IPL 2026: సత్తా చాటిన యంగ్‌ గన్స్‌ | Young Players Proved Their Mettle in the 19th Season of the IPL 2026 | Sakshi
Sakshi News home page

IPL 2026: సత్తా చాటిన యంగ్‌ గన్స్‌

Jun 1 2026 6:18 AM | Updated on Jun 1 2026 7:24 PM

Young Players Proved Their Mettle in the 19th Season of the IPL 2026

ఐపీఎల్‌ 19వ సీజన్‌లో సత్తా చాటిన యంగ్‌ గన్స్‌

భవిష్యత్తుపై భరోసా పెంచుతున్న వైభవ్, అన్షుల్‌

ఒక్క ఇన్నింగ్స్‌తో వెలుగులోకి వచ్చిన ప్రఫుల్, ముకుల్‌  

గత రెండు నెలలుగా మండు వేసవిలో నిండు వినోదం పంచిన ఐపీఎల్‌ 19వ సీజన్‌ ముగిసింది! ‘బేబీ బాస్‌’ వైభవ్‌ రికార్డులు తిరగరాస్తూ వీరబాదుడు బాదితే... 
అనామక అన్షుల్‌ ‘పర్పుల్‌ క్యాప్‌’ రేసులో చివరి వరకు నిలిచాడు!

జోఫ్రా ఆర్చర్‌ తన పేస్‌ పవర్‌ తగ్గలేదని నిరూపించుకుంటే... రబాడ తానెంత ప్రమాదకర బౌలరో మరోసారి చాటాడు!

ఐదేసిసార్లు ఐపీఎల్‌ ట్రోఫీ నెగ్గిన చెన్నై సూపర్‌ కింగ్స్, ముంబై ఇండియన్స్‌ సీజన్‌ ఆసాంతం పరాజయాలతో సహవాసం చేయగా... లక్నో సూపర్‌ జెయింట్స్‌ను నడిపించలేక రిషభ్‌ పంత్‌ నాయకత్వ బాధ్యతలకు రాం రాం చెప్పాడు! 

చెన్నై భారీ ధర పెట్టిన కార్తీక్, ప్రశాంత్‌ పెద్దగా ఆకట్టుకోలేకపోగా... హైదరాబాద్‌ కొత్త పేసర్లు ప్రఫుల్, సాకిబ్‌ లీగ్‌పై తమదైన ముద్ర వేశారు!

ఢిల్లీ హార్డ్‌ హిట్టర్‌ సమీర్‌ రిజ్వీ మెరుపులు ఆరంభ మ్యాచ్‌లకే పరిమితమైతే... లక్నో పించ్‌హిట్టర్‌ ముకుల్‌ ఒక్క ఇన్నింగ్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు!

అంతర్జాతీయ టి20లకు వీడ్కోలు పలికినా తన పరుగుల దాహం తీరలేదని కోహ్లి నిరూపించుకుంటే... లయ దొరకబుచ్చుకోలేక సూర్యకుమార్, హార్దిక్‌ విమర్శల పాలయ్యారు!

వెస్టిండీస్‌ ప్లేయర్ల విధ్వంసకర విన్యాసాలు కొన్ని మ్యాచ్‌లకే పరిమితం కాగా... అన్‌క్యాప్డ్‌ ప్లేయర్ల మెరుపులు భారత బెంచ్‌ బలాన్ని చాటాయి! 

టెస్టు ప్లేయర్లుగా ముద్రపడ్డ ఆటగాళ్లు ఆరెంజ్, పర్పుల్‌ క్యాప్‌ రేసులో ముందుంటే.. దేశవాళీల్లో రాణించిన అఖీబ్‌ నబీ ఐపీఎల్‌లో అదే జోరు కనబర్చలేకపోయాడు!

ఇలా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 19వ సీజన్‌లో జరిగిన కొన్ని కీలక అంశాలపై ఓ కన్నేస్తే...        

10 జట్లు, 65 రోజులు, 74 మ్యాచ్‌లు, వందలకొద్దీ రికార్డులు, వేలాది బౌండరీలు... ఇలా వేసవిలో మస్తు మజా పంచిన ఐపీఎల్‌–19వ సీజన్‌ ఎప్పటిలాగే కోట్లాది మంది అభిమానాన్ని చూరగొంది. దినదిన ప్రవర్ధమానంగా దూసుకెళ్తున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌... ఈసారి కూడా ఎందరో యువ ఆటగాళ్లను అందలం ఎక్కించింది. బ్యాటింగ్‌కు అనుకూలమైన నిబంధనల కారణంగా భారీ స్కోర్లు నమోదయ్యాయనే అపవాదు ఉన్నా... ఈ సీజన్‌లో పరుగుల వరద పారిందనేది వాస్తవం.

 200 స్కోరు సాధారణం అయిపోయిన తరుణంలో... రాజస్తాన్‌ రాయల్స్‌ తమ పదునైన బౌలింగ్‌తో 159 పరుగుల మ్యాచ్‌లో 40 పరుగుల తేడాతో విజయం సాధించడం విశేషం. మొహమ్మద్‌ షమీ తొలి బంతికి వికెట్‌ తీసే అలవాటును కొనసాగించగా... ప్రిన్స్‌ యాదవ్‌ తన వేగంతో టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. 264 పరుగులు చేసి కూడా ఢిల్లీ క్యాపిటల్స్‌ మ్యాచ్‌ గెలవలేకపోగా... అంత పెద్ద లక్ష్యాన్ని పంజాబ్‌ మరో 7 బంతులుండగానే ఛేదించి ‘వావ్‌’ అనిపించింది. గత సీజన్‌లోనే మెరుపు సెంచరీతో వెలుగులోకి వచ్చిన 15 ఏళ్ల వైభవ్‌ సూర్యవంశీ ఈ ఏడాది నిలకడైన బాదుడుతో ప్రపంచవ్యాప్తంగా తనపేరు మారుమోగేలా చేసి భారత సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. 

‘టెస్టు’ ప్లేయర్ల సత్తా... 
అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌ ఎందులో తీసుకున్న టెస్టు ప్లేయర్లే ఐపీఎల్‌లో తమదైన ముద్ర వేశారు. బౌలింగ్‌లో రబాడ, ఆర్చర్, భువనేశ్వర్‌ విజృంభిస్తే... బ్యాటింగ్‌లో శుబ్‌మన్‌ గిల్, సాయి సుదర్శన్‌ సత్తా చాటారు. టీమిండియా టెస్టు కెపె్టన్‌ గిల్‌ 16 మ్యాచ్‌ల్లో 45.75 సగటుతో 732 పరుగులు సాధించి సెలెక్టర్లకు సవాల్‌ విసిరాడు. ఈ ఏడాది టి20 ప్రపంచకప్‌ గెలిచిన భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోయన గిల్‌... తాజా సీజన్‌లో తన బ్యాట్‌తోనే బదులిచ్చాడు. నిదానంగా ఆడతాడనే ముద్రను చెరిపేసుకుంటూ 163.02 స్ట్రయిక్‌రేట్‌తో చెలరేగిపోయాడు. క్వాలిఫయర్‌–2 మ్యాచ్‌ను పరిశీలిస్తే అతడి ధాటి ఎలాంటిదో అర్థమవుతుంది. వైభవ్‌ సూర్యవంశీ మినహా మిగిలినవాళ్లంతా బ్యాటింగ్‌ చేసేందుకు తీవ్రంగా ఇబ్బంది పడిన పిచ్‌పై గిల్‌ మంచినీళ్ల ప్రాయంలా పరుగులు రాబట్టాడు. ఆర్చర్, బర్గర్, బ్రిజేశ్, జడేజాతో కూడిన బౌలింగ్‌ లైనప్‌ను ఎదుర్కొంటూ 53 బంతుల్లోనే 104 పరుగులు చేశాడు. 

అందులో ఎక్కడా మచ్చుకు కూడా అడ్డదిడ్డమైన బాదుడు లేదు. అచ్చమైన క్రికెటింగ్‌ షాట్‌లతో చాపకింద నీరులా పరుగులు సాధిస్తూ చూస్తుండగానే రాయల్స్‌ చేతుల్లో నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నాడు. పట్టు సాధించేంత వరకు సిక్స్‌ల జోలికి పోని గిల్‌... సరైన టైమింగ్‌ వాడితే ఎంతటి లక్ష్యాన్ని అయినా చేధించవచ్చని నిరూపించాడు. మరోవైపు అతడి ఓపెనింగ్‌ సహచరుడు సాయి సుదర్శన్‌ కూడా ఈ సీజన్‌లో తనదైన ముద్ర వేశాడు. భారత టెస్టు జట్టు సభ్యుడైన సుదర్శన్‌ తాజా సీజన్‌లో 17 మ్యాచ్‌ల్లో 45.13 సగటుతో 722 పరుగులు సాధించాడు. గిల్, సుదర్శన్‌ల ఆటతీరు కారణంగానే టైటాన్స్‌ నిలకడైన ప్రదర్శన కొనసాగించగలిగిందనేది నిజం! టెస్టు ప్లేయర్లుగా ముద్ర పడ్డ ఈ ఇద్దరూ ఎక్కడా తొందరపాటుకు పోకుండా ఆచితూచి ఆడటంతోనే పరుగుల వీరుల జాబితాలో చోటు దక్కించుకోగలిగారు. ఫార్మాట్‌ ఏదైనా టెక్నిక్‌ ముఖ్యం అని ఈ జంట మరోసారి చాటింది.  

అన్షుల్‌ అదుర్స్‌ 
రంజీ ట్రోఫీ ఒకే ఇన్నింగ్స్‌లో 10కి 10 వికెట్లు పడగొట్టి వెలుగులోకి వచ్చిన అన్షుల్‌ కంబోజ్‌... ఈ సీజన్‌లో తనదైన ముద్ర వేశాడు. చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించిన ఈ కుడిచేతి వాటం పేసర్‌... 14 మ్యాచ్‌ల్లో 26.32 సగటుతో 21 వికెట్లు పడగొట్టాడు. మిగతా జట్లతో పోల్చుకుంటే... పాతికేళ్ల అన్షుల్‌కు మరో ఎండ్‌ నుంచి సరైన సహకారం లేనçప్పటికీ అతడు నిలకడైన ప్రదర్శన కనబర్చాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ పేసర్‌ కార్తీక్‌ త్యాగీ మంచి వేగంతో అభిమానులను ఆకర్షించాడు. ఈ సీజన్‌లో అతడు 13 ఇన్నింగ్స్‌ల్లో 27.66 సగటుతో 18 వికెట్లు పడగొట్టాడు. ప్రిన్స్‌ యాదవ్‌ 14 మ్యాచ్‌ల్లో 28.68 సగటుతో 16 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. 36 ఏళ్ల వయసులో భువనేశ్వర్‌ తన స్వింగ్‌ సత్తా ఏంటో ప్రపంచానికి చాటాడు. కళ్లు చెదిరే అవుట్‌ స్వింగర్‌లతో బెంగళూరుకు ఇతోధిక సాయం చేశాడు. భారీగా పరుగులు ఇచ్చుకుంటాడనే ముద్రపడ్డ సిరాజ్‌ ఈసారి పొదుపైన బౌలింగ్‌తో ఆకట్టుకుంటే... టి20 ప్రంపచకప్‌ హీరోలు జస్‌ప్రీత్‌ బుమ్రా, అర్ష్ దీప్‌ సింగ్‌ 
అనామక బౌలర్లుగా కనిపించారు.  

వారెవ్వా వైభవ్‌ సూర్యవంశీ... 
నూనుగు మీసాలు కూడా రాని ఓ 15 ఏళ్ల కుర్రాడు... అంతర్జాతీయ స్థాయిలో కొమ్ములు తిరిగిన బౌలర్లను ఊచకోత కోయడం ఈ సీజన్‌కే హైలైట్‌గా నిలిచింది. గత సీజన్‌లో 35 బంతుల్లో సెంచరీతో తన రాకను ఘనంగా చాటిన రాజస్తాన్‌ రాయల్స్‌ ఓపెనర్‌ వైభవ్‌ సూర్యవంశీ... ఈ ఏడాది ప్రతి క్రికెట్‌ అభిమాని తన పేరు జపించేలా చేశాడు. 16 మ్యాచ్‌ల్లో 48.50 సగటుతో 776 పరుగులు చేసి ఒక సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌గా నిలిచాడు. మామూలుగా ఒక వంద పరుగులు రెండొందల స్ట్రయిక్‌ రేట్‌తో కొట్టడమే కష్టం అనుకుంటే... వైభవ్‌ 776 పరుగులను ఏకంగా 237.30 స్ట్రయిక్‌రేట్‌తో బాదాడు. గణాంకాలు చూస్తే అతడి దూకుడును అర్ధం చేసుకోవడం కష్టమే. 

ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర బౌలర్లను అతడు ఎదుర్కొన్న తీరు మాత్రం నభూతో! మిచెల్‌ స్టార్క్, ప్యాట్‌ కమిన్స్, జస్‌ప్రీత్‌ బుమ్రా వంటి వాళ్ల బౌలింగ్‌లో ఏమాత్రం బెరుకు లేకుండా తొలి బంతికే సిక్స్‌లు కొట్టిన అతడి తెగువకు ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. ఈ సీజన్‌లో ఒక సెంచరీ తన పేరిట రాసుకున్న వైభవ్‌... మరో రెండుసార్లు శతకం గుమ్మం వద్ద అవుటయ్యాడు. ఫోర్‌ (63)ల కంటే సిక్స్‌ (72)లే ఎక్కువ కొట్టిన సూర్యవంశీ... అవసరమైతే నిదానంగానూ ఆడగలనని క్వాలిఫయర్‌–2లో నిరూపించుకున్నాడు. సహచరుల విఫలమైన చోట వికెట్‌ విలువ గుర్తెరిగి ఆచితూచి ఆడటంతోనే అతడిపై అంచనాలు మరింత ఎక్కువయ్యాయి. 90వ దశకంలో సచిన్‌ టెండూల్కర్‌ తరహాలో... రాజస్తాన్‌ రాయల్స్‌  జట్టును ఈ సీజన్‌లో వైభవ్‌ తన భుజస్కందాలపై మోశాడు. అతడు ఇదే నిలకడ, క్రమశిక్షణ, కఠోర శ్రమ కొనసాగిస్తే... క్రికెట్‌కు మరో ఆణిముత్యం దొరికినట్లే! 

–సాక్షి, క్రీడావిభాగం  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement