
ఈ ఏడాది ముంబై ఇండియన్స్ యాజమాన్యమైన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కు (RIL) బాగా కలిసొచ్చినట్లుంది. ప్రపంచ వ్యాప్తంగా వారి ఫ్రాంచైజీలు ఇప్పటికే నాలుగు మేజర్ టీ20 టైటిళ్లను చేజిక్కించుకున్నాయి. తొలుత సౌతాఫ్రికా టీ20 లీగ్ టైటిల్‌ను కైవసం చేసుకున్న వారి జట్టు (ఎంఐ కేప్‌టౌన్).. ఆతర్వాత మహిళల ఐపీఎల్ టైటిల్‌ను (ముంబై ఇండియన్స్ వుమెన్స్), అనంతరం మేజర్ లీగ్ క్రికెట్ టైటిల్‌ను (ఎంఐ న్యూయార్క్), తాజాగా హండ్రెడ్ లీగ్ టైటిల్‌ను (ఓవల్ ఇన్విన్సిబుల్స్) సొంతం చేసుకున్నాయి.
ముంబై ఇండియన్స్ యాజమాన్యం ఈ ఏడాదే ఓవల్ ఇన్విన్సిబుల్స్‌లోని 49 శాతం వాటాను కొనుగోలు చేసింది. వచ్చే సీజన్ నుంచి ఈ ఫ్రాంచైజీ పేరు కూడా ముంబై ఇండియన్స్ లండన్‌గా మారే అవకాశం ఉంది. ముంబై ఇండియన్స్ యాజమాన్యం చేతుల్లో పడ్డాక ఇన్విన్సిబుల్స్ పురుషుల జట్టు హండ్రెడ్ లీగ్‌లో వరుసగా తమ మూడో టైటిల్‌ను సాధించింది. అంతకుముందు ఆ ఫ్రాంచైజీ 2023, 2024 ఎడిషన్లలోనూ విజేతగా నిలిచింది.
హండ్రెడ్ లీగ్ టైటిల్‌తో ముంబై ఇండియన్స్ కేబినెట్‌లో టైటిళ్ల సంఖ్య 13కు చేరింది. ఈ ఫ్రాంచైజీకి మూలమైన ముంబై ఇండియన్స్ పురుషుల జట్టు ఐపీఎల్‌లో ఐదు టైటిళ్లు సాధించి, అత్యంత విజయంవంతమైన జట్టుగా సీఎస్‌కేతో పాటు చలామణి అవుతుంది.
ఇదే జట్టు రెండు ఛాంపియన్స్ లీగ్ టైటిళ్లు (2011, 2013) కూడా సాధించింది. మహిళల ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ రెండు టైటిళ్లు (2023, 2025) సాధించింది. యూఎస్‌ఏలో జరిగే మేజర్ లీగ్ క్రికెట్‌లో రెండు టైటిళ్లు (2023, 2025), దుబాయ్‌లో జరిగే ఇంటర్నేషనల్ టీ20 లీగ్ (2024), సౌతాఫ్రికాలో జరిగే సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో (2025) చెరో టైటిల్ చేజిక్కించుకుంది.
నిన్న జరిగిన పురుషుల హండ్రెడ్ లీగ్ ఫైనల్లో ముంబై ఇండియన్స్ లండన్ (ఓవల్ ఇన్విన్సిబుల్స్) ట్రెంట్ రాకెట్స్‌పై 26 పరుగుల తేడాతో గెలుపొంది విజేతగా అవతరించింది. ఈ మ్యాచ్‌లో ఇన్విన్సిబుల్స్ తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 100 బంతుల్లో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేయగా.. ట్రెంట్ రాకెట్స్ ఛేదనలో తడబడి 142 పరుగులకే పరిమితమైంది.
ఇన్విన్సిబుల్స్ తరఫున విల్ జాక్స్ (41 బంతుల్లో 72; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగగా.. మార్కస్ స్టోయినిస్ (38 బంతుల్లో 64; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) ట్రెంట్ రాకెట్స్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. నాథన్ సౌటర్ (20-7-25-3) అద్భుతంగా బౌలింగ్ చేసి రాకెట్స్‌ను దెబ్బకొట్టాడు.