భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న మహిళల వన్డే ప్రపంచకప్ నుంచి పాకిస్తాన్ జట్టు ఒక్క గెలుపు కూడా లేకుండా అవమాన భారంతో నిష్క్రమించింది.
శ్రీలంకతో ఇవాళ (అక్టోబర్ 24) జరగాల్సిన వారి చివరి లీగ్ మ్యాచ్ వర్షం కారణంగా తుడిచిపెట్టుకునపోయింది. దీంతో ప్రస్తుత ఎడిషన్లో గెలుపు నోచుకోని ఏకైక జట్టుగా పాక్ టోర్నీ నుంచి వైదొలిగింది.
టోర్నీ ప్రారంభానికి ముందు టీమిండియా సహా అగ్రశ్రేణి జట్లనన్నిటినీ ఓడిస్తామని ప్రగల్బాలు పలికిన పాక్ ప్లేయర్లు.. తొలి మ్యాచ్లోనే వారికంటే బలహీనమైన బంగ్లాదేశ్ చేతిలోనే ఓడారు. టోర్నీ మొత్తంలో 7 మ్యాచ్లు ఆడి 4 పరాజయాలు ఎదుర్కొన్నారు. 3 మ్యాచ్లు వర్షం కారణంగా రద్దయ్యాయి.
భారత్పై ఏదో పొడిచేస్తామని బీరాలు పలికిన పాక్ 88 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. ఆతర్వాత ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా చేతుల్లో కూడా అవమానకర ఓటములు ఎదుర్కొంది. ఇంగ్లండ్, న్యూజిలాండ్, శ్రీలంకతో మ్యాచ్లు రద్దయ్యాయి.
ఇవాళ శ్రీలంకతో జరగాల్సిన మ్యాచ్కు ఆది నుంచే వరుణుడు అడ్డు తగిలాడు. కొన్ని గంటల తర్వాత వర్షం కాస్త ఎడతెరిపినివ్వడంతో టాస్ పడింది. శ్రీలంక టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకోగా.. 4.2 ఓవర్ల తర్వాత మరోసారి భారీ వర్షం మొదలైంది. దీంతో చేసేదేమీ లేక అంపైర్లు మ్యాచ్ను రద్దు చేశారు. మ్యాచ్ నిలిచిపోయే సమయానికి పాక్ వికెట్ నష్టపోకుండా 18 పరుగులు చేసింది.
ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండానే పాక్, శ్రీలంక జట్లు ఇదివరకే టోర్నీ నుంచి ఎలిమినేట్ అయ్యాయి. ఈ రెండు జట్లతో పాటు బంగ్లాదేశ్, న్యూజిలాండ్ కూడా నిష్క్రమించాయి. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, భారత్ సెమీస్కు అర్హత సాధించాయి.
పాయింట్ల పట్టికలో భారత్ నాలుగో స్థానాన్ని ఖరారు చేసుకోగా.. తొలి మూడు స్థానాల కోసం ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ జట్ల మధ్య పోటీ జరుగుతుంది. సెమీస్కు చేరిన నాలుగు జట్లు ఇంకా తలో మ్యాచ్ ఆడాల్సి ఉంది. రేపటి మ్యాచ్లో (అక్టోబర్ 25) ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా తలపడనుండగా.. 26న ఉదయం మ్యాచ్లో ఇంగ్లండ్-న్యూజిలాండ్.. మధ్యాహ్నం మ్యాచ్లో భారత్-బంగ్లాదేశ్ ఢీకొంటాయి.


