
ధాన్యం కొనుగోళ్లకు సహకరించండి
నెల్లూరు (పొగతోట): రానున్న సీజన్లో రైతులను ఇబ్బందులు పెట్టకుండా ధాన్యం కొనుగోలుకు సహకరించాలని డీఎస్‌ఓ విజయ్‌కుమార్, సివిల్ సప్లయ్స్ డీఎం అర్జున్‌రావు కోరారు. నగరంలోని పౌరసరఫరాల కార్యాలయంలో రైస్ మిల్లర్లతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. గత సీజన్లో ధాన్యం కొనుగోళ్ల విషయమై పీపీసీల్లో ఏర్పడిన సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని, వీటిని పరిష్కరించి ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చూస్తామని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో తేమ శాతాన్ని పరిశీలించే పరికరాలను ఎలాంటివైతే ఏర్పాటు చేశారో అవే రైస్‌మిల్లుల్లో ఉండేలా చూడాలని సూచించారు. సీఎమ్మార్‌కు సంబంధించిన బ్యాంక్ గ్యారెంటీలను రైస్‌మిల్లర్లు తప్పక ఇవ్వాలని చెప్పారు. ధాన్యం వాహనాలు మిల్లులకొచ్చిన అనంతరం ఆరు గంటల్లో అన్‌లోడ్ చేయాలని, వీటికి జీపీఎస్ తప్పక ఉండాలన్నారు. అనంతరం రైస్ మిల్లర్ల నేతలు మాట్లాడారు. రూ.150 కోట్లకుపైగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, వీటిని చెల్లిస్తే సీఎమ్మార్‌కు ముందుకొస్తామని వివరించారు. సమస్యలను మంత్రి దృష్టికి ఆర్నెల్ల క్రితమే తీసుకెళ్లినా, నేటికీ పరిష్కారం లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.