
పొలంలో పనిచేస్తూ..
● వడదెబ్బకు రైతు మృతి
కొడవలూరు: వడదెబ్బ కారణంగా రైతు మృతిచెందాడు. ఈ ఘటన మండలంలోని గండవరం దర్గా దళితవాడలో మంగళవారం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన గుర్రాల లింగయ్య (65) మంగళవారం పొలంలో పనిచేస్తూ ఎండ వల్ల సొమ్మసిల్లి పడిపోయాడు. ఈ విషయాన్ని సమీపంలోని వారు కాస్త ఆలస్యంగా గుర్తించారు. అప్పటికే లింగయ్య చనిపోయినట్లు బంధువులు తెలిపారు.
యువకుడి ఆత్మహత్య
మనుబోలు: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని కొలనకుదరు గ్రామంలో మంగళవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. కొలనకుదురు ఎస్టీ కాలనీకి చెందిన ఈగా చినరాయుడు (25) కుటుంబ కలహాలతో కలత చెంది ఎలుకల మందు తిని తీవ్ర అనారోగ్యానికి లోనయ్యాడు. కుటుంబ సభ్యులు అతడిని చికిత్స నిమిత్తం గూడూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం నెల్లూరుకు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. చినరాయుడికి భార్య, రెండు నెలల వయసున్న పాప ఉన్నారు. పోలీసుల కేసు నమోదు చేశారు.
నేత్రదానం
చినరాయుడి నేత్రాలను దానం చేసేందుకు అతడి భార్య ముందుకొచ్చింది. గ్రామానికి చెందిన కసిరెడ్డి సునీల్‌రెడ్డి గిరిజన కుటుంబానికి అవగాహన కల్పించడంతో వారు చినరాయుడు నేత్రాలను దానం చేసేందుకు అంగీకరించారు. ఐ బ్యాంక్ టెక్నీషియన్ సునీల్ నేత్రాలను సేకరించారు.
అధికారుల హెచ్చరికలు పట్టించుకోకుండా..
● ప్రభుత్వ భూమిలో
మళ్లీ కలప నరికివేత
దుత్తలూరు: మండలంలోని భైరవరం గ్రామంలో ఉన్న ప్రభుత్వ భూమిలో అక్రమంగా కలప నరుకుతున్న విషయమై సోమవారం రెవెన్యూ అధికారులకు గ్రామస్తులు ఫిర్యాదు చేయగా వీఆర్వో వెళ్లి అడ్డుకున్నారు. అయితే అధికారుల హెచ్చరికలు మాకు లెక్కలేదంటూ మంగళవారం యథేచ్ఛగా కలపను నరికి ట్రాక్టర్ల ద్వారా తరలించారు. దీంతో గ్రామస్తులు ఈ విషయాన్ని రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా వారు స్పందించి వీఆర్వో, ఆర్‌ఐ కలప కొడుతున్న ప్రదేశానికి వెళ్లి అడ్డుకున్నారు. ఇప్పటికే రెండు రోజులపాటు కొట్టిన కలపను ట్రాక్టర్ల ద్వారా తరలించి సొమ్ము చేసుకున్నారు. దీంతో కొందరు అధికారులు కూడా అక్రమార్కులకు వంత పాడుతున్నారనే ప్రచారం ఉంది. తహసీల్దార్ యనమల నాగరాజును వివరణ కోరగా పంచాయతీరాజ్ అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. గ్రీవెన్స్‌లో ఫిర్యాదు వచ్చింది కాబట్టి తాము స్పందించామన్నారు. ఇకపై ఆ భూమిలో చెట్లు నరికితే కఠినంగా వ్యవహరిస్తామన్నారు.
జొన్నవాడలో బంగారం,
వెండి, నగదు చోరీ
బుచ్చిరెడ్డిపాళెం రూరల్: మండలంలోని జొన్నవాడ గ్రామంలో భారీ చోరీ జరిగింది. పోలీసుల కథనం మేరకు.. గ్రామంలోని అల్లం సుప్రజ, ఆమె కుమారుడు సోమవారం రాత్రి ఇంటి బయట నిద్రించారు. మంగళవారం తెల్లవారుజామున లేచి ఇంట్లో చూసేసరికి బీరువాలో ఉన్న 20 సవర్ల బంగారం, అర కిలో వెండి, రూ.లక్ష నగదు కనిపించలేదు. చోరీ జరిగిందని గుర్తించిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలాన్ని ఎస్సై సంతోష్‌కుమార్‌రెడ్డి పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.