
మహ్మద్ సిరాజ్.. ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ బౌలర్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు. ముఖ్యంగా ఇంగ్లండ్‌తో లండన్ వేదికగా జరిగిన ఐదో టెస్టులో సిరాజ్ వేసిన స్పెల్ భారత క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయంగా మిగిలిపోతుంది. ఓటమి ఖాయమైన చోట సిరాజ్ మియా తన బౌలింగ్‌తో మ్యాజిక్ చేశాడు. అయితే గల్లీ క్రికెటర్ నుంచి టీమిండియా ముఖచిత్రంగా మారిన సిరాజ్ తన కెరీర్‌లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. అందులో ఒకటి అతడి తండ్రి మరణం.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2020-21(ఆస్ట్రేలియా)లో సిరాజ్ భారత తరపున టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. అయితే టెస్టుల్లో డెబ్యూ చేసిన కొన్ని రోజులకే అతడి జీవితంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఊపిరితిత్తల వ్యాధితో బాధపడుతున్న సిరాజ్ తండ్రి మహమ్మద్ గౌస్ కన్నముశారు.
కొవిడ్-19 మహమ్మారి సమయంలో ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది. కఠినమైన బయో-బబుల్ నియమం అమలులో ఉండడంతో కనీసం అతడిని ఓదార్చేందుకు సహచరులు సైతం పక్కన లేకపోయారు. అయితే అతడి తండ్రి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు బీసీసీఐ అవకాశం కల్పించింది.
కానీ సిరాజ్ మియా మాత్రం తన తండ్రి మరణాన్ని దిగమింగి జాతీయ విధే ముఖ్యమని ఆస్ట్రేలియానే ఉండిపోయాడు. తాజాగా ఇదే విషయంపై అప్పటి భారత బౌలింగ్ కోచ్ అరుణ్ భరత్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు.
"మేము 2020-21లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాము. మూడో టెస్టుకు ముందు సిరాజ్ తండ్రి మరణించారన్న వార్త మాకు తెలిసింది. అయితే ఆ సమయంలో కఠినమైన బయో-బబుల్ నియమం అమలులోన్నందన అతడిని మేమెవరూ కలవలేకపోయాము.
మాకు అదొక ఫైవ్ స్టార్ జైలులా ఉండేది. కానీ మా మేనేజర్‌కు ప్రత్యేక అనుమతి లభించడంతో సిరాజ్‌ను కలవడానికి వెళ్లాడు. అయితే సిరాజ్‌తో నేను వీడియో కాల్ మాట్లాడాను. నువ్వు తిరిగి వెళ్ళాలనుకుంటున్నావా? అని మేము అతడిని అడిగాము.
కానీ సిరాజ్ మాత్రం తాను టెస్టులు ఆడటం తన తండ్రి కలని, నేను ఇక్కడే ఉంటాను అని అన్నాడు. అతడి మాటలు విని ఆశ్చర్యపోయాను. ఏదేమైనప్పటికి అంతటి బాధలో అతడిని ఓదార్చేందుకు మేమెవరం పక్కన లేకపోయామని" బాంబే స్పోర్ట్స్ ఎక్స్ఛేంజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భరత్ పేర్కొన్నాడు. కాగా ఆ సిరీస్‌లో సిరాజ్ మూడు మ్యాచ్‌లు 13 వికెట్లు పడగొట్టాడు.
చదవండి: The Hundred: టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ..! ఎవరీ డేవినా పెర్రిన్?