వారెవా వ్యాట్‌... సిక్సర్‌ సోఫీ..!

Wyatt, Ecclestone fire England to another World Cup final - Sakshi

మహిళల ప్రపంచకప్‌ ఫైనల్లో ఇంగ్లండ్‌

సెమీస్‌లో 137 పరుగులతో దక్షిణాఫ్రికాపై ఘన విజయం

ఆదివారం తుది పోరులో ఆస్ట్రేలియాతో ఢీ

క్రైస్ట్‌చర్చ్‌: డిఫెండింగ్‌ చాంపియన్, నాలుగు సార్లు ప్రపంచ కప్‌ విజేత ఇంగ్లండ్‌ జట్టు మహిళల వన్డే వరల్డ్‌ కప్‌లో ఫైనల్లోకి అడుగు పెట్టింది. ఈ టోర్నీ తొలి మూడు మ్యాచ్‌లలో ఓడి ఒక దశలో లీగ్‌ స్థాయిలోనే నిష్క్రమించేలా కనిపించిన టీమ్‌...మ్యాచ్‌ మ్యాచ్‌కు పదునైన ఆటను ప్రదర్శిస్తూ ఆరో సారి మెగా టోర్నీలో తుది పోరుకు అర్హత సాధించింది. గురువారం జరిగిన సెమీ ఫైనల్లో ఇంగ్లండ్‌ 137 పరుగుల భారీ తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 293 పరుగులు చేసింది.

‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ డ్యానీ వ్యాట్‌ (125 బంతుల్లో 129; 12 ఫోర్లు) శతకంతో చెలరేగగా, సోఫీ డన్‌క్లీ (72 బంతుల్లో 60; 4 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించింది. వీరిద్దరు ఐదో వికెట్‌కు 116 పరుగులు జోడించారు. అనంతరం దక్షిణాఫ్రికా 38 ఓవర్లలో 156 పరుగులకే కుప్పకూలింది. డు ప్రీజ్‌ (30)దే అత్యధిక స్కోరు. లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ సోఫీ ఎకెల్‌స్టోన్‌ (6/36) ఆరు వికెట్లతో చెలరేగి ప్రత్యర్థి పతనాన్ని శాసించింది. ఆదివారం జరిగే ఫైనల్లో ఆరు సార్లు చాంపియన్‌ ఆస్ట్రేలియాతో ఇంగ్లండ్‌ తలపడుతుంది.  

శతక భాగస్వామ్యం...
ఓపెనర్‌ బీమాంట్‌ (7), కెప్టెన్‌ హీతర్‌ నైట్‌ (1), సివర్‌ (15) విఫలం కాగా, ఎమీ జోన్స్‌ (32 బంతుల్లో 28; 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించింది. అయితే వ్యాట్, డన్‌క్లీ కలిసి భారీ స్కోరుకు బాటలు వేశారు. వీరిద్దరిని నిలువరించేందుకు దక్షిణాఫ్రికా తీవ్రంగా ప్రయత్నించి విఫలమైంది. ఒకటి కాదు రెండు కాదు...ఏకంగా వ్యాట్‌ ఇచ్చిన ఐదు క్యాచ్‌లు వదిలేసి (22, 36, 77, 116, 117 పరుగుల వద్ద) సఫారీ టీమ్‌ ప్రత్యర్థికి మేలు చేసింది! ఈ క్రమంలో 98 బంతుల్లోనే వ్యాట్‌ సెంచరీ పూర్తయింది. ఎట్టకేలకు పార్ట్‌నర్‌షిప్‌ వంద పరుగులు దాటిన తర్వాత 45వ ఓవర్లో వ్యాట్‌ వెనుదిరిగింది. చివరి 10 ఓవర్లలో ఇంగ్లండ్‌ 75 పరుగులు చేసింది.  

టపటపా...
2017 వన్డే ప్రపంచకప్‌లోనూ ఇంగ్లండ్‌ చేతిలో సెమీస్‌లోనే ఓడిన దక్షిణాఫ్రికా ఈ సారీ అదే తరహాలో వెనుదిరిగింది. ఛేదనలో ఆ జట్టు ఏ దశలోనూ కనీస స్థాయి ప్రదర్శన కూడా ఇవ్వలేకపోయింది. టోర్నీలో టాప్‌ స్కోరర్‌ అయిన లౌరా వాల్‌వార్ట్‌ (0) డకౌట్‌తో దక్షిణాఫ్రికా పతనం మొదలు కాగా, ఆ తర్వాత ఒక్కరూ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దలేకపోయారు. 67/4 తర్వాత ఎకెల్‌స్టోన్‌ జోరు మొదలైంది. తర్వాతి ఆరు వికెట్లూ ఆమె ఖాతాలోనే చేరడం విశేషం. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top