పేదల గృహ నిర్మాణాల పూర్తికి చర్యలు
● కలెక్టర్ ఆనంద్
నెల్లూరు రూరల్: జిల్లాలో పేదల గృహ నిర్మాణాలను వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని గృహ నిర్మాణశాఖ అధికారులను కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని వారి ఛాంబర్‌లో ఎన్‌టీఆర్ హౌసింగ్ పురోగతిపై శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇళ్ల నిర్మాణ దశలను పూర్తి చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. ఆప్షన్–3 కింద లబ్ధిదారులకు కాంట్రాక్టర్లు నిర్మిస్తున్న ఇళ్లను ఇంజినీరింగ్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. నల్లరేగడి నేలల్లో నిర్మిస్తున్న ఇళ్ల పునాదుల నాణ్యతను సంబంధిత అధికారులు పరిశీలించి సర్టిఫై చేయాలన్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటించని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో గృహ నిర్మాణశాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ వేణుగోపాల్, ఆర్‌అండ్‌బీ, ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్, విద్యుత్‌శాఖల ఏఈలు గంగాధర్, వెంకటరమణ, విజయన్, అశోక్ కుమార్, డీఈలు జహీరుద్దీన్, నారాయణరెడ్డి, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.


