నృసింహుడి క్షేత్రోత్సవం
రాపూరు: ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోన క్షేత్రంలో శుక్రవారం రాత్రి పెనుశిల లక్ష్మీనరసింహస్వామి, ఆదిలక్ష్మీదేవి, చెంచులక్ష్మీదేవేరులతో కలిసి శేషవాహనంపై ఊరేగారు. శేషవాహనాన్ని వివిధ రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి అందులో స్వామి వారు, దేవేరుల ఉత్సవ విగ్రహాలను కొలువుదీర్చి పెంచలకోనలోని తిరు మాడవీధుల్లో క్షేత్రోత్సవం నిర్వహించారు. అంతకుముందు ఉదయం ధ్వజారోహణ కార్యక్రమాన్ని వేదపండితులు వేడుకగా నిర్వహించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తరలిరావాలంటూ గరుడి ద్వారా సకల దేవతలకు ఆహ్వానం పంపారు. వేదమంత్రాల నడుమ గరుత్మంతుడి చిత్రపటాన్ని ధ్వజస్తంభంపైకి ఎగురవేశారు. కార్యక్రమంలో డీసీ సాగర్‌బాబు, చెంగాళమ్మ దేవస్థానం ఏసీ వెంకటేశ్వర్లు, ఉప ప్రధానార్చకులు పెంచలయ్యస్వామి, సీతారామయ్యస్వామి, తిరుమల తిరుపతి దేవస్థాన పాంచరాత్ర ఆగమపండితులు రామానుజాచార్యులు పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. గరుత్మంతుడికి పూజలు అభిషేకాలకు ఉపయోగించిన ప్రసాదాలను స్వీకరిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందన్న విశ్వాసంతో మహిళలు పెద్ద సంఖ్యలో ప్రసాదం కోసం పోటీపడ్డారు.
వేలాదిగా దర్శించుకున్న భక్తులు
ఉత్సవాలకు సకల దేవతలకు ఆహ్వానం


