ఆస్తి కోసం వేధిస్తున్నారయ్యా..
● ఫిర్యాదు చేసిన పలువురు వృద్ధులు
● ఉమేష్‌చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో
‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’
● 97 వినతుల అందజేత
నెల్లూరు(క్రైమ్): తల్లిదండ్రులను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన పిల్లలు ఆస్తి కోసం వేధిస్తున్నారు. మరికొందరు ఏకంగా ఇంట్లో నుంచి గెంటేస్తున్నారు. వృద్ధులు తమ బాధలను పోలీసుల దృష్టికి తీసుకొస్తున్నారు. సోమవారం నెల్లూరులోని ఉమేష్‌చంద్ర కాన్ఫరెన్స్‌హాల్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి 97 మంది విచ్చేసి వివిధ సమస్యలపై జి.కృష్ణకాంత్‌కు వినతిపత్రాలు సమర్పించారు. వాటిని పరిశీలించిన ఆయన సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో మహిళా పోలీస్‌స్టేషన్ డీఎస్పీ చెంచురామారావు, లీగల్ అడ్వైజర్ శ్రీనివాసులురెడ్డి, ఎస్‌బీ – 2 ఇన్‌స్పెక్టర్ బి.శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పాపం వృద్ధులు
● నా ఆస్తులను కుమారుడు లాక్కొని ఇంట్లో నుంచి గెంటేశాడు. తెలిసిన వారింట్లో తలదాచుకుంటున్నాను. విచారించి న్యాయం చేయాలని కొండాపురం ప్రాంతానికి చెందిన ఓ వృద్ధురాలు కోరారు.
● నా కుమారుడు ఐదేళ్ల క్రితం చనిపోయాడు. మనవడు, కోడలు ఆస్తి కోసం తీవ్రంగా కొడుతున్నారు. వారి బారి నుంచి రక్షణ కల్పించాలని బుచ్చిరెడ్డిపాళెం ప్రాంతానికి చెందిన ఓ వృద్ధురాలు ఫిర్యాదు చేశారు.
● నా కుమారులకు ఆస్తిని సమంగా పంచాను. పెద్ద కుమారుడు నా పేరుపై ఉన్న ఇంటిని కూడా తనకు ఇవ్వాలని వేధిస్తున్నాడని నెల్లూరు రూరల్ మండలానికి చెందిన ఓ వృద్ధుడు వినతిపత్రం ఇచ్చాడు.
ఫిర్యాదుల్లో మరికొన్ని..
● ఫ్రెండ్ యాప్‌లో ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. ప్లాట్ల వ్యాపారం చేద్దామని నమ్మించి రూ.6,27,900లు తీసుకుని మోసగించాడని సైదాపురానికి చెందిన ఓ మహిళ కోరారు.
● హైదరాబాద్‌కు చెందిన కుమార్, చంద్రమోహన్‌లు ఆన్‌లైన్‌లో పరిచయమయ్యారు. హాంకాంగ్‌కు చెందిన ట్రేడింగ్ కంపెనీలో రూ.కోటి పెట్టుబడి పెడితే 500 మిలియన్ డాలర్లు వస్తాయని నమ్మించి నగదు తీసుకుని మోసగించారు. నగదు అడిగితే రౌడీలతో చంపిస్తామని బెదిరిస్తున్నారని బాలాజీనగర్‌కు చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు.
● నెల్లూరు బాలాజీనగర్‌కు చెందిన సన్నీ ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి లోబర్చుకున్నాడు. పెళ్లి చేసుకోవాలని అడిగితే ముఖం చాటేస్తున్నాడు. తగిన చర్యలు తీసుకోవాలని బుచ్చిరెడ్డిపాళేనికి చెందిన ఓ యువతి కోరింది.
● ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని బాపట్లకు చెందిన మహేష్ నా వద్ద రూ.13 లక్షల నగదు తీసుకున్నాడు. ఉద్యోగం ఇప్పించకపోగా నగదు అడిగితే చంపుతామని బెదిరిస్తున్నాడంటూ కోవూరు చెందిన వ్యక్తి ఫిర్యాదు చేశాడు.
● సౌత్‌మోపూరుకు చెందిన కృష్ణారెడ్డి నకిలీ కన్సల్టెన్సీ పెట్టి సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి నా వద్ద, స్నేహితుడి వద్ద రూ.5 లక్షల నగదు తీసుకున్నాడు. ఉద్యోగం ఇప్పించలేదు. నగదు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాడని వేదాయపాళేనికి చెందిన ఓ వ్యక్తి వినతిపత్రం ఇచ్చాడు.


