ముంబై ఇండియన్స్‌ హ్యాట్రిక్‌.. సన్‌రైజర్స్‌కు తొలి టైటిల్‌ | The Hundred League 2025: Oval Invincibles Won Hattrick Titles In Men's, Northern Superchargers Won First Title In Womens | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌ గడ్డపై ఐపీఎల్‌ ఫ్రాంచైజీల హవా.. ముంబై ఇండియన్స్‌ హ్యాట్రిక్‌.. సన్‌రైజర్స్‌కు తొలి టైటిల్‌

Sep 1 2025 7:08 AM | Updated on Sep 1 2025 7:12 AM

The Hundred League 2025: Oval Invincibles Won Hattrick Titles In Men's, Northern Superchargers Won First Title In Womens

ఇంగ్లండ్‌ వేదికగా జరిగిన 2025 హండ్రెడ్‌ లీగ్‌ నిన్నటితో ముగిసింది. పురుషుల విభాగంలో ముంబై ఇండియన్స్‌ సిస్టర్‌ ఫ్రాంచైజీ ఓవల్‌ ఇన్విన్సిబుల్స్‌ వరుసగా మూడో ఎడిషన్‌లో ఛాంపియన్‌గా నిలిచి హ్యాట్రిక్‌ సాధించగా.. మహిళల విభాగంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓనర్షిప్‌లోని నార్త్రన్‌ సూపర్‌ ఛార్జర్స్‌ తొలిసారి విజేతగా ఆవిర్భవించింది.

పురుషుల విభాగం ఫైనల్లో ఇన్విన్సిబుల్స్‌ ట్రెంట్‌ రాకెట్స్‌పై 26 పరుగుల తేడాతో విజయం సాధించగా.. మహిళల విభాగంలో సూపర్‌ ఛార్జర్స్‌ సథరన్‌ బ్రేవ్‌పై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ముంబై ఇండియన్స్‌ యాజమాన్యం ఈ సీజన్‌కు ముందే ఇన్విన్సిబుల్స్‌లోని 49 శాతం వాటాను దక్కించుకుంది. వచ్చే సీజన్‌ నుంచి ఈ ఫ్రాంచైజీ పేరు ముంబై ఇండియన్స్‌ లండన్‌గా మారే అవకాశం ఉంది.

నార్త్రన్‌ సూపర్‌ ఛార్జర్స్‌ విషయానికొస్తే.. ఈ ఫ్రాంచైజీపై పూర్తి హక్కులను సన్‌రైజర్స్‌  హైదరాబాద్‌ యాజమాన్యమైన సన్‌ గ్రూప్‌ దక్కించుకుంది. ఈ సంస్ధ సూపర్‌ ఛార్జర్స్‌లోని 100 శాతం వాటాను ఈ సీజన్‌కు ముందే కొనుగోలు చేసింది. ఈ ఫ్రాంచైజీ పేరు కూడా వచ్చే సీజన్‌కు ముందు మారవచ్చు. సన్‌రైజర్స్‌ పేరు కలిసొచ్చేలా సన్‌ గ్రూప్‌ ప్లాన్‌ చేస్తుంది.

మ్యాచ్‌ల విషయానికొస్తే.. మహిళల ఫైనల్స్‌ ఏకపక్షంగా సాగగా.. పురుషుల ఫైనల్స్‌ ఓ మోస్తరుగా నడిచింది. మహిళల ఫైనల్స్‌లో సథరన్‌ బ్రేవ్‌ తొలుత బ్యాటింగ్‌ చేసి నిర్ణీత 100 బంతుల్లో 6 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేయగా.. సూపర్‌ ఛార్జర్స్‌ మరో 12 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. 

సథరన్‌ బ్రేవ్‌లో ఫ్రేయా కెంప్‌ చేసిన 26 పరుగులే అత్యధికం కాగా.. సూపర్‌ ఛార్జర్స్‌ తరఫున నికోలా క్యారీ (35 నాటౌట్‌) టాప్‌ స్కోరర్‌గా నిలిచింది. బౌలింగ్‌లోనూ పర్వాలేదనిపించిన క్యారీకి (20-8-25-0) ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు దక్కగా.. సీజన్‌ ఆధ్యాంతం రాణించిన ఫోబ్‌ లిచ్‌ఫీల్డ్‌ను ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డు వరించింది.

పురుషుల ఫైనల్స్‌లో ఓవల్‌ ఇన్విన్సిబుల్స్‌ తొలుత బ్యాటింగ్‌ చేసి నిర్ణీత 100 బంతుల్లో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేయగా.. ట్రెంట్‌ రాకెట్స్‌ ఛేదనలో తడబడి 142 పరుగులకే పరిమితమైంది. ఇన్విన్సిబుల్స్‌ తరఫున విల్‌ జాక్స్‌ (41 బంతుల్లో 72; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగగా.. మార్కస్‌ స్టోయినిస్‌ (38 బంతుల్లో 64; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) ట్రెంట్‌ రాకెట్స్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. 

నాథన్‌ సౌటర్‌ (20-7-25-3) అద్భుతంగా బౌలింగ్‌ చేసి రాకెట్స్‌ను దెబ్బకొట్టాడు. ఈ ప్రదర్శన కారణంగా సౌటర్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు దక్కింది. సీజన్‌ ఆధ్యాంతం సత్తా చాటిన ఇన్విన్సిబుల్స్‌ బ్యాటర్‌ జోర్డన్‌ కాక్స్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌గా ఎంపికయ్యాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement