
అవినీతిని బయట పెట్టినందుకే అక్రమ బదిలీ
● న్యాయం జరిగే వరకు అమరణ దీక్ష
● భీష్మించిన సచివాలయ వెల్ఫేర్ సెక్రటరీ భాస్కర్
నెల్లూరు (బారకాసు): కావలి మున్సిపాలిటీ కమిషనర్ శ్రావణ్‌కుమార్ అవినీతిని ప్రశ్నించినందుకు తనను అక్రమంగా చేసిన బదిలీని వెంటనే రద్దు చేయాలని సచివాలయ వెల్ఫేర్ సెక్రటరీ భాస్కర్ డిమాండ్ చేశారు. తనకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయాలంటూ కోరుతూ ఉద్యోగి బుధవారం నెల్లూరు నగర పాలక సంస్థ కార్యాలయ ఆవరణలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగం ముందు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. భాస్కర్ మీడియాతో మాట్లాడుతూ కావలి మున్సిపాలిటీ కమిషనర్ అవినీతిపై ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి తెలియజేసినందుకే తనను అక్రమంగా బదిలీ చేశారని ఆరోపించారు. కమిషనర్ అవినీతిపై ఆధారాలతో సహా మీడియా ముందు బయట పెడతానని తెలియజేశారు. ఇటీవల జరిగిన సచివాలయ ఉద్యోగుల బదిలీల్లో తనకు అన్యాయం జరిగిందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. కావలి మున్సిపాలిటీ పరిధిలోని సచివాలయంలో వెల్ఫేర్ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్న తనని అక్రమంగా, అన్యాయంగా సూళ్లూరుపేట మున్సిపాల్టీకి బదిలీ చేశారన్నారు. తాను దరఖాస్తులో ఎంచుకున్న మూడు స్థానాల్లో ఏ ఒక్క స్థానానికి బదిలీ చేసే అవకాశం కల్పించకుండా సూళ్లూరుపేట మున్సిపాలిటీకి బదిలీ చేయడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేమి అన్యాయమని అధికారులను అడిగితే బదిలీ చేసిన చోటకే వెళ్లాలంటూ ఆదేశిస్తున్నారన్నారు. అందుకే తనకు న్యాయం జరిగేంత వరకు ఆమరణ దీక్ష చేపడుతున్నట్లు భాస్కర్ స్పష్టం చేశారు. భాస్కర్ తనకు న్యాయం చేయాలంటూ కార్పొరేషన్ కమిషనర్ నందన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.
యుద్ధ నౌకకు
‘ఉదయగిరి’ పేరు
ఉదయగిరి: చారిత్రాత్మక నేపథ్యం ఉన్న ‘ఉదయగిరి’కి భారత ప్రభుత్వం గుర్తింపు కల్పించింది. ఒక యుద్ధ నౌకకు ‘ఉదయగిరి’ అనే పేరును నామకరణం చేశారు. ఎఫ్–35 పేరుతో రూపుదిద్దుకుంటున్న ఈ యుద్ధనౌకను అధికారికంగా ఆగస్టు 26వ తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభిస్తారని విశాఖపట్నం నేవీ లెఫ్టినెంట్ కమాండర్ ప్రశాంత్ వెల్లడించారు. ఈ యుద్ధనౌక 148 మీటర్ల పొడవుతో 40 మిస్సైల్స్ ప్రయోగించేలా రూ.600 కోట్ల వ్యయంతో నౌకను తయారు చేశారు. ఇంత ప్రాధాన్యత కలిగిన యుద్ధనౌకకు ‘ఉదయగిరి’ పేరు పెట్టడంతో జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కిలో పొగాకు సగటు ధర రూ.205.22
మర్రిపాడు: మండలంలోని డీసీపల్లి పొగాకు బోర్డు వేలం కేంద్రంలో బుధవారం 569 పొగాకు బేళ్లను విక్రయించినట్లు వేలం నిర్వహణాధికారి రాజశేఖర్ తెలిపారు. వేలానికి 731 బేళ్లు రాగా 569 బేళ్లను విక్రయించామని, మిగిలిన బేళ్లను వివిధ కారణాలతో తిరస్కరించినట్లు తెలిపారు. కిలోకు గరిష్ట ధర రూ.280, కనిష్ట ధర రూ.159 లభించింది. వేలంలో 9 కంపెనీలకు చెందిన వ్యాపార ప్రతినిధులు పాల్గొన్నారు.