
టీమిండియా దిగ్గజాలు విరాట్ కోహ్లి (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma) అంతర్జాతీయ కెరీర్‌లో చివరి దశకు చేరుకుంటున్నారు. ఇప్పటికే ఇంటర్నేషనల్ టీ20 ఫార్మాట్, టెస్టులకు ఈ లెజెండరీ బ్యాటర్లు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ప్రస్తుతం టీమిండియా తరఫున వన్డేల్లో కొనసాగుతున్న రో-కో ద్వయం వన్డే ప్రపంచకప్-2027 వరకు ఆడతారా? లేదా? అన్నది కూడా ప్రశ్నార్థకంగానే మారింది.
ఆట కంటే ఎవరూ తోపులు కారు
ఈ నేపథ్యంలో యువరాజ్ సింగ్ తండ్రి, భారత మాజీ క్రికెటర్ యోగ్‌రాజ్ సింగ్ (Yograj Singh) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చంద్రకాంత్ పండిట్ వంటి కోచ్ దగ్గరికి వెళ్తే కోహ్లి, రోహిత్ మరికొన్నేళ్ల పాటు ఆటలో కొనసాగవచ్చని పేర్కొన్నాడు. ‘‘రోహిత్, విరాట్ అత్యంత ప్రతిభావంతులైన ఆటగాళ్లు అని ఒప్పుకొంటాను.
అయితే, వారికి గనుక నేనే కోచ్‌ని అయి ఉంటే.. ‘ఉదయం ఐదు గంటలు అయింది. లేవండి.. శిక్షణ మొదలుపెడదాం పదండి’ అనే చెప్తా. ఎందుకంటే ఆట కంటే ఎవరూ గొప్పోళ్లు, తోపులు కారు. ఆస్ట్రేలియా పర్యటనలో కోహ్లి ఆఫ్ స్టంప్ దిశగా వెళ్తున్న బంతిని ఆడేందుకు ప్రయత్నించి పదే పదే అవుటయ్యాడు.
పది కిలోమీటర్లు పరిగెత్తాలి బాబూ!
అయినా సరే.. విరాట్ దగ్గరికి వెళ్లి.. ‘నువ్వు తప్పుగా ఆడుతున్నావు. బ్యాటింగ్‌పై దృష్టి పెట్టు’ అని ఎవరూ ఎందుకు చెప్పరు? రోహిత్ దగ్గరికి వెళ్లి ఐదు గంటలకే లేచి పది కిలోమీటర్లు పరిగెత్తాలి అని ఎందుకు అతడిని తొందరపెట్టరు?
డాన్ బ్రాడ్‌మాన్ సగటు 99.9గా ఉంటే.. మన సగటు 54-55 మధ్య మాత్రమే ఎందుకు ఉందని రో-కో తమను తాము ఎందుకు ప్రశ్నించుకోరు?.. ‘నేనే దేవుణ్ణి.. అందరికంటే గొప్పోడిని’ అనుకుంటే కుదరదు. సచిన్ 43 ఏళ్ల వయసు వరకు ఎలా ఆడగలిగాడు? ఎంత ఎదిగినా ఒదిగి ఉండటమే మంచిది.
ముంబై తరపున రంజీల్లో ఆఖరి వరకు సచిన్ ఆడిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి’’ అని యోగ్‌రాజ్ సింగ్ విరాట్- రోహిత్‌ల తీరును విమర్శించాడు. ఇన్‌సైడ్ స్పోర్ట్‌తో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. కాగా కోల్‌కతా నైట్ రైడర్స్‌కు గతేడాది ఐపీఎల్ టైటిల్ అందించిన దేశీ కోచ్ చంద్రకాంత్ పండిట్ వంటి వారి వద్దకు రో-కో వెళ్లి.. తమ తప్పులు సరిచేసుకోవాలని యోగ్‌రాజ్ ఈ సందర్భంగా సూచించాడు.
ఆసీస్‌తో వన్డేలతో రీఎంట్రీ
కాగా టీమిండియా సెప్టెంబరు 9- 28 వరకు ఆసియా కప్-2025 టోర్నమెంట్‌తో బిజీ కానుంది. ఈసారి టీ20 ఫార్మాట్లో టోర్నీ జరుగుతున్నందున విరాట్- రోహిత్‌కు మరికొంత కాలం విశ్రాంతి లభించనుంది. ఈ మెగా ఈవెంట్ తర్వాత స్వదేశంలో వెస్టిండీస్‌తో టెస్టులు ఆడిన తర్వాత.. పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఆడేందుకు టీమిండియా.. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది.
ఇక ఆసీస్‌తో వన్డే సిరీస్‌తో వీరిద్దరు రీఎంట్రీ ఇవ్వనున్నారు. ఇందుకోసం ఇ ప్పటికే ఇద్దరూ ఫిట్‌నెస్ పరీక్ష పాసయ్యారు. కాగా రోహిత్- కోహ్లి చివరగా ఆస్ట్రేలియా టూర్‌లో టెస్టు సిరీస్ సందర్భంగా టీమిండియాకు ఆడారు.
చదవండి: ఆసియా కప్-2025: పూర్తి షెడ్యూల్, అన్ని జట్లు, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు