ఐపీఎల్ ఫైన‌ల్లో వైభ‌వ్ సూర్య‌వంశీ! | Vaibhav Sooryavanshi Surprise Entry For IPL 2026 Final, Spotted At Ahmedabad Airport, Video Viral On Social Media | Sakshi
Sakshi News home page

ఐపీఎల్ ఫైన‌ల్లో వైభ‌వ్ సూర్య‌వంశీ!

May 31 2026 5:01 PM | Updated on May 31 2026 6:18 PM

Vaibhav Sooryavanshi Surprise Entry For IPL 2026-Final

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో ఎక్కువ‌గా వార్త‌ల్లో నిలిచిన పేరు రాజ‌స్తాన్ రాయ‌ల్స్ ఓపెన‌ర్ వైభ‌వ్ సూర్య‌వంశీ. బ్యాటింగ్ చేసినా, ఫీల్డింగ్ చేసినా, తిన్నా, ప‌డుకున్నా.. ఇలా అత‌డు ఏం చేసినా అది వార్తగానే నిలిచేది. ఎలిమినేట‌ర్‌లో ఎస్ఆర్‌హెచ్‌ను చిత్తు చేసిన‌ప్ప‌టికీ క్వాలిఫ‌య‌ర్‌-2 పోరులో గుజ‌రాత్ టైటాన్స్ చేతిలో ఓట‌మి పాల‌యిన రాజ‌స్తాన్ రాయ‌ల్స్ సీజ‌న్‌ను మూడో స్థానంతో ముగించింది. 

జ‌ట్టు ఓట‌మి పాలైన‌ప్ప‌టికీ వైభ‌వ్ మాత్రం సూప‌ర్ స‌క్సెస్ అయ్యాడు. వైభ‌వ్ సూర్య‌వంశీ ఆట‌ను మ‌రొక్క‌సారి చూస్తే బాగుంటుంద‌ని అభిమానులు ఆశ‌ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో వైభ‌వ్ సూర్య‌వంశీ అభిమానుల‌కు ఒక శుభ‌వార్త‌. అత‌డి ఆట‌ను చూడ‌లేక‌పోవ‌చ్చు కానీ అత‌డిని స్టేడియంలో మ‌రోసారి చూసే అవ‌కాశం మాత్రం ద‌క్క‌నుంది. 

అహ్మ‌దాబాద్ వేదిక‌గా నేడు ఆర్సీబీ, గుజ‌రాత్ టైటాన్స్ మ‌ధ్య‌ జ‌ర‌గ‌నున్న ఫైన‌ల్ మ్యాచ్‌కు వైభ‌వ్ సూర్య‌వంశీ హాజ‌రుకానున్నాడు. అహ్మ‌దాబాద్‌లోని స‌ర్దార్ వ‌ల్ల‌బ్‌భాయ్ ప‌టేల్ అంత‌ర్జాతీయ ఎయిర్‌పోర్టులో వైభ‌వ్ త‌ళుక్కుమ‌న్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఫైన‌ల్ మ్యాచ్ చూసేందుకు వైభ‌వ్ త‌న కుటుంబంతో క‌లిసి అహ్మ‌దాబాద్ వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. 

అంతేకాదు ఫైన‌ల్ మ్యాచ్ ముగిసిన అనంత‌రం వైభ‌వ్ సూర్య‌వంశీని ప్ర‌త్యేకంగా స‌న్మానించే అవ‌కాశం కూడా ఉంది. ఈ సీజ‌న్‌లో 16 మ్యాచ్‌ల్లో 776 ప‌రుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్ర‌స్థానంలో కొన‌సాగుతున్నాడు. ఒక‌వేళ ఇవాల్టి ఫైన‌ల్లో గిల్‌, సాయి సుద‌ర్శ‌న్ త‌క్కువ స్కోర్ల‌కు వెనుదిరిగితే మాత్రం వైభ‌వ్ సూర్య‌వంశీ ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకునే చాన్స్ ఉంది. 

ఈ సీజ‌న్ ఆరంభం నుంచి స్థిర‌మైన ప్ర‌ద‌ర్శ‌న కొన‌సాగిస్తూ వ‌చ్చిన వైభ‌వ్ ఒక సెంచ‌రీ స‌హా ఐదు అర్థ‌సెంచ‌రీలు సాధించాడు. సీజ‌న్‌లో 72 సిక్స‌ర్ల‌తో ఒక సీజ‌న్‌లో అత్య‌ధిక సిక్సర్లు బాదిన క్రికెట‌ర్‌గా నిలిచాడు. ఇక‌  గుజ‌రాత్‌తో మ్యాచ్‌లో 47 బంతుల్లో 96 ప‌రుగులు చేసిన వైభ‌వ్ సూర్య‌వంశీ ఇన్నింగ్స్‌లో ఏడు సిక్స‌ర్లు, 8 ఫోర్లు ఉన్నాయి. 

ఇక ఎలిమినేట‌ర్ పోరులోనూ ఎస్ఆర్‌హెచ్‌పై సునామీ ఇన్నింగ్స్ ఆడిన వైభ‌వ్ 29 బంతుల్లోనే 97 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. వ‌రుస‌గా రెండు మ్యాచ్‌ల్లో సెంచ‌రీ చేజార్చుకున్న‌ప్ప‌టికీ అత‌డి ఆట‌తో అభిమానుల గుండెల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నాడు.

చదవండి: IPL 2026: ఫైనల్‌ మ్యాచ్‌కు ముందు ఆర్సీబీకి షాక్‌!

Advertisement
 
Advertisement
Advertisement