PC: X
పద్నాలుగేళ్ల వయసులోనే ఎనలేని క్రేజ్ సంపాదించుకున్నాడు వైభవ్ సూర్యవంశీ. ఇటు దేశీ క్రికెట్‌లో.. అటు ఐపీఎల్‌లో సత్తా చాటుతూ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. విధ్వంసకర బ్యాటింగ్‌కు పెట్టింది పేరుగా మారిన ఈ బిహారీ కుర్రాడు ఫార్మాట్లకు అతీతంగా అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు.
583 పరుగులు
ఇక ఇటీవలే పదిహేనవ వసంతంలో అడుగుపెట్టిన వైభవ్ సూర్యవంశీ.. ఐపీఎల్-2026లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్‌గా దుమ్ములేపుతున్నాడు. లీగ్ దశలో 14 మ్యాచ్‌లలో కలిపి ఏకంగా 583 పరుగులు రాబట్టాడు. ఇందులో ఓ శతకం ఉంది.
కాగా ఈ సీజన్‌లో రాజస్తాన్ తరఫున లీడ్ రన్‌స్కోరర్‌గా ఉన్న వైభవ్.. ఓవరాల్‌గా టాప్-5లో కొనసాగుతున్నాడు. తన అద్భుత బ్యాటింగ్‌తో రాజస్తాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్ చేరడంలో కీలక పాత్ర పోషించి నీరాజనాలు అందుకుంటున్నాడు.
ఈ క్రమంలో భారత క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన వైభవ్‌కు రోజురోజుకూ ఆదరణ మరింత పెరుగుతోంది. నిజానికి ప్రస్తుతం రాయల్స్ పోస్టర్ బాయ్‌గా వైభవ్ అవతరించాడు. ఈ నేపథ్యంలో రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ వైభవ్ సూర్యవంశీ పట్ల వ్యవహరించిన తీరు విమర్శలకు దారి తీసింది.
వైభవ్ పట్ల రియాన్ ప్రవర్తనపై నెటిజన్లు ఫైర్
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో బుధవారం నాటి ఎలిమినేటర్ మ్యాచ్ కోసం వైభవ్ సహా రాయల్స్ జట్టు మొత్తం ముల్లన్‌పూర్‌కు పయనమైంది. ఈ నేపథ్యంలో ముంబై ఎయిర్‌పోర్టులో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.
సెలబ్రిటీలను కెమెరాలో బంధించే పాపరాజీలు.. రియాన్ పరాగ్‌ను పిలిచి.. ‘రియాన్ వైభవ్‌తో ఒక్క ఫొటో కావాలి’ అని అడిగారు. ఇందుకు.. ‘మేమేమీ సినిమా స్టార్లము కాదు’ అని రియాన్ బదులిచ్చి.. అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
Look at Vaibhav Suryavanshi’s reaction when the paparazzis said to Riyan Parag, “Riyan, Vaibhav ke saath ek photo please,” and Riyan replied, “Hum koi film star nahi hain.” After hearing this, Vaibhav Suryavanshi’s smile disappeared. 👀
Later, the paparazzis said to Vaibhav,… pic.twitter.com/sXsyhTGgCb— Sonu (@Cricket_live247) May 26, 2026
అందరి రికార్డులూ బద్దలు కొడతాడు
దీంతో అప్పటిదాకా చిరునవ్వులు చిందించిన వైభవ్.. కాస్త చిన్నబుచ్చుకున్నాడు. ఇంతలో ఓ పాపరాజీ.. ‘వైభవ్ ఏ సినీ స్టార్ కంటే కూడా తక్కువ కాదు. అతడు అందరి రికార్డులూ బద్దలు కొడతాడు’’ అని పేర్కొన్నాడు.
దీంతో వైభవ్ నవ్వులు చిందించాడు. ఆ తర్వాత అభిమానులతో ఫొటోలు, సెల్ఫీలు దిగి అక్కడి నుంచి ముందుకు కదిలాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మరీ అంత కుళ్లు పనికిరాదు
ఈ నేపథ్యంలో.. ‘‘వైభవ్‌పై మరీ అంత కుళ్లు పనికిరాదు.. జట్టుకు నువ్వు ఏ రకంగా ఉపయోగపడుతున్నావు?.. పిల్లాడిని ఇంతలా అప్‌సెట్ చేస్తావా? నీ ఇగోకు మూల్యం చెల్లించకతప్పదులే’’ అని నెటిజన్లు రియాన్‌ను ట్రోల్ చేస్తున్నారు.
కాగా రాజస్తాన్ విజయాల్లో ఆటగాడిగా రియాన్ పాత్ర పెద్దగా లేదు. పైగా ఇటీవల డ్రెసింగ్‌రూమ్‌లో చట్టవిరుద్ధంగా ఇ- సిగరెట్ తాగుతూ కెమెరాలకు చిక్కి రాజస్తాన్ పరువు తీశాడు. ఇందుకు బదులుగా బీసీసీఐ జరిమానాతో సరిపెట్టగా.. రియాన్ ఊపిరి పీల్చుకున్నాడు.


