రోహం చేస్తూ జయలక్ష్మి డబ్బుకు అమ్ముడుపోయి తమకు తీరని మచ్చను తెచ్చారని మత్స్యకార నాయకులు పలువురు విచారం వ్యక్తం చేశారు.