
కోలాహలంగా..
నెల్లూరు(బారకాసు): నెల్లూరులోని బారాషహీద్ దర్గాలో జరుగుతున్న రొట్టెల పండగ చివరి ఘట్టానికి చేరింది. బుధవారం వివిధ రాష్ట్రాల భక్తులు పోటెత్తారు. నగరవాసులు కూడా తరలిరావడంతో స్వర్ణాల తీరం కిటకిటలాడింది. బారాషహీదులను దర్శించుకుని ప్రార్థనలు చేశారు. కాగా పండగ గురువారంతో ముగియనుంది. నాలుగోరోజు స్వర్ణాల ఘాట్ వద్ద ఆరోగ్య, వివాహ, విద్య రొట్టెలకు డిమాండ్ ఏర్పడింది. వేలాది మంది భక్తులకు దర్గా కమిటీ అన్నదానం నిర్వహిస్తోంది.
ఆర్టీసీ, దర్గాకు పెరిగిన ఆదాయం
రొట్టెల పండగ సందర్భంగా నాలుగు రోజుల్లో ఆర్టీసీకి రాబ డి పెరిగింది. అలాగే భక్తులు లక్షలాదిగా తరలిరావడంతో కానుకల రూపంలో దర్గాకు కూడా ఆదాయం సమకూరింది.
భక్తిశ్రద్ధలతో తహలీల్ ఫాతేహా
నెల్లూరు(బృందావనం): రొట్టెల పండగ ముగింపు సందర్భంగా తహలీల్ ఫాతేహా కార్యక్రమాన్ని సంప్రదాయంగా బుధవారం మధ్యాహ్నం నిర్వహించారు. ఇన్‌స్పెక్టర్, ఆడిటర్ వక్ఫ్ బోర్డు షేక్ ఖుదావన్ బారాషహీద్‌లకు బోర్డు తరఫున గంధం ప్రత్యేక బిందెలో తీసుకొచ్చి, ఖర్జూరం పండ్లతో సమర్పించారు. ముజావర్లు, ఫకీర్లు, గంధ మహోత్సవం నిర్వాహకులు, మతపెద్దల ఆధ్వర్యంలో ప్రత్యేక దువా నిర్వహించారు. అనంతరం పవిత్ర గంధం, ఖర్జూరాలను భక్తులు పంచిపెట్టారు. పండగ నిర్వాహకులు, మతపెద్దలు మాట్లాడుతూ సోమవారం అర్ధరాత్రితో ప్రారంభమైన గంధ మహోత్సవం బుధవారం నిర్వహించిన తహలీల్ ఫాతేహాతో పరిసమాప్తమైందన్నారు. సంప్రదాయంగా గురువారం ఉదయం జరిగే ఖత్ మే జియారత్ (ముగింపు)తో ఐదు రోజులుగా వైభవంగా జరుగుతున్న రొట్టెల పండగ ముగుస్తుందన్నారు.
రొట్టెల పండగకు తరలివచ్చిన భక్తులు
నాలుగో రోజూ కొనసాగిన రద్దీ
బారాషహీద్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు

కోలాహలంగా..