
ది హండ్రెడ్ ఉమెన్స్ కాంపిటీషన్ 2025 ఫైనల్లో నార్తరన్ సూపర్ ఛార్జర్స్ అడుగుపెట్టింది. శనివారం కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా జరిగిన ఎలిమినేటర్‌లో లండన్ స్పిరిట్‌ను 42 పరుగుల తేడాతో చిత్తు చేసిన సూపర్ ఛార్జర్స్ తొలిసారి ఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో సూపర్ ఛార్జర్స్ యువ సంచలనం డేవినా పెర్రిన్ అద్భుతమైన సెంచరీతో చెలరేగింది.
ఓపెనర్‌గా బరిలోకి దిగిన 18 ఏళ్ల డేవినా పెర్రిన్.. ప్రత్యర్ధి బౌలర్లను ఉతికారేసింది. ఓవల్ మైదానంలో ఆమె బౌండరీల వర్షం కురిపించింది. కేవలం 42 బంతుల్లోనే తొలి టీ20 సెంచరీ మార్క్‌ను పెర్రిన్ అందుకుంది. మొత్తంగా 43 బంతులు ఎదుర్కొన్న పెర్రిన్.. 15 ఫోర్లు, 5 సిక్స్‌లతో 101 పరుగులు చేసింది. ఆమెతో పాటు ఫోబ్ లిచ్‌ఫీల్డ్(35), నికోలా క్యారీ(31) రాణించారు.
దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్ ఛార్జర్స్ నిర్ణీత వంద బంతుల్లో 5 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేధనలో లండన్ స్పిరిట్ అమ్మాయిలు 9 వికెట్లు కోల్పోయి 172 పరుగులకే పరిమితమయ్యారు. లండన్ స్పిరిట్ బ్యాటర్లలో చార్లీ నాట్ (40), జార్జియా రెడ్‌మైన్(50) పోరాడనప్పటికి తమ జట్టును ఫైనల్‌కు చేర్చలేకపోయారు.
సూపర్ ఛార్జర్స్ బౌలర్లలో గ్రేస్ బల్లింగర్,అన్నాబెల్ సదర్లాండ్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. క్రాస్ రెండు వికెట్లు సాధించింది. ఇక ఆదివారం జరగనున్న ఫైనల్లో సదరన్ బ్రేవ్ ఉమెన్, నార్తర్న్ సూపర్‌చార్జర్స్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి.
ఇక ఈ మ్యాచ్‌లో సెంచరీతో విధ్వంసం సృష్టించిన పెర్రిన్ పలు రికార్డును తన పేరిట లిఖించుకుంది. టీ20 క్రికెట్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన ఇంగ్లండ్ మహిళా క్రికెటర్‌గా పెర్రిన్ చరిత్ర సృష్టించింది. అదేవిధంగా ది హాండ్రడ్ మహిళల టోర్నీలో టామీ బ్యూమాంట్ తర్వాత సెంచరీ సాధించిన రెండవ ప్లేయర్‌గా పెర్రిన్ నిలిచింది. ఇక ఓవరాల్‌గా దిహాండ్రడ్(మెన్స్, ఉమెన్స్)లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన రెండో క్రికెటర్‌గా పెర్రిన్ రికార్డులెక్కింది. నార్తరన్ సూపర్ ఛార్జర్స్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ 2023లో 41 బంతుల్లోనే సెంచరీ సాధించాడు.
ఎవరీ పెర్రిన్..?
18 ఏళ్ల డేవినా పెర్రిన్ ఇంగ్లండ్ అండర్-19 జట్టు తరపున అద్బుతంగా రాణించడంతో ది హాండ్రడ్ లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ఏడాది ఆరంభంలో మలేషియా వేదికగా జరిగిన అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్‌లో పెర్రిన్ సంచలన ప్రదర్శన కనబరిచింది. ఈ టోర్నీలో ఆమె ఇంగ్లండ్ తరపున టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఐదు ఇన్నింగ్స్‌లలో ఆమె 176 పరుగులు చేసింది.
పెర్రిన్‌కు అద్బుతమైన బ్యాటింగ్ స్కిల్స్ ఉన్నాయి. పవర్‌ప్లేలో దూకుడుగా ఆడే సత్తా ఆమెకు ఉంది. అండర్-19 ప్రపంచకప్‌లో యూఎస్‌ఎతో జరిగిన మ్యాచ్‌లో ఆమె 45 బంతుల్లో 74 పరుగులు చేసింది. ఆ తర్వాత భారత్‌తో జరిగిన సెమీఫైనలోలో కూడా పెర్రిన్ కీలక ఇన్నింగ్స్ ఆడింది. ఇదే ఫామ్‌ను పెర్రిన్ కొనసాగిస్తే ఇంగ్లండ్ జాతీయ జట్టులో అతి త్వరలోనే ఎంట్రీ ఇచ్చే అవకాశముంది.